నీవు జగన్నాథుఁడవు నే నొకజీవుఁడ నింతే
నీవలె ననుభవించ నే నెంతవాఁడను
వైకుంఠపదమేడ వడిఁ గోర నెంతవాఁడ
యీకడ నీదాసుఁడనౌటిది చాలదా
చేకొని నీసాకారచింత యేడ నేనేడ
పైకొని నీడాగు మోచి బ్రదికితిఁ జాలదా
సొంపుల నీయానందసుఖ మేడ నేనేడ
వంపు శ్రీవైష్ణవసల్లాపన చాలదా
నింపుల విజ్ఞాన మేడ నే దెలియ నెంతవాఁడ
యింపుగా నీకథ వినుటిదియే చాలదా
కైవల్యమందు నీతో కాణాచి యాడ నాకు
శ్రీవేంకటాద్రిమీఁది సేవ చాలదా
యీవల శ్రీవేంకటేశ నీ విచ్చిన విజ్ఞానమున
భావించి నిన్నుఁ బొగడే భాగ్యమే చాలదా
భావ వివరణ:
ఓ దేవదేవా! నీవు జగన్నాథుడవు. పరమాత్మవు. మరి నేనో, ఒక జీవుడను, నీవు సర్వ భోక్తవు. నీవలె అనుభవించుటకు నేనెంతవాడను ప్రభూ! నీవు వైకుంఠము నీయగల సమర్థుడవె. కాని నీవు వైకుంఠమెక్కడ నేనెక్కడ? దాన్ని కోరే అర్హత నాకున్నదా? అయితే అయిందిలే స్వామీ! | ఇక్కడ నీదాసుడను అనిపించుకొంటే నాకదే పదివేలు. కొంతమంది నిన్ను సాకారంగా ప్రత్యక్షం చేసికొనవలెనని కోరుకుంటారు. కానీ నేనెక్కడ | నీసాకార దర్శనమెక్కడ! ఏదో ఈ వైష్ణవదీక్షలో నీతిరునామము, ఒంటిపై శంఖచక్ర చిహ్నములు నాకు చాలునయ్యా! ఇట్లా పైకొని (నా శరీరంపై దాల్చిన) వాటితో బ్రతికితే అది చాలు నాకు.
సొంపైన నీ బ్రహ్మానందానుభవంతో కలిగే సుఖము నాకు సాధ్యమా తండ్రీ! అదెక్కడ నేనెక్కడ? కానీలే నాకు నీ వైష్ణవ సల్లాపములు (ప్రవచనములు) చాలును. ఇంపైన విజ్ఞానము (భగవంతుని గురించి జ్ఞానము) కోటికొక్కడికి దక్కుతుంది దాన్ని తెలుసుకోవటానికి నేనెంత | వాడను ప్రభూ! ఏదో నీకథాశ్రవణంతో నా బ్రతుకును గడిపేస్తాను నాకది
చాలును.
కైవల్యము అంటే నీతో వుండిపోయే భాగ్యం పొందటమే. ఆమోక్షస్థానమే చిరకాల వాస స్థానము (కాణాచి) అదెక్కడ, నేనెక్కడ? ఇదిగో నీవేంకటాద్రి మీద నీసేవ నాకుండగా అనవన్నీ నాకెందుకయ్యా? ఓ శ్రీవేంకటేశ్వరా! ఇకపై నీవు ఇచ్చిన ఈ విజ్ఞానంతో భాలించి నిన్ను కీర్తిస్తూ బ్రతికేస్తాను. నాకు ఆ భాగ్యం చాలు. ఇంకేదీ వద్దు గాక వద్దు.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)