Sunday, June 29, 2025

కనుఁగొనఁగ జీవుఁ డెరఁగఁ - Kanugonaga Jivuderaga

కనుఁగొనఁగ జీవుఁ డెరఁగఁడుగాక యెరిఁగినను
ఆనవరతవిభవంబు లప్పుడే రావా

విసుగ కెవ్వరినైన వేఁడనేర్చిన నోరు
దెసలకును బలుమారుఁ దెరచు నోరు
వసుధాకళత్రుఁ దడవదుగాక తడవినను
యెసఁగఁ గోరికలు తన కిప్పుడే రావా

ముదమంది యెవ్వరికి మ్రొక్కనేర్చిన చేయి
పొదిగి యధముల నడుగఁబూను చేయి
అదన హరిఁ బూజసేయదుగాక సేసినను
యెదురెదురఁ గోరికలు యిప్పుడే రావా

తడయకేమిటికైనఁ దమకమందెడి మనసు
అడరి యేమిటికైన నలయు మనసు
వడి వేంకటేశుఁ గొలువదుగాక కొలిచినను
బడిబడినె చెడనిసంపద లిట్లు రావా

Watch for audio - https://youtu.be/-lYT6PLHVDE 

బుద్ది చెప్పవయ్య నేను - Buddhi Ceppavayya Nenu

బుద్ది చెప్పవయ్య నేను పూఁచి వినేను
గద్దరిఁగా నెపుడు సిగ్గరిదాన నేను

ఆమగువకు నీవు అన్నిటా మోహింతు వంటి
యేమనవలెను నానతీవయ్యా
గామిడిదానఁ గాను కతలు నీవే నేరుపు
కామించి వచ్చిన వాసికత్తెనే నేను

చాయల నాపెకు నీకు సరిఁ బొందుసేసితి
సేయవలసినపని చెప్పవయ్యా
రాయడించేదానఁ గాను రచ్చలఁబెట్టకు నీవే
పాయముతోడిమానాపతిదాన నేను

కూడా నీతోనున్నాపెకూటములు చూచితి
చూడవలసిన వింకాఁ జూపించవయ్యా
వోడక భూపతిచెర్వువొద్ది శ్రీవేంకటేశ్వర
జాడ నన్నేలితివి యిచ్చకురాల నేను

Watch for audio - https://youtu.be/rY2PpqGlmHc 

బ్రహ్మాదులకు నిదే - Bramhadulaku Nide

బ్రహ్మాదులకు నిదే పరచింత
బ్రహ్మఁ గన్న తండ్రియైన పరమాత్మచింత

మూఁడు లోకములకెల్లా మొదలిచింత
మేడెపుఁ గర్మములకు మీఁదిచింత
తోడ జనించిననాటి తొల్లిటిచింత
వోడక మాకుఁ గలిగె నొక్కటే చింత

అంగములోవెదకేటి యానందచింత
నింగివలెఁ బొడచూపే నిర్మలచింత
కుంగేటి భోగములకుఁ గొనచింత
వుంగిటఁగలిగె మాకు నోహో యీచింత

కిందు మీఁదు నేకమైన కేవలచింత
సందు లేక నిజమైన సహజచింత
కందువ శ్రీవేంకటేశుఁ గన్నచింత
యిందునే మాకుఁ గలిగే నితఁడే చింత

Watch for audio -  https://youtu.be/8D-kcQ1CkhI 

నీతితో నడచితేను - Neethitho Nadachithenu

నీతితో నడచితేను నెగులే లేదు
జాతి దప్పకుండితేను చలమే ఫలము

వొలిసి కై కొంటేను వొగరైనాఁ దీపే
తెలిసితేఁ దనలోనే దేవుఁడున్నాఁడు
పలుకులు మంచివై తే పగవారుఁ జుట్టాలే
చెలఁగి దిష్టించితేను చీఁకటిల్లు వెలుఁగు

నేరిచి బతికితేను నేలెల్లా నిధానము
వోరిచితేఁ దనపంత మూరకే వచ్చు
సారెకు నుతించితేను చట్టైనాఁ గరఁగును
వూరకే గుట్టుననుంటే వూరికెల్లా నెక్కుడు

వాడికె సేసుకొంటేను వలపెల్లా నిలుపౌను
వేడుకతో నుండితే వెనకే ముందౌను
యీడులేని శ్రీవేంకటేశ్వరుఁ గొలిచితేను
జాడుపడ్డపనులెల్లా సఫలమౌను

Watch for audio - https://youtu.be/-EipGN7o6yk 

నారాయణ నీనామము - Narayana Ni Namamu

నారాయణ నీనామము బుద్ధిఁ
జేరినాఁ జాలు సిరులేమి బాఁతి

ననుపైన శ్రీవిష్ణునామము పేరు-
కొనఁగానే తేఁకువమీరఁగా
ఘనమైనపుణ్యాలు గలుగఁగా తమ-
కనయముఁ బరమది యేమిబాఁతి

నలువైన శ్రీహరినామము మతిఁ-
దలఁచిననాబంధము లూడఁగా
యెలమి దీనిఁ బఠియించినా యీ-
కలుషములేల కలుగు నెవ్వరికి

వేంకటపతి నామవిభవము కర్మ
పంకములెల్లఁ బరిమార్పఁగా
బింకమై తలఁపెడి ప్రియులకుఁ యెందు-
నింక నీసుఖ మిది యేమిబ్రాఁతి 

Watch for audio - https://youtu.be/otV7_eukP4o 

ఏల వూరకున్నాఁడవో - Ela Vurukunnadavo

ఏల వూరకున్నాఁడవో యెఱఁగము నేము నిన్ను
చాలా నమ్మి శరణంటే సమకూడరాదా

ఱాలు గరఁగించు నీఱట్టడిపాదము
కాలుచాఁచి సతులఁ గరఁగించు టరుదా
కీలించి మిన్ను నేల దొంగిలిన నీ చేయి
తాలిమి సతులమతి దక్కఁగొనలేదా

మాఁకులలోనైనా నుండి మాటలాడే నీనోరు
కాఁకలమాటల జెలి గారవించు టరుదా
మూఁకవనితలసిగ్గు ముంగిట వేసేకన్నులు
ఆఁక నీసతి మోహ ముందుకొనలేదా

ముంచి కాంత నురమున మోచుకుండే నీ మేను
ఇంచుకు పరిసురత మిందు కోర్చుటరుదా
యెంచఁగ శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
మంచముపై నుండి మీరు మమ్ము నంపవలదా

Watch for audio - https://youtu.be/1Y0ySAXwev4 

ఆతఁడే యిన్నియు నిచ్చు - Atade Inniyu Nichu

ఆతఁడే యిన్నియు నిచ్చు నడిగినవల్లాను
చేతిలోనే వుండఁగాను చింతించరు హరిని

వలెనంటే సంపదలు వట్టి యలమటఁబెట్టు
అలసి వోపనంటేను అండనే వుండు
తలఁచి యిందరు నీతరితీపులఁ జిక్కి
తలఁచ రెందును బరతత్త్వమైనహరిని

ఆసపడితే నింతులు అన్నిటాను బిగుతురు
వాసితో నుంటేనే తామే వత్తు రొద్దికి
పోసరించి యిందరు నీ పొందులభ్రమలఁ బడి
పాసివున్నారదే తమపతియైన హరిని

గట్టిగా రాతిరెల్లాను కలయై యుండు జగము
పట్టపగలైతే తమపాల నుండును
బట్టబయలు పందిలి పెట్టేరుగాని చే-
పట్టరు శ్రీవేంకటాద్రిపైనున్న హరిని

Watch for audio - https://youtu.be/GLxf5X6iaVA 

ఆదిమునుల సిద్ధాంజనము - Aadi Munula Sidhanjanamu

ఆదిమునుల సిద్ధాంజనము
యేదెసఁ జూచిన నిదివో వీఁడే

నగినసెలవిఁ బడు నాలుగుజగములు
మొగమునఁ జూపే మోహనము
నిగిడి యశోదకు నిధానంబై
పొగడొందీ గృహమున నిదె వీఁడే

కనుదెరచిన నలుగడ నమృతము లటు
అనువునఁ గురిసీ నపారము
వనితలు నందవ్రజమునఁ జెలఁగఁగ
మనికికి నిరవై మలసీ వీఁడే

పరమునకునుఁ దాఁ బరమై వెలసిన-
పరిపూర్ణ పరాత్పరుఁడు
సరుస రుక్మిణికి సత్యభామకును
వరుఁడగు వేంకటవరదుఁడు వీఁడే

Watch for audio - https://youtu.be/U_dUDtqmP_8