Sunday, August 24, 2025

అప్పులేని సంసార - Appuleni Samsara

అప్పులేని సంసార మైనపాటే చాలు
తప్పులేనిజీత మొక్క తారమైనఁ జాలు

కంతలేని గుడిశొక్క గంపంతయినఁ జాలు
చింతలేని యంబలొక్క చేరెఁడు చాలు
జంతగాని తరుణి యేజాతైన నదె చాలు
వింతలేని సంపదొక్క వీసమే చాలు

తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదె చాలు
ముట్టులేని కూడొక్క ముద్దెఁడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైనఁ జాలు
వట్టి జాలిఁ బడుకంటే వచ్చినంతే చాలు

లంపటపడని మేలు లవలేశమే చాలు
రొంపి కంబమౌ కంటె రోయుటే చాలు
రంపపుఁ గోరిక కంటె రతి శ్రీ వేంకటపతి-
పంపున నాతనిఁ జేరే భవమే చాలు

Watch for audio - https://youtu.be/C31GsLaxxBg 

ఏఁటికి విచ్చేసితివో - Etiki Vichesitivo

ఏఁటికి విచ్చేసితివో యెట్టుదెలుసు మాతో
మాటలాడఁగా నీకు మాటవచ్చీఁ జుమ్మీ

అప్పన గొంటివో లేదొ ఆకెచేత నేఁడైనా
ఇప్పుడే మాయింటిదాఁక నేఁగేనంటా
యిప్పటి యీతమకాన యింతలోని పనికిఁగా
చెప్పక వచ్చిననాకె చేరనీదు సుమ్మీ

అనుచరించితో లేదో ఆకెనే ముందరనైనా
వెనక నాతోడ నవ్వేవు గాని
ఘనుఁడ వూరకే నన్నుఁ గదిసేవు కడుఁబై-
కొనఁగ నాకె విన్న కోపగించుఁ జుమ్మీ

ఆరగించితో లేదో ఆకెపొత్తుననే యింత
గారవము లేక మోము కళదేరదు
చేరి కూడితివి నన్ను శ్రీ వేంకటేశుఁడ యింత-
యీరసాన నాకె విన్న యేమనునో సుమ్మీ

Watch for audio - https://youtu.be/gGRuLgsMcfc 

నారాయణుని శ్రీ నామమిది - Narayanuni Sri Namamidi

నారాయణుని శ్రీ నామమిది
కోరినవిచ్చీఁ గోవో మనసా

శుకవరదుని సొంపుగఁ దలఁచుటె
సకలభవ విజయము
అకలంకము మహాభయహరణ
మొకటి నొకటి వోహో మనసా

పక్షిగమనుని శుభము (పదము) దలఁచుటే
అభయభోగ విహారమ్ము
వక్షపు లక్ష్మీవరుచే సిరులు
లక్షలు గోట్లొల్లవొ మనసా

ఇంకా నీతలఁపులెన్ని గలిగిన
వేంకటాధిపు సేవించఁగదో
అంకెలకిన్నియునైన యీ
మంకపు గాక నమ్మవో మనసా

Watch for audio - https://youtu.be/gsMCCYFGi0I 

వేఁటకాఁడనంటా - Vetakaada Nantaa

వేఁటకాఁడనంటా నా వెంటఁ బాయవు వోరి
చీటకపు చెంచేత నాచేతిలాగెరఁగవా

పొదలో నేనేసిన పులి నీవేసితివని
పెదపెద్ద యెలుగుఁల బెదరించేవు
కుదురుగుబ్బల నిన్నుఁ గుమ్ముదునో వుండేవో మేను
చిదియఁగా మేటిచెంచేత నన్నెఱఁగవా

చేరువ నామోఁటునఁ జేరిన నామెకముల
నేరుపరినంటా నీవునేసేవు
జీరలుగా కొమ్ము గోరఁ జింతునో వూరకుండేవో
పేరుకల చెంచేత నాబిరుదులెరఁగవా

చొల్లెపు చుట్టలతోడ చూపులకు నడ్డాలు
చెల్లునంటా వచ్చి చెట్టవట్టేవు
వొల్లననఁగా గూడేవు వుద్దండపు వేంకటేశ
జల్లివింటి చెంచేత నాచలములెరఁగవా

Watch for audio - https://youtu.be/dOHuWLeJ3TA 

నారాయణ నీదాసుల - Narayana Nidasula

నారాయణ నీదాసుల నడకలివి
ధారుణి నిదేపనై తగులఁగవలెను

ఆతుమలో హరిమీఁది ఆందోళమే వలె
చేతికి లోఁగాకుంటేను చింతించవలె
ఆతనిఁ జూచేయందుకు నాసలఁ బొరలవలె
రీతినివెప్పుడు విచారించుకొనవలెను

నీలవర్ణుకథలకు నివ్వెరగు నొందవలె
ఆలకించి యందు భ్రమయఁగవలెను
తాలిమితో మహిమలు దలపోసుకొనవలె
వేళ వేళ ధ్యానించి వెదకఁగవలెను

చేరి శ్రీవేంకటేశు సేవించుకుండఁగవలె
గారవాన సదా మరుగఁగవలెను
ఆరసి పెద్దలనన్నీ నడుగుచుండఁగవలె
నోరునిండా నేపొద్దూ నుతియించవలెను

Watch for audio - https://youtu.be/FLfoDhRDiFM 

మెచ్చెనొకరాగంబు - Mecche Nokaraagambu

మెచ్చెనొకరాగంబు మీఁద మీఁద కడు-
నిచ్చెనొకరాగంబు యింతులకునెల్ల

చేసెనొకరాగంబు చెలియెదుటఁ గన్నులనె
మూసెనొకరాగంబు ముదిత మతినె
పూసెనొకరాగంబు పొలిఁతిపులకలమేన
వ్రాసెనొకరాగంబు వనిత నినుఁబాసి

పట్టెనొకరాగంబు ప్రాణములపై నలిగి
తిట్టెనొకరాగంబు తిరిగి తిరిగి
పుట్టెనొకరాగంబు పొలఁతిడెందమునకును
మెట్టెనొకరాగంబు మెరయుచునె కదలి

కురిసెనొకరాగంబు కొప్పు పువ్వులనె సతి
మురిసెనొకరాగంబు ముంచి మేన
తిరువేంకటేశ్వరుఁడ తెలుసుకో నినుఁబొంది
పొరసెనొకరాగంబు పొలఁతికుచములనే

Watch for audio - https://youtu.be/pX8cePivqGM 

ఎక్కడి పుట్టుగు లిఁక - Ekkadi Puttugu Lika

ఎక్కడి పుట్టుగు లిఁక నెక్కడి మరణములు
మిక్కిలి నీ ముద్రలు నా మేననున్న వివిగో

కెరల పాపములకుఁ గెరల కర్మములకు
హరి నీనామము నోర నంటితేఁజాలు
నరకము లేమిసేసు నానేర మేమిసేసు
నిరతి నామతిలోన నీ వుండఁగాను

చిక్క నింద్రియములకు చిక్కను బంధములకు
చొక్కి హరి నీ మఱఁగు చొచ్చితిఁ జాలు
మొక్కనేలే యెవ్వరికి మొరవెట్ట నేమిటికి
నిక్కపు మా యిలువేల్పు నీవై వుండఁగా

దగ్గరవు మాయలింక దగ్గరవు దుర్గుణాలు
నిగ్గుల శ్రీవేంకటేశ నీవు గల్గఁగా
యెగ్గులేదు తగ్గులేదు యిఁక నీదాసులలోన
వుగ్గువలె నీప్రసాద మూనినది వొడల

Watch for audio - https://youtu.be/rQV9pjjOajQ 

అఱిముఱిఁ జూడఁబోతే - Arimuri Judabote

అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను
మఱఁగు చొచ్చితి మీకు మహిలో నారాయణా

నిన్ను ధ్యానము సేసీని నిచ్చనిచ్చఁ దాళ్లపాక-
అన్నమయ్యఁగా రెదుట నదిగోవయ్య
పన్ని యాతనినే చూచి పాతకులమైనమమ్ము
మన్నించవయ్య వో మధుసూదనా

సంకీర్తనలు సేసీ సారెఁ దాళ్లపాకన్నయ్య
అంకెల నీసన్నిధినే అదిగోవయ్య
అంకించి నే వారివాఁడనని దుష్టుడనైనా నా-
సంకెదీరఁ గావవయ్య సర్వేశ్వరా

పాదాలం దున్నాఁడు దాళ్లపాకన్నమయ్య మీకు
ఆదరాన ముక్తుఁడై అదిగోవయ్య
యీదెస శ్రీవేంకటేశ యీసమ్మంధాననే నన్ను
నీదయపెట్టి రక్షించు నెమ్మది భూరమణా

Watch for audio - https://youtu.be/gP-Qx3RvrUM 

కామక్రోధవికార - Kaama Krodha Vikaara

కామక్రోధవికార జలనిధికి కలశభవుఁడు మీ నామము
భీమగుణత్రయ బిసకాండములకు బిరుదుహంస మీ నామము

బహుళదురిత పటుపటల మను ఘన
గహన దావశిఖి గణుతింపఁగ మీ నామము
సహజ కలుషతమిస్రము దొలగింపఁగ నహ
రహముల వెలిఁగెడి రవి బింబమైనది మీ నామము

జననబంధదోషములను గిరులకు
ననుపమ మగు నిష్టుర నిర్ఘాతం బరయఁగ మీ నామము
ఘనసంసారం బను పెనుసర్పం
బునకును ముదమున గరుడుఁడు మీ నామము

తీరని పంచేంద్రియ మేఘములకు
ఘోరమారుతవిహారం బైనది మీ నామము
శ్రీరమణీశ్వర శ్రీవేంకటపతి
ధారుణిఁ బొగడఁగఁ దగినది మీ నామము 

Watch for audio - https://youtu.be/aEbNUf2FNDA