Sunday, April 26, 2026

ఇతఁడే బ్రహ్మస్వరూపము | Itade Brahma Swarupamu

ఇతఁడే బ్రహ్మస్వరూప మితఁడే పరతత్వము
యితఁడే స్వయంవక్త మిటని తలఁచుఁడీ

హరి వేంకటాద్రి నుండు నని పురాణములు చెప్పు
పరమేష్టికి విశ్వరూపము చూపినందుకు
సరుసనే జనులకు స్వప్నములో మాటలాడి
పరుషలకు వరాలు పైపై నిచ్చీని

మునులు పూజించి రట మున్నే యీ మూర్తిని
సనకాదియోగీంద్రు లిచ్చటనే వెదకిరటా
యెనలేని మహిమలు యెప్పుడునుఁ గలవట
ఘనదివ్య జ్ఞానసిద్దిగలవాఁడట

అలమేల్మంగ వురమందుఁ గాఁపుర మున్నది
యిల శ్రీవేంకటేశుఁ డితఁడై వున్నాఁడు
తలఁప నితనిపేరే ధరించిరి లోకు లెల్లా
తెలుసుకొంటేఁ దానే దృష్టదేవుఁడు

Watch for audio - https://youtu.be/cyfAyIH2rQM 

నమితదేవం భజే | Namita Devam Bhaje

నమితదేవం భజే నారసింహం
సుముఖకరుణేక్షణం సులభ నరసింహం

విజయ నరసింహం వీర నరసింహం
భుజబలపరాక్రమస్ఫుట నృసింహం
రజనీచరవిదళనవిరాజిత నృసింహం
సుజనరక్షక మహాశూర నరసింహం

దారుణనృసింహం ప్రతాప నరసింహం
చారుకల్యాణ నిశ్చల నృసింహం
ధీరచిత్తావాస దివ్య నరసింహం
సారయోగానందచతుర నరసింహం

విమల నరసింహం విక్రమ నృసింహం
కమనియ్యగుణగణాకర నృసింహం
అమితసుశ్రీవేంకటాద్రి నరసింహం
రమణియ్యభూషాభిరామ నరసింహం 

భావామృతం :
ఓ నృసింహ దేవా! నీకు నేను వినయముగా నమస్కరించి సేవించెదను. నీవు చక్కని వదనారవిందముతో ఒప్పుచున్న సుముఖుడవు. నీ చూపులు కరుణ తొణికిసలాడు తుంటాయి. ఆర్తులైన నీ భక్తులను సులభముగా అనుగ్రహించు స్వభావము కలవాడవు.
ఓ నారసింహా! నీవు విజయములను పొందెడి వీర నరసింహుడవు. హిరణ్యకశిపుని అమాంతం ఎత్తుకొనిన భుజబలము కలిగిన నరసింహా నీ పరాక్రమము ఒక్కసారిగా స్ఫుటమైనది (స్పష్టమైనది). రజనీచరులు (చీకటిలో సంచరించు రాక్షసులను) విదళన (తుత్తునియలు చేయుచూ) విరాజితుడై (దీప్తించుచూ విలసిల్లిన) నారసింహుడవు. సుజనులను రక్షించు మహాశూరుడవు.
ఓ దేవా! నువ్వు దారుణ పరాక్రమము గల (భయంకరమైన ప్రతాపముగల) నరసింహుడవు. అందమైన, మంగళకరమైన గుణములతో నొప్పు వాడవు. నిశ్చల స్వభావము కలవాడవు. ధీరత్వం కలిగిన చిత్తము వున్నవాడవు, దివ్యమైన నరసింహుడవు. సమయస్ఫూర్తిగల యోగా నరసింహుడవు.
ఓ దేవదేవా! నీవు విమల నరసింహుడవు (నిర్మల స్వభావము గలవాడవు). పరాక్రమము ప్రదర్శనచేయువాడవు. మనోహరమైన గుణగణములు సాకారంగా రూపుదిద్దుకొనిన వాడవు. అంతులేని మంగళకరమైన వేంకటాద్రి నిలయుడవైన నరసింహుడవు. అనగా వేంకట నరసింహుడవు. అందమైన ఆభరణములతో విలసిల్లుచున్న మనోజ్ఞ నరసింహుడవు. అట్టి నిన్ను వినయముతో సేవించెదను తండ్రీ!
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/mzWIjngcAvM 

ఇది నీ మాయో యింద్రజాలమో | Idi Ni Mayo Indrajalamo

ఇది నీ మాయో యింద్రజాలమో యేమియు నెఱుంగను
సదరపు నా కర్మవశంబున నే సంకల్పించెదనో యెఱుంగను

నరకము లనుభవించే యప్పుడు నా యాతనాదేహంబు
నరములతో నఱకుదురు యమభటులు నలియ దప్పటిఁ జరుగును
సరి నసిపత్రములు నాఁటు నమయ దెంతైనాఁ జిగిరింపుచుండు
వరుసఁ దప్తలోహ తైలంబులలో వైతురు పోవదు వెను తగులు

అంతట నొకతల్లికడుపునఁ బుట్టదు అతికోమలమగు మేను మోచుకొని
వంతుల బాల్య కౌమారయౌవన వయసులఁ బెక్కు భావము కాదు
కాంతలఁ గవయుదు రక్తమాంసములుఁ గమ్మటి నూరునుయేమిటాఁ
వింతగా నాహారంబులు గొందును వెన నాఁకలియునుఁ దీరదు

మెఱయఁగఁ గలలోన నన్నియుఁ గందును మేలుకాంచితే సటలౌను
మఱచితిఁ దలఁచతి సర్వాపరాధములు మతి యన్నియునేఁ జేసితిని
తఱితో శ్రీవేంకటేశ నాపాలిటి దైవమ యలమేల్మంగపతి
గుఱిగా నా విన్నప మవధరించు గోవింద గోవింద గోవిందా

భావ వివరణ:
ఓ దేవదేవా! ఇది (ఈ ప్రపంచము) నీ ఇంద్రజాలము వలన కల్పింపబడిన మాయయా? నేనేమియు యెఱుంగలేకున్నాను. సదరపు (సమానమైన) నా కర్మకొలదీ నేనే సంకల్పించుచున్నానో లేక భగవత్ ప్రేరేపితమో నేనెఱుంగను.
ఇప్పుడు జరుగుచున్న నా జన్మగురించే ఆలోచిద్దాం. నేను చనిపోగానే నరకమే సంప్రాప్తించవచ్చును. ఆ నరకమును అనుభవించేటప్పుడు నాకు ఒక యాతనా శరీరమునిస్తారట. ఆ శరీరాన్ని కాలిస్తే మంట పుడుతుందేకాని తగలబడిపోదు. దాన్ని కోస్తే తీవ్రమైన నొప్పి కలుగుతుందేకాని నెత్తురు రాదట. కఱ్ఱలతో కొడితే ఎముకలు విరిగినంత బాధ కలుగుతుంది కానీ ఒక్క యెముక కూడా విరగదట. ఆహా! యమభటులు నరకములు తెగునట్లు ఈ యాతనా శరీరాన్ని నరుకుతారుట "అసిపత్రము”లని కత్తులవంటి ఆకులుగల చెట్లు ఆ నరకంలో అసంఖ్యాకంగా వుంటాయట. నన్ను ఆ చెట్లు యెక్కిస్తారట. వరుస దప్పకుండా లోహపు పాత్రలలో మరుగుతున్న నూనెలో ఈ యాతనా శరీరాన్ని వేపుతారట (వేయించెదరట) అట్లా చేస్తేనేకాని, వెనుతగులు (గత జన్మకర్మ) పోవడు (తీరదు). అసిపత్రవనంలో ఈడ్చినా ఆయాతనాశరీరం, సమయదు (నశించదు), అలిసిపోదు, అప్పటి మరల మరల) యాతన అనుభవించడానికి సిద్ధమే. ఓ పరమాత్మా! ఇంత శిక్ష అవసరమా ప్రభూ! మొదటనే మాకు చెడు అంటకుండా చేయరాదా?
సరే, యమలోకబాధలయ్యాక, మళ్ళీ ఈ జీవిని ఇంకొక తల్లి కడుపులో ప్రవేశపెడతావు. అ తరువాత నిర్ణీత సమాయానికి అతి కోమలమైన లేత శరీరం మోస్తూ నేలపై చేరుతాను. వంతుల (వరుసగా) బాల్యము, | కామారము, యౌవనము అను వయస్సులలో ఆయా దశలకు సహజమైన భావావేశములను పొందుతుంటాను. అనేకమంది కాంతలను గూడుదును. ఆ శరీరంలో రక్త మాంసములున్నంత వరకు అ అకలి తీరేది కాదు. ఏరోజుకారోజే పరగడుపు. ఆ తృష్ణకు అంతే వుండదు.
నిద్రించినపుడు యేవికారము భ్రాంతి, రాగద్వేషములు లేని నిశ్చలుడనే. కలలో కూడా అంతే. కానీ మేల్కొనగానే సటలౌను (కపటము మొదలవుతుంది. అన్ని వికారాలు అరిషడ్వార్గాలూ మళ్ళీ అంతా యధాతధంగా జరుగుతూనే వుంటాయి. అన్ని అపరాధాలూ నావల్లనే జరుగుతాయి. ఇవన్నీ మతివుండి నేను జేసినవే. వీటికి నేను బాధ్యుడను కానని యెలా అనగలను? ఓ శ్రీవేంకటేశ్వరా! తఱితో (ప్రయత్నముతో) నేను నీ దాసుడనైనాను. అలమేల్మంగ విభుడవైన ఓ ప్రభూ! నాపాలి దైవము నీవేనయ్యా! గుణితో నా విన్నపమును మన్నింపుమయ్యా! ఓ గోవిందుడా! అవధరింపుమయ్యా! (అనుగ్రహింపుమయ్యా!)
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/DJaJ7Bshu8k 

అందరి కాధారమైన‌ | Andarikadharamaina

అందరి కాధారమైన‌ఆదిపురుషుఁ డీతఁడు
విందై మున్నారగించె విదురునికడ నీతఁడు

సనకాదులుగొనియాడెడి సర్వాత్మకుఁ డీతఁడు
వనజభవాదులకును దైవంబైనతఁ డీతఁడు
యినమండలమునఁ జెలఁగేటిహితవై భవుఁ డీతఁడు
మునువుట్టిన దేవతలకు మూలభూతి యీతఁడు

సిరులొసఁగి యశోదయింట శిశువైనతఁ డీతఁడు
ధరనావులమందలలో తగఁ జరించె నీతఁడు
సరసతలను గొల్లెతలకుఁ జనవులొసఁగె నీతఁడు
ఆరసి కుచేలునియడుకు లారగించె నీతఁడు

పంకజభవునకును బ్రహ్మపద మొసఁగెను యీతఁడు
సంకీర్తన లాద్యులచే జట్టిగొనియె నీతఁడు
తెంకిగ నేకాలముఁ బరదేవుఁడయిన యీతఁడు
వేంకటగిరిమీఁద బ్రభల వెలసినఘనుఁ డీతఁడు 

భావామృతం :
సృష్టిలో ప్రతిజీవికీ ఆధారమైన ఆదిమపురుషుడు ఈ మహానుభావుడే. ద్వాపరయుగంలో ఆయన రారాజు దుర్యోధనుని వద్దకు పాండవరాయబాగా వెళ్ళి దాసీపుత్రుడైనా యోగ్యుడైన విదురుని ఇంట్లో బసచేసి భుజించాడు. రాజభోగం తిరస్కరించాడు.
సనక సనందనాది మునివర్యులు కీర్తించెడి సర్వాత్మస్థితుడీ నారాయణుడే. బ్రహ్మదులకు ఈయన దైవస్వరూపుడు. సూర్యమండలమున గొప్పవైభవముతో వెలుగొందెడి తేజోమూర్తి ఈ స్వామియే. వామనావతరంలో దేవతలకు అనుజుడై పుట్టి అదుకొనిన కరుణా సముద్రుడు ఈ జగద్రక్షకుడు.
గోపెమ్మ యశోదకు వైభవ మొసగి ఆమెనట్టింట శిశువై మురిపించినదీ మహానుభావుడే. భూమిపై ( వైకుంఠనాధుడు) గోపాలుడై ఆవులమందను కాచిసంచరించినదీతడే. అక్షరమ్ముక్కరాని గోపకాంతలకు సామీప్యమోక్షమును అనుగ్రహించిన శృంగారమూర్తియూ ఈ లోకేశ్వరుడే. గుప్పెడటుకులు తినిపించిన కుచేలునకు కొల్లలుగా సిరులిచ్చి కరుణతో జూచిన కరుణామూర్తి ఈ భగవానుడు.
పద్మసంభవుడైన చతుర్ముఖబ్రహ్మకు సృష్ఠి బాధ్యతనొసగినదీ ఆదిదేవుడే. సంకీర్తనజేయు భక్తులచే వెలకుతీయబడిన స్వామి ఈయనే కదా! ఏ కాలముననైనా పరదేవుడయిన స్వామికి నివాసస్థానమై వెలసినది వేరెవరోకాదు వేంకటగిరి మీద వైభవముతో వెలసిన ఘనుడైన ఈ శ్రీవేంకటేశ్వరుడే.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/j7pazD6CJDc 

పలుకుఁతేనెల తల్లి | Paluku Tenela Talli

పలుకుఁదేనెల తల్లి పవళించెను
కలికితనముల విభునిఁ గలసినది గాన

నిగనిగని మోముపై నెఱులు గెలఁకులఁ జెదర
పగలైన దాఁకఁ జెలి పవళించెను
తెగని పరిణతులతోఁ దెల్లవాఱినదాఁక
జగదేకపతి మనసు జట్టిగొనెఁగాన

కొంగుజాఱిన మెఱుఁగు గుబ్బలొలయఁగఁ దరుణి
బంగారు మేడపైఁ బవళించెను
చెంగలువ కనుఁగొనల సింగారములు దొలఁక
నంగజగురినితోడ నలసినదికాన

మురిపెంపు నటనతో ముత్యాలమలఁగుపై
పరవశంబునఁ దరుణి పవళించెను
తిరువేంకటచలాధిపుని కౌఁగిటఁ గలసి
యరవిరైనునుఁ జెమట నంటినదికాన 

భావామృతం
తేనెలూరు తీయని పలుకులు మాట్లాడే అలమేలు మంగమ్మ తల్లి నిదురించుచున్నది. స్త్రీకి పరిపూర్ణత్వమును కలిగించే పతితో రతిపై ఆసక్తి కలిగిన ఆమె తన వల్లభునితో సంగమించినది.
నిగనిగమని ప్రకాశించు ముఖముపై ముంగురులు చెదిరి ఆడుచున్నవి. పగలైపోయినా ఆమె పవళించియే ఉన్నది. అంతులేని ప్రావీణ్యముతో ఆ తల్లి, జగదీశ్వరుడైన తన పతి మనసును ఆకట్టుకొని యున్నది. కావున బడలి శయనించుచున్నది.
ఆమె పయ్యెద స్థాన భ్రంశమునందగా మెఱయు స్తనయుగ్మము విస్తరించి యున్నవి. ఆ భామామణి బంగారపు మేడపై నిదురించుచున్నది. ఎఱ్ఱ కలువల వంటి సోగ కన్నులలో శృంగారం అతిశయించి ఆమె మదనుని జనకునితో మన్మధ యుద్ధమున అలిసిపోయియున్నది. అందుచే ఆ తల్లి నిదురించుచున్నది.
మురిపెము లొలుకు అభినయం చూపిన ఆ తల్లి ముత్యాల హంసతూలికా తల్పంపై పరవశురాలై పవ్వళించి యున్నది. తిరుమలాధీశుడైన శ్రీవేంకటపతి కౌగిటిలో కరిగిపోయిన ఆ తల్లి అరవిచ్చిన మొగ్గవలె చిరుచెమటలు కమ్మి శయనించుచున్నది.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/7X1IeF5kKH0 

నీవున్నచోటే వైకుంఠము | Neevunna Chote Vaikuntamu

నీ వున్నచోటే వైకుంఠము నెరసులుమఱి చొరరాదు
పావన మది చెప్పేది వేదము పాటింపఁగవలెను

దేవుఁడా నా దేహమె నీకు తిరుమలగిరిపట్టణము
భావింప హృదయకమలమె బంగారపు మేడ
వేవేలు నా విజ్ఞానాదులు వేడుకపరిచారకులు
శ్రీవల్లభా యిందులో నితరచింతలు వెట్టకువే

పరమాత్మా నా మనసే బహురత్నంబుల మంచము
గరిమల నా యాత్మే నీకు కడు మెత్తని పఱుపు
తిరముగ నుజ్ఞానదీప మున్నది దివ్యభోగమె ఆనందము
మరిగితి నీ వున్నయెడల నిఁక మాయల గప్పకువే

ననిచిన నా వూరుపులే నీకు నారదాదుల పాటలు
వినయపు నా భక్తియె నీకును వినోదమగు పాత్ర
అనిశము శ్రీవేంకటేశ్వర అలమేల్మంగకుఁ బతివి
ఘనుఁడవు నన్నేలితి విఁక కర్మము లెంచకువే

Watch for audio - https://youtu.be/NmVTWVrxP_4 

దైవమా నిన్ను దూర దగవు | Daivama Ninnu

దైవమా నిన్ను దూర దగవు గాదు నా
భావములో నున్నాఁడ వీ పరిపాటి చాలదా

పుట్టించిన దైవమవు పూరిమేపేవా
నెట్టన నిహము తొల్లే నీ సంకల్పమూ
పట్టులేక నా మనసు పరువులు వెట్టి నిన్ను
గట్టిగాఁ గొలువని నా కర్మ మింతే కాక

యిచ్చితివి దేహము యింద్రియములఁ బూంచితి
నిచ్చలు నా బ్రదు కెల్ల నీ సూత్రము
యిచ్చ నా స్వతంత్రమంటా యిందు నందుఁ బొరలుచు
కచ్చి నిన్నుఁ దలఁచని కల్ల యింతే కాక

ముందరిజన్మ మానె మున్నిటిపాపము దీరె
సందడి నీ దాసులకు శరణనఁగా
అంది శ్రీ వేంకటేశ్వర ఆచార్యుననుమతి
కందువ దెలిసె పుణ్యకర్మ మింతే కాక

Watch for audio - https://youtu.be/OdgOhbe9iTw 

పరమాత్ముఁ డైన హరి | Paramatmudaina Hari

పరమాత్ముఁ డైన హరి పట్టపురాణివి నీవు
ధర మమ్ము విచారాంచఁదగు నీకు నమ్మా

కమలజుఁ గన్నతల్లి కామునిఁ గన్నతల్లి
అమరులఁ గన్నతల్లి ఆదిమలక్ష్మి
విమలపు నీపతికి విన్నపము సేసిమమ్ము
నెమకి యేలితి దయ నీకే తగునమ్మా

కామధేను తోఁబుట్టుగ కల్పకము తోఁబుట్టుగ
దోమటి చల్లనిచంద్రుతోఁబుట్టుగ
నీమగనిపంపునను నిజసిరు లిచ్చితివి
నేమపువితరణము నీకే తగునమ్మా

పాలజలధికన్యవు పద్మాసనవి నీవు
పాలఁబండే శ్రీవేంకటపతిదేవివి
యేలిన యితనిబంట్ల కిహపరా లిచ్చి మా-
పాలఁ గలిగితివి సంబంధము మేలమ్మా 

భావామృతం :
పరమాత్మునిగా సన్నుతింపబడుచున్న శ్రీహరికి పట్టపురాణివి తల్లీ! నీవు. ఆయన యేలుబడిలో వున్న ఈ భూమిపై నున్న మమ్ము రక్షించి మా బాగోగులు చూడవలసిన అమ్మవు నీవే.
నీకు నీవేమన్నా తక్కువా తల్లీ? నీవెవరివో తెలుసా? స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారి కన్నతల్లివి. భావనలోనే పుట్టి అలరించే కాముడు (మన్మధుని) అమ్మగారివి. దేవతలందరికి జననివి. ఆదిలక్ష్మివి. నిర్మలుడైన నీమగని కాస్త మాకొరకు అభ్యర్ధించి మేం యెక్కడ వున్నా వెదకి పట్టుకొని దయచూపించమని చెప్పగల దానివి నీవొక్కదానివే. నీకే తగును. కాస్త దయచూడు తల్లీ!
ఇక నీ సోదరులు యెంత గొప్పవారో తెలుసునా తల్లీ! కామధేనువు అందరి కోరికలను తీర్చే సంగతి జగత్ప్రసిద్ధమే. కల్పకము (కల్పవృక్షం) యెక్కడ వుంటే అక్కడ కొఱతయే వుండదు. చంద్రుడు చల్లని చందమామయ్యేగాక, దోమటి (అన్నము) పెట్టే సస్యదాత. నీ మగడు అంగీకరిస్తేనే మాకు నిజమైన సౌభాగ్యములనిచ్చెదవు. అందుకని ‘ఈవి' (దానగుణం) మీ వంశంలోనే వున్నది. కాస్తమాపై కూడ నీదయ చూపించు తల్లీ!
నీవు క్షీరసాగరకన్యవు. కమల నివాసినివి. పాలపండే (నైపుణ్యంగల) వేంకటేశ్వరుని దేవేరివి. ఆ స్వామి బంట్లము అయినందువల్ల మా యేలిక ప్రోద్బలమున మాకు ఇహము పరమునిచ్చే యజమానురాలివి. అందుచే నీవు మా పాలినుండు సంబంధముచే మమ్ము పరిపాలించి రక్షించు తల్లీ!
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/dwcA8XJmwe0 

మదనునితల్లికి మంగళం | Madanuni Talliki Mangalam

మదనునితల్లికి మంగళం – 
మదగజగమనకు మంగళం

కంజదళాక్షికి కప్పురగంధికి – 
మంజులవాణికి మంగళం 
మంజరికుచకును మధుకరవేణికి 
మంజులపదకును మంగళం

ఇందువదనకు నిభరిపుమధ్యకు 
మందస్మితకును మంగళం 
కుందరదనకును గురునితంబ, కబ్జ – 
మందిర కెపుడును మంగళం

అంగనామణికిని అంబుజపాణికి 
మంగళపతికిని మంగళం 
రంగుగ వేంకటరమణుని యలమే – 
ల్మంగకు నెప్పుడు మంగళం

Watch for audio - https://youtu.be/jMWX6fqibos 

రతిరాజ జనక - Ratiraja Janaka

రతిరాజ జనక వో రామామనోహర
తతితోడఁ  బురుషోత్తముఁడవు నీవే

సతుల మన సెఱిఁ గి సరసము లాడవలె
యితవుగాను మోవి యియ్యవలె
మతకము లెల్ల మాని మర్మము లంటఁగవలె
చతురుఁడ విన్నిటాను జాణవు నీవే

భావించి చూచేవారిఁ  బక్కన లాలించవలె
కైవసమై వలపులు గైకొనవలె
చేవమీఱ నవ్వు నవ్వి సిగ్గు దేరుచవలె
కోవిదుఁడ విందుకెల్లా గురువవు నీవే

తొట్టి  యిందరికి నీ రతులు నేరుపఁగవలె
నెట్టుకొని యేలి కృప  నించఁగవలె
గట్టిగ నే నలమేల్మంగను నన్నుఁ  గూడితివి
యిట్టి  గుణాల శ్రీ వేంకటేశుఁడవు నీవే. 

భావామృతం : 
ఓ స్వామీ! నీవు రతిరాజ జనకుడవే. రామా మనోహరుడవే. పురుషోత్తముడవే. పురాణకాలం నుండి వస్తున్న నీయీ బిరుదులను ఎవరు కాదంటారు. అన్నీ సార్థకములే. ఇప్పుడు నీవు వేంకటేశ్వర స్వామివి. అన్నిటను చతురుడవు-జాణవు. కోవిదుడవు-గురువవు. ఇప్పటి యీ నీ గుణాలను సార్థకం చేయటానికి ఈయీ పనులను చేయాలంటూ అన్నమయ్యే స్వామిని '' రతిరాజ జనక వో రామామనోహర/1తతి తోడ(బురుషోత్తముడవు నీవే '' సంబోధిస్తూ సూచించటం ఈ సంకీర్తన లోని విషయం.
1.తతి=సమయం, అదను; 2. ఇతవు=హితవు, మేలు; 3. వైపు=ప్రక్కన; 4. తొట్టి=ప్రాపుగొని, స్పృశించి, మెండుకొని.
ఓ స్వామీ! నీవు సతుల మనసులను తెలుసుకొని సరసాలాడాలి. వారు హితాన్ని, ఆనందాన్ని పొందేటట్లుగా మోవినియ్యాలి. మాయలన్నీ మానుకొని మర్మాలనంటాలి. నీవు మంచి చతురుడవు. ఇవన్నీ జాణవైన నీకు తెలియకుండా ఉంటాయా!
ఓ స్వామీ! నిన్ను మనసులో తలచుకొన్న చెలుల ప్రక్కన చేరి వారిని లాలించాలి. వారిని దగ్గరకు తీసుకొని హత్తుకొని వలపులు నింపాలి. వారు సిగ్గులు పడుతుంటే-వారిసిగ్గులు పోగొట్టటానికి ఎన్ని నవ్వులనైనా నవ్వాలి. ఇందులో నీవు మంచి పండితుడవు. ఇవన్నీ గురువువైన నీకు నేను బోధించాలా!
ఓస్వామీ! ఈ ఇంతులందరను దగ్గరకు చేరదీసుకొని-వారికి రతులను నేర్పాలి. వారిని దయతో చూడాలి. ఓ శ్రీ వేంకటేశ్వర స్వామీ! ఈ గుణాలన్నీ నీకున్నాయి. ఇదిగో ఈమె అలమేలు మంగమ్మ. ఈమెను కూడుము. 
(సంకీర్తనమునకు వివరణ: డా. మాదిరాజు గారు)

Watch for audio - https://youtu.be/tH1JvC37958 

చేపట్టుఁ గుంచము శ్రీవిభుఁడు - Cepattu Konchemu

చేపట్టుఁ గుంచము శ్రీవిభుఁడు
వై పెరిఁగి పొగడవలెఁ గాక

మనసులోనిహరి మరవక తలఁచిన
యెనయ నిహపరము లేమరుదు
పెనగొన నాతనిపేరు నుడిగినను
తనకు మహానందము లేమరుదు

పుట్టించినాతని పొసఁగఁగ గొలిచిన
యిట్టె వివేకం బేమరుదు
చుట్టి యతనిదాసులకుమొక్కినను
పుట్టగు గెలుచుట భువి నేమరుదు

శ్రీవేంకటేశ్వరుఁ జేరి భజించిన
యేవేళ సాత్విక మేమరుదు
భావించి యాతనిపై భక్తి నిలిపినను
కైవశముగఁ దనుఁ గను టేమరుదు

భావామృతం : 
(శ్రీపతిసేవనము సకల శ్రేయములకు మూలమని ఉద్బోధించు చున్నాడు)
ఉపాయము తెలిసి పొగడినచో శ్రీపతి చేపట్టుకుంచ మగును.
సులభముగా వశ్యుడగు ననుట. మనసులోనే యున్న హరిని మఱచిపోక తలచినచో ఇహలోక పరలోక సౌఖ్యము లేమి యరుదు? అరుదుకా వనుట. పూనికతో కృష్ణునినామముల నుచ్చరించినచో అనవరతబ్రహ్మానంద మబ్బుట ఏమి యరుదు? అరుదు కాదని భావము. జన్మమిచ్చిన ఆ దేవుని ఒప్పుగా సేవించినచో హద్దుమీఱిన జ్ఞానమబ్బుట ఏమి యరుదు ? అరుదుకా దనుట. హరిదాసులకు ప్రదక్షిణపూర్వకముగ నమస్కరించినచో జన్మరాహిత్యమును పొందుట ఏమి యరుదు? అరుదు కాదు. శేషశైలంమీద నుండు లక్ష్మీవల్లభుని సేవించినచో శుద్ధసత్త్వగుణము సిద్ధించుట ఏమి యరుదు? అరుదుకా దనుట. చక్కగా భగవంతునిపై భక్తిని కేంద్రీకరించినచో ఆ స్వామిని ప్రత్యక్షముచేసికొనుట ఏమి అరుదు? అతడు తప్పక ప్రత్యక్షమగు ననుట.
"(సంకీర్తనమునకు భావవాణి… విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు)

Watch for audio - https://youtu.be/9RvCZih0r18 

Wednesday, April 22, 2026

ఇట్టి నిన్ను నుతియించ - Itti Ninnu Nuthiincha

ఇట్టి నిన్ను నుతియించ యెవ్వరితరములయ్య
నెట్టన పెక్కురూపాల నెలవై నీవుంటివి

నిక్కి దేవుళ్ళు ముత్యాల నీపై వసంతమాడఁగా
చుక్కలలో చంద్రుఁడవై చూపట్టితివి
గక్కన మఱియు వడగండ్లవానలతోడి
మిక్కుటపు తొలుకరి మేఘమవై యుంటివి

నిగ్గుగల ముత్యాలు నెలఁతలు చల్లఁగాను
బుగ్గలతో వారాశిఁ బోలితివి
అగ్గమై అప్పటినీ‌అంగములనంటితేను
తగ్గక బ్రహ్మాండాలు ధరించినట్టుంటివి

తడవెలమేల్మంగ ముత్యాలసేస చల్లఁగాను
పొడము మొగ్గల సురపొన్నఁ బోలితివి
కడఁగి శ్రీ వేంకటేశ క్రమ్మరనెంచి చూచితే
వడియు నురుగుల కవ్వపుఁగొండఁ బోలితివి

భావామృతం :
ఈ సంకీర్తనమందు అన్నమయ్య స్వామిని పెక్కు రూపాలు ధరించిన దేవునిగా వర్ణిస్తున్నాడు. దేవతలాతనిపై ముత్యాలవాన కురిపిస్తుంటే-స్వామి చుక్కల్లో చంద్రునిగా; వడగండ్ల వాన కురిసేటప్పుడు తొలకరి మేఘంలాగా; స్త్రీలు ముత్యాలు చల్లుతుంటే-బుడగలతో నిండిన సముద్రం లాగా; శరీరావయవాలు చూస్తుంటే విశ్వరూపధారిగా; అలమేలు మంగమ్మ ముత్యాల సేసలు చల్లుతుంటే- మొగ్గలతో విరిసిన సురపొన్న లాగా కనిపిస్తున్నాడని ఉల్లేఖాలంకారంలో అన్నమయ్య ఈసంకీర్తనలో స్వామిని వర్ణిస్తున్నాడు.
1.నెట్టన=చక్కగా, నిండుగా, తప్పక, న్యాయంగా, నిజంగా; 2. నిక్కి= అతిశయించి; 3. నిగ్గు=స్వచ్ఛమైన, కాంతివంతమైన; 4. బుగ్గలతో= (నిరంతరము పైకి ఉబికి వచ్చు) నీటిబుడగలతో; 5. అగ్గము= అధీనము, కనబడినది, అనుకూలమైనది, అందుబాటులోనున్నది; 6. అంగములు= అందములు, శరీరావయవములు; 7. తడవి= దో(గాడి, తడబడి; 8. వడియు= స్రవించు, ప్రవహించు; 9. కవ్వపు(గొండ= మందరాద్రి, మంథర పర్వతము, తరికొం(గొం)డ. .
ఓస్వామీ! ఇంతటి దేవుడవు. అనేక రూపాలలో కనబడే నిన్ను నిన్ను ఇట్టివాడవు, అట్టివాడవు అని పొగడటానికి ఎవరికి సాధ్యమౌతుందయ్యా! దేవతలందరు అతిశయించి నీపై ముత్యాలు చల్లి వసంతమాడుతుంటే-నీవు అచ్చంగా చుక్కలలో చంద్రుని లాగా మెరసి పోతున్నావయ్యా(ఇచట ముత్యాలు నక్షత్రాలుగా-స్వామి చంద్రునిలా ఉత్ప్రేక్షింపబడుచున్నాడు). అప్పుడే కురుస్తున్న వడగండ్ల వాన నడుమ నీవు తొలకరి మేఘంగా కనిపిస్తున్నావయ్యా!
ఓ స్వామీ! స్త్రీలందరు కలిసి నీపై స్వచ్ఛమైన ముత్యాలను చల్లుతుంటే- నీవు నిరంతరము నీటి బుడగలతో ప్రవహించే సముద్రంలాగా కనిపిస్తున్నావయ్యా! ఆ సమయాన అందమైన నీ శరీరావయావలను చూస్తుంటే- విశ్వరూపాన్ని ధరించిన వానిలా కనిపిస్తున్నావయ్యా!
ఓ స్వామీ! తడబడుతూ అలమేలుమంగమ్మ నీపై ముత్యాల తంలంబ్రాలు చల్లుతూ ఉంటే-మొగ్గలతో విచ్చుకున్న సురపొన్న మాదిరిగా ఉన్నావయ్యా! ఓ శ్రీ వేంకటేశ్వర స్వామీ! నిన్ను తదేకంగా చూచి తిరిగి ఆలోచించి చూస్తే-నీవు నురగలతో నిండియున్న మంథర పర్వతంలాగా ఉన్నావయ్యా! . (సంకీర్తనమునకు భావవాణి… డా. మాదిరాజు గారు)

Watch for audio - https://youtu.be/lMYrgv_oyHM 

వెదకిన నిదియే - Vedakina Nidiye

వెదకిన నిదియే వేదాంతార్థము
మొదలు తుదలు హరిమూలంబు

మునుకొని అవయవములు యెన్నైనా
పనివడి శిరసే ప్రధానము
యెనలేని సురలు యెందరు గలిగిన
మునుపటి హరియే మూలంబు

మోవని యింద్రియములు యెన్నైనా
భావపు మనసే ప్రధానము
యీవల మతములు యెన్ని గలిగినా
మూవురలో హరి మూలంబు

యెరవగు గుణములు యెన్ని గలిగినా
పరమ జ్ఞానము ప్రధానము
యిరవుగ శ్రీ వేంకటేశ్వరు నామమే
సరవి మంత్రముల సారంబు

Watch for audio - https://youtu.be/y4uxMiKSijw 

ఇన్ని దేహములఁ బుట్టి - Inni Dehamula Butti

ఇన్ని దేహములఁ బుట్టి యేమిగంటిమి
వున్నతపు హరిదాస్య మొక్కటేకాక

హీనజంతువైననాఁడు యేనుగై పుట్టిననాఁడు
ఆనంద మొక్కటే అంగాలే వేరు
యీ నేటియజ్ఞానము యీజీవుల కొక్కలాగే
జ్ఞానమే యెక్కుడుఁగాక సరిలేనిదొకటే

నరలోకభోగానకు నరకానుభవానకు
సరేకాని మిగులదు చనెఁ దొల్లె (?)
గరిమ నేర్పడ నందు ఘనమేమి కొంచమేమి
హరిదాసుఁడై బ్రదుకుటదియే లాభము

బాలుఁడైన యప్పుడూను పండి ముదిసినప్పుడు
కాల మొక్కటే బుద్ధి కడు లేదు
ఆలకించి శ్రీవేంకటాధిపతి సేవించి
యేలికంటా మొక్కుచుండే దిదియే భాగ్యము 

భావామృతం :
ఎన్నియో జన్మము లెత్తి ఏమి పరమార్థము సంపాదించితిమి ? గొప్ప దగుహరిసేవయే మేలైనది. మోక్షమిచ్చున దనుట. 
చిన్నప్రాణులకును గొప్పప్రాణియగు ఏనుగునకును శరీరములో భేద మున్నదేగాని అన్నింటి యానంద మొక్కటియే. శరీరములు భిన్నము లైనను భగవద్దర్శనముచేత కలుగు ఆనందము ఒకటియే. భూలోకంలోని దుఃఖములు స్వర్గ లోకములోని సుఖములు కర్మానుగుణముగా పరిమితములై తీరి పోవు నట్టివేగాని అందులో తగ్గుమొగ్గు లేమున్నవి? కాన హరిభక్తుడై జీవించుటయే గొప్ప. హరిభక్తి ముక్తికారణము గనుక. 
బాలుడైనను వృద్ధుడైనను బుద్ధి హెచ్చగుటలేదు. కాలం బుద్ధిమంతునకు బుద్ధిహీనునకు ఒకేరీతి గడచిపోవుచున్నది. ప్రభువని శ్రీవేంకటాచలపతిపాదపద్మములు గొల్చుటయే మహాభాగ్యము.  
(సంకీర్తనమునకు భావవాణి… విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు)

Watch for audio - https://youtu.be/MFvUJjxveaU 

తప్పదు తప్పదు దైవము - Tappadu Tappadu Daivamu

తప్పదు తప్పదు దైవము కృపయిది
ముప్పిరి నింతా ముకుందుఁడే

వెక్కసపుమతి వెలుతులు తేరిసఁ-
నెక్కడ చూచిన నీశ్వరుఁడే
గుక్కక యాసలు గోసివేసినను
నిక్క మడుగడుగు నిధానమే

పొంచి శరీరపుభోగము లుడిగిన
చుంచుఁబాపములు సుగృతములే
దంచెడివిషయపుతగులమిఁ బాసిన
యెంచిచూచినను యీహమే పరము

శ్రీవేంకటపతిసేవే కలిగిన
వేవేలువగలు వేడుకలే
చేవదీరె సందియము లేదిదే
భావము నమ్మిన ప్రపన్నులకును 

భావోద్దేశ్యము :
ఇది (ఈ ఐశ్వర్యము) తప్పదుగాక తప్పదు. ఎందుకంటే ఇది దైవము యొక్క కృప. ఇంతా (అంతటా ముప్పిరి (మూడురెట్లై) అతిశయించిన ముకుందుడే (మురవైరియైన శ్రీహరి మహిమ చూపుతున్నాడు).
వెలితి (లోపము) వెక్కసఫ్రమతి (భరించలేని మనస్సుదే). ఒక్కసారి ఆలోపము సవరించుకొంటే మనకు యెక్కడ చూచినా ఈశ్వరుడే కనబడతాడు సుమా! గుక్కక (సందేహించక) ఆపదలు తెచ్చే ఆశలను కోసివేస్తే, అడుగడుగునా నిధానము (మూలధనము) వంటి ఈశ్వర కృప లభిస్తుంది. ఇది నిజం.
మనిషి పాపాలన్నీ భోగవాంఛతోనే చేస్తాడు. శరీరం ఒకసారి భోగానికలవాటుపడితే, ఇక వేచి ఆ భోగాలకు వెంపర్లాడుతుంటాడు. ఒక్కసారి వాటిని కాదనుకొంటే మానవుడు పాపాలు చేయడు. వాడు చేసేవన్నీ పుణ్యాలే. విషయ వాంఛలపై తగులము (మమకారం) వుంటే అవి వాడిని దంచెడి (చితక కొడుతుంటాయి). ఒక్కసారి వాటిపై అనురక్తిని వదిలిపట్టి చూస్తే, ఇహలోకంలోనే పరము సిద్ధిస్తుంది. వాళ్ళే జీవన్ముక్తులు.
శ్రీ వేంకటేశ్వరుని సేవా నిరతుడైన వాడికి వేవేలు వగలు (అంతులేని దుఃఖాలు) కూడా వేడుకలే అవుతాయి. భావన నమ్మిన (మనస్సులో తిరుమలేశుని నమ్మిన) ప్రపన్నుకు (హరి శరణాగతులకు) చేవదీరె సత్యము (గోచరిస్తుంది). ఇందులో ఏమాత్రము సందేహానికి తావు లేదు.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/QiaeNKAoc3Q