Wednesday, January 14, 2026

అందాఁకా వైష్ణవ - Andaka Vaishnava

అందాఁకా వైష్ణవ మటకటకే
నిందకుఁ బాసిన నిర్మలుఁ డగును

పాపపురాసులు పరిహరమైతే
దీపించు హరిభక్తి వొడమును
చేపట్టి పుణ్యము చేరువలయితే
శ్రీపతిదాసుల సేవే దొరకు

కొట్టఁగొనకు మతి గోరి పారితే
జట్టిగ హరికథ చవిగలుగు
పట్టిన జన్మము పావనమైతే
మట్టులేని తిరుమంత్రము దొరకు

గురుకటాక్ష మొకకొంత సోఁకితే
శరణాగతి నిశ్చలమవును
యిరవుగ శ్రీవేంకటేశ్వరుఁ గొలిచితే
పరమపదమునకుఁ బాత్రుండవును

Watch for audio -https://youtu.be/2Is87Bk-UqI 

వేలఁ గట్టినట్టి వేవేలు - Vela Gattinatti Vevelu

వేలఁ గట్టినట్టి వేవేలు చకిలాలు
కోలలెత్తుకొని కొట్టీ వీఁడె

వుట్టులు జతనము వోవో చెలులాల
రట్టడి కృష్ణుఁడు రావాడీని
గుట్టుతోనే వచ్చి గోపాలులుఁదాము
చుట్టి వెన్నలుఁబాలు జుఱ్ఱీ వీఁడె

దొంతులు జతనము దొడ్డుల సతులాల
ఇంతలోఁ గృష్ణుఁడు ఇదె వచ్చీని
రంతుసేసుకొని రయమున వీదుల
వింతగా నడుకులు వెదకీ వీఁడె

వాడలు జతనము వల్లవాంగనలాల
వేడుకఁ గృష్ణుఁడు వెలసీని
యీడనే శ్రీవేంకటేశుఁ డలమేల్మంగఁ
గూడి నీతో ముద్దు గునిసీ వీఁడె 

తాత్పర్య వివరణ:
ఓ అమ్మలారా! ఈ కృష్ణుడు యేమిచేశాడో చూశారా? అనేకమైన వేలగట్టినట్టి వ్రేలాడగట్టినట్టి చక్కిలాలను, వీడే కోలలెత్తికొని (కఱ్ఱలను యెత్తి) కొట్టి చిన్న చిన్న ముక్కలు చేశాడు. తిన్నన్ని తిన్నాడు.
వోవో చెలులారా! మేము ఉట్లలో దాచుకొన్న వాటికి ఈ రట్టడి (అఘాయిత్యపు) కృష్ణుడు రావాడీని (ఉపద్రవం కలిగిస్తాడు). గుట్టుతోనే (రహస్యంగా) వచ్చి గోపాలులు తానూ కలిసి చుట్టి (చుట్టుముట్టి) వీడే పాలు, వెన్నా జుట్టుకొన్నాడు. సరే ఇదంతా ఒక యెత్తయితే వాడి శృంగార చేష్టలు యేమి చెప్పను?
దొడ్డుల సతులారా! (దొడ్డవారైన ఓ వనితల్లారా!) భార్యాభర్తా దొంతుల జతనము (రతిక్రీడ) కు సిద్ధంగా వుంటే ఇంతలో కృష్ణుడు యెక్కడినుండో వూడిపడి, రయమున (శీఘ్రంగా) రంతు సేసుకొని (రతిపూర్తిచేసికొని) వింతగా ఏమీ తెలియనట్లు వీధిలో అటుకులు పడిపోలేదు కదా! అన్నట్లు వెతుకుతాడు. ఎంత జిత్తులమారో చూడండి.
ఓ వల్లవాంగనలాలా! (ఓ గొల్ల భామల్లారా!) గొల్లవాడలలో ఈ వేడుక కృష్ణుడు యేజతనము (ప్రయత్నమూ లేకుండానే వెలసిని (యెక్కడినుంచో వెలుస్తాడు). ఈడనే (ఈ తిరుమలలోనే) తాను శ్రీవేంకటేశుడై ఓ అలమేల్మంగ తల్లీ! వీడే నీతో ముద్దు గునిసీ (ముద్దులు కుడుస్తున్నాడు).
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/7vOOfW5bRAk 

పేరఁటాండ్లు పాడరే - Peramtandlu Padare

పేరఁటాండ్లు పాడరే పెండ్లివేళ
సారెసారె నిద్దరికి సంతోషవేళ

చిత్తజుతల్లికి వేగ సింగారించరె మీరు
తత్తరించే రిదె ముహూర్తపువేళ
హత్తి తలఁబాలు నారాయణునిఁ బోయుమనరే
పొత్తుల నిద్దరికిని బువ్వపువేళ

పాలవెల్లి కూతుఁరుకు పసపులు నలఁచరే
చాలించరే జోలి వీడు చదివేవేళ
పాలుపడి పరపులు పరచరే దేవునికి
నాలుగోదినము నేఁడు నాగవెల్లివేళ

అంది బాగాలియ్యరే అలమేలుమంగకును
కందువ శ్రీవేంకటేశుఁ గలసేవేళ
గందమూఁ గస్తూరి నీరె ఘనరతి నలసిరి
కుందక యిద్దరు నిఁకఁ గొలువుండేవేళ 

భావామృతం:
ఓ పేరంటాండ్లలారా! శ్రీవేంకటేశ్వరుడు తన ప్రియురాలు అలమేల్మంగను పరిణయమాడుతున్నాడు. మీరంతా చక్కటి పెండ్లిపాటను అందుకోండి. మాటిమాటికీ సంతోష పారవశ్యం చెందుతున్నారు వీరిద్దరూ. వీరి కోసం చక్కగా పాడండి.
మన్మథుని తల్లిగారైన ఈమెను త్వరగా సింగారించండి. ముహూర్తం వేళ దగ్గరపడుతున్నది. ఏ క్షణాన్నైనా 'త్వరగా పెండ్లికూతుర్ని తీసుకు రారండని' పురోహితులు కేకవేస్తారు. త్వరపడండి. నారాయణుడైన ఈ పెండ్లి కొడుకును హత్తి (కలసి) తలంబ్రాలు పోయమని చెప్పండి. వీరిద్దరినీ ఒక పొత్తులో కూచోబెట్టి భోజనం పెట్టండి. ఇది బువ్వపు వేళ (భోజనాల సమయము).
ఈ వధువు పాలవెల్లి (క్షీరాబ్ధి) కూతురు. ఈమెకు పసుపు అలది నలుగుపెట్టి చక్కగా మంగళస్నానం చేయించండి. ఇది వీడు (కట్నము) చదివే వేళ చదివించేవేళ). మీరు జోలి (సరదా కబుర్లు చాలించండి. ఈ దేవదేవునికోసం పాలుపడి (పూనుకొని) మెత్తలు పరవండి. ఇవేళ నాలుగవరోజు. నేడు నాగవెల్లి జరుగనున్నది. ఆయన పెండ్లి కొడుకు. సుఖాసీనుడు కావలెను కదా!
ఈ అలమేల్మంగకు భోగాలియండి. (తాంబూలము మొదలైనవి) కందువ వేంకటేశ్వరుడు (సమర్ధుడైన వేంకట రమణుడు) తన వధువును కలిసే సమయమాసన్నమైనది. ఘన రతులతో ఇద్దరూ అలిసిపోయారు. నేడు కస్తూరి గంధములను ఈయండి. కుందక (ఏ లోటు లేకుండా) ఇద్దరూ కొలువు దీరినవేళ ఇది. మన సుకృతం వల్ల వీరిని సేవించే భాగ్యం కలిగింది.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/AcjcD5V6ia8 

పురుషోత్తముఁడ నీవే - Purushothamuda Neeve

పురుషోత్తముఁడ నీవే పుణ్యము గట్టుక నన్ను
దరిచేర్చి రక్షించి దయఁ జూడఁగదవే

ధరలో యాచకునకు ధర్మాధర్మము లేదు
సిరులఁ గాముకునికి సిగ్గులేదు
పరమపాతకునకు భయమించుకాలేదు
విరసపు నాకై తే వివేకమే లేదు

మించిన కృతఘ్నునికి మేలెన్నఁడును లేదు
చంచలచిత్తునకు నిశ్చయమే లేదు
అంచల నాస్తికునకు నాచారమే లేదు
కొంచని మూర్ఖుఁడ నాకు గుణమే లేదు

మదించిన సంసారికి మరి తనివే లేదు
పొదిగొన మూర్ఖునకు బుద్ధే లేదు
అదన శ్రీవేంకటేశ అలమేల్మంగ దాసుఁడ-
నిదివో చనవరి నాకెదురే లేదు

Watch for audio - https://youtu.be/hXWAA6NZsCs 

కొనకెక్కె వలపులు గోపీనాథ - Konakekke Valapulu Gopinatha

కొనకెక్కె వలపులు గోపీనాథ । మన -
మనసొక్కటాయ నింక మదనగోపీనాథా

కొమ్మలుపదారువేల గోపీనాథా । నీకు
గుమ్మెలాయ మోమెల్ల గోపీనాథా
కుమ్మరింపురాగాల గోపీనాథా । అంత
చిమ్మకు నీవంతములు చిన్నిగోపీనాథా

కోరినకోరికె చెల్లె గోపీనాథా । యింకాఁ
గూరిమేల కొసరేవు గోపీనాథా
గోరు సోఁకనీయకుమీ గోపీనాథా । సమ  -
తారుకాణలాయ నిన్నీఁ దగు గోపీనాథా

కొండుకపాయాలు సరి గోపీనాథా । యిఁక
గుండెవట్టి వుండరాదా గోపీనాథా
కొండల శ్రీవేంకటాద్రి గోపీనాథా । పొందు
తొండమారేళ్ల గూడె దొర గోపీనాథా

Watch for audio - https://youtu.be/ekdh9huttFY 

చూచి చూచి మీ పెండ్లికి - Chuchi Chuchi Mi Pendliki

చూచి చూచి మీ పెండ్లికి సోబాన వాడేముగాక
మీచేఁత లిట్టివని మే మెంచఁగలమా

చెక్కులు నొక్కేవు నీవు సెలవుల నవ్వెనాపె
యిక్కువలు మీలోనివి యెట్టు దెలుసు
తొక్కేవు పాదాలు నీవు దొరకొని మొక్కీనాపె
పక్కన మీ భావా లేరుపరచఁ గఁ గలమా

చెనకఁచూచేవు నీవు సిగ్గులు వడీనాపె
యెనసిన నీసన్న లెట్టు దెలుసు
పెనఁగే వప్పటి నీవు ప్రియములు చెప్పీ నాపె
వెనుకొన్న మీ సుద్దులు వివరించఁగలమా

సరసమాడేవు నీవు చన్నుల నొత్తీ నాపె
యిరవైన మీ చయ్యాటా లెట్టు దెలుసు
గరిమ శ్రీవేంకటేశ కలసితివిటునన్ను
తెరలోని మీరతులు తెలుపఁగఁగలమా

Watch for audio - https://youtu.be/awaqVzxRt2Q 

బ్రువంతి బౌద్దా - Bruvanthi Boudha

బ్రువంతి బౌద్దా బుద్ద ఇతి
స్తువంతి భక్తా సులభ మితి

గదంతిఖిల సాంఖ్యాస్త్వాం పురుషం
పదవాక్య జాః (జ్ఞ్యాహః) పదమితిచ
విదంతి త్వా వేదాంతిన-
స్సదా బ్రహ్మ లసత్పదమితిచ

జపంతి మీమాంసకా స్త్వాం చ
విపులకర్మణో విభవ ఇతి
లపంతి నయసకలా స్సతతం
కృపాళుకర్తా కేవలమితిచ

భణంతి వేంకటపతే మునయో-
హ్యణిమాదిప్రద మతులమితి
గుణవంతం నిర్గుణం పునరితి
గృణంతి సర్వే కేవలమితిచ

Watch for audio - https://youtu.be/TkEntNpvugM 

ఈతఁడు విష్ణుఁడు - Eetadu Vishnudu

ఈతఁడు విష్ణుఁడు రిపు లెక్కడ చొచ్చేరు మీరు
చేత చక్రమెత్తినాఁడు శ్రీవేంకటేశుఁడు

జలధులు చొచ్చిచొచ్చి సారెఁ బ్రతాపించినాఁడు
చలమునఁ బాతాళము సాధించినాఁడు
బలుభూమిదూరి వొక్కకొలికికిఁ దెచ్చినాఁడు
నిలిచి యంతరిక్షమునిండి భేదించినాఁడు

చేరి బ్రహ్మాండము తూఁటుసేసి చూచినాఁడు
వీరుఁడై రాచమూఁకల వెదకినాఁడు
ఘోరపుత్రికూటాదికొండలు జయించినాఁడు
వారించి చక్రవాళపర్వతము దాఁటినాడు

మట్టి దైత్యపురాల మర్మాలు విదళించినాఁడు
చుట్టువేడెమున యింతా సోదించినాఁడు
యిట్టె శ్రీవేంకటాద్రినిరవై యెక్కినవాఁడు
రట్టుగాఁ దనదాసులనిట్టె రక్షించినాఁడు

Watch for audio - https://youtu.be/nS4_1-C_xBQ 

ఒకరికొకరి అన్యోన్యము - Okari kokari Anyonyamu

ఒకరికొకరి అన్యోన్యము చూడరే
సకలమునెరిఁగిన సరసులె వీరు

చెలిచంద్రముఖముసిరుల నాయకుఁడు
కలువలకన్నులఁ గడుఁ జూచె
చెలువ సూర్యతేజపుఁ బతిని మరల
జలజాక్షంబుల సతియును జూచె

తారని బింబాధరితో రమణుఁడు
కోరి చిలుకపలుకులఁ బలికె
తోరపు మేఘపుతురుము విభునితో
ఆరయ మయూరయానయుఁ బలికె

పడఁతిదేహలత ప్రాణనాథుఁడిటు
వొడలి చెమటచెరువులఁ దడిపె
కడఁగిన శ్రీవేంకటగిరిపతితోఁ
దడవి సింహమద్యయునొనఁగూడె

Watch for audio - https://youtu.be/ZZsLKG4VIt8 

ఆటవారిఁ గూడితౌరా - Atavari Guditoura

ఆటవారిఁ గూడితౌరా 
ఆటవారిఁగూడిఅన్నిచోట్ల బొమ్మ-
లాట లాడించ నధికుండవైతివి

గురుతరమగు పెద్దకొట్టాములోపల
తిరుమైన పెనుమాయఁ దెరగట్టి
అరయ నజ్ఞానము లవి యడ్డముగఁ జేసి
పరగ సుజ్ఞానదీపములు ముట్టించి

తోలుబొమ్మల దొరకొని గడియించి
గాలిచేత వానిఁ గదలించి
తూలేటిరసములు తొమ్మిది గడియించి
నాలుగుముఖముల నలువున నాడించ

నిన్నేమెత్తురుగాని నీకేమి నీలేరు
మన్నించుదాతలు మరిలేరు
యెన్నఁగఁ దిరువేంకటేశ్వర నీదాసు -
లున్నతులై నిన్ను నుబ్బించి పొగడఁగ

Watch for audio - https://youtu.be/BQ9vQBfzV24 

అప్పడైనహరి - Appadaina Hari

అప్పడైనహరి యెక్కె నదివో తేరు
యిప్పుడు తిరువీధుల నేఁగీ తేరు

సముద్రాలమీఁదఁ దోలె సర్వేశ్వరుఁడు తేరు
భ్రమయ జరాసంధుపైఁ బరపెఁ దేరు
తిమురుచు రుక్మకుపైఁ దిరుగఁ దోలెఁ దేరు
ప్రమదాన సృగాలునిపైఁ దోలెఁ దేరు

కమ్మి యక్రూరుఁడు దేఁగా కంసునిపై నెక్కెఁ దేరు
బమ్మరపో దంతవక్త్రుపైఁ దోలెఁ దేరు
దుమ్ములుగా సాల్వునిపై దొడ్డగాఁ దోలినతేరు
దొమ్మి రుక్మిణిపెండ్లికిఁ దోలినట్టితేరు

విూఱి హంసడిభకులమీఁదఁ దోలినట్టితేరు
తూఱి సంధిమాటలకుఁ దోలినతేరు
అఱడి శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి
చూఱలుగొన నెక్కెను శోభనపుతేరు

Watch for audio - https://youtu.be/Rpy5KrQQyyw