Wednesday, January 14, 2026

పేరఁటాండ్లు పాడరే - Peramtandlu Padare

పేరఁటాండ్లు పాడరే పెండ్లివేళ
సారెసారె నిద్దరికి సంతోషవేళ

చిత్తజుతల్లికి వేగ సింగారించరె మీరు
తత్తరించే రిదె ముహూర్తపువేళ
హత్తి తలఁబాలు నారాయణునిఁ బోయుమనరే
పొత్తుల నిద్దరికిని బువ్వపువేళ

పాలవెల్లి కూతుఁరుకు పసపులు నలఁచరే
చాలించరే జోలి వీడు చదివేవేళ
పాలుపడి పరపులు పరచరే దేవునికి
నాలుగోదినము నేఁడు నాగవెల్లివేళ

అంది బాగాలియ్యరే అలమేలుమంగకును
కందువ శ్రీవేంకటేశుఁ గలసేవేళ
గందమూఁ గస్తూరి నీరె ఘనరతి నలసిరి
కుందక యిద్దరు నిఁకఁ గొలువుండేవేళ 

భావామృతం:
ఓ పేరంటాండ్లలారా! శ్రీవేంకటేశ్వరుడు తన ప్రియురాలు అలమేల్మంగను పరిణయమాడుతున్నాడు. మీరంతా చక్కటి పెండ్లిపాటను అందుకోండి. మాటిమాటికీ సంతోష పారవశ్యం చెందుతున్నారు వీరిద్దరూ. వీరి కోసం చక్కగా పాడండి.
మన్మథుని తల్లిగారైన ఈమెను త్వరగా సింగారించండి. ముహూర్తం వేళ దగ్గరపడుతున్నది. ఏ క్షణాన్నైనా 'త్వరగా పెండ్లికూతుర్ని తీసుకు రారండని' పురోహితులు కేకవేస్తారు. త్వరపడండి. నారాయణుడైన ఈ పెండ్లి కొడుకును హత్తి (కలసి) తలంబ్రాలు పోయమని చెప్పండి. వీరిద్దరినీ ఒక పొత్తులో కూచోబెట్టి భోజనం పెట్టండి. ఇది బువ్వపు వేళ (భోజనాల సమయము).
ఈ వధువు పాలవెల్లి (క్షీరాబ్ధి) కూతురు. ఈమెకు పసుపు అలది నలుగుపెట్టి చక్కగా మంగళస్నానం చేయించండి. ఇది వీడు (కట్నము) చదివే వేళ చదివించేవేళ). మీరు జోలి (సరదా కబుర్లు చాలించండి. ఈ దేవదేవునికోసం పాలుపడి (పూనుకొని) మెత్తలు పరవండి. ఇవేళ నాలుగవరోజు. నేడు నాగవెల్లి జరుగనున్నది. ఆయన పెండ్లి కొడుకు. సుఖాసీనుడు కావలెను కదా!
ఈ అలమేల్మంగకు భోగాలియండి. (తాంబూలము మొదలైనవి) కందువ వేంకటేశ్వరుడు (సమర్ధుడైన వేంకట రమణుడు) తన వధువును కలిసే సమయమాసన్నమైనది. ఘన రతులతో ఇద్దరూ అలిసిపోయారు. నేడు కస్తూరి గంధములను ఈయండి. కుందక (ఏ లోటు లేకుండా) ఇద్దరూ కొలువు దీరినవేళ ఇది. మన సుకృతం వల్ల వీరిని సేవించే భాగ్యం కలిగింది.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/AcjcD5V6ia8 

No comments:

Post a Comment