Sunday, April 20, 2025

సర్వజ్ఞత్వము వెదకగనొల్లను - Sarvagnatvamu Vedakanollanu

సర్వజ్ఞత్వము వెదకగనొల్లను సందేహింపగనొల్లను
సర్వజ్ఞుండును నాచార్యుండే సర్వశేషమే నాజీవనము

యెఱఁగఁగనొల్లము విజ్ఞానపుగతి యెఱుకలు నే మిటుసోదించి
యెఱిఁగి యితరులను బోధించెదమను యీపెద్దరికము నొల్లము
యెఱిఁగేటివాడును యాచార్యుండే యెఱుకయుసర్వేశ్వరుఁడే
యెఱుకయు మఱపును మానివుండుటే యిదియేపో మావిజ్ఞానము

చదువఁగనొల్లము సకలశాస్త్రములు సారెకుసారెకు సోదించి
చదివి పరులతో యుక్తివాదములు జగడము గెలువగనొల్లము
చదివేటివాఁడును నాచార్యుండే చదువును నాయంతర్యామే
చదువుకుఁ జదువమికియు దొలఁగుటే నానాసాత్వికభావమే నాతెలివి

అన్నిటికిని నే నధికారిననెడియహంకారము నొల్లను
కన్నులజూచుచు నందరితో నేఁ గాదని తొలఁగానొల్లను
మన్నన శ్రీవేంకటేశ్వరుకరుణను మాయాచార్యుఁడే అధికారి
వున్నరీతినే అస్తినాస్తులకు నూరకుండుటే నాతలఁపు

Watch for audio - https://youtu.be/9-ipSrNJFfM 

ఓయమ్మ నీలిబిడ్డఁ - Oyamma Neelibidda

ఓయమ్మ నీలిబిడ్డఁ డోయమ్మ
యీయెడ యశోద నీవెట్టు గంటివమ్మ

గాలిగొట్టై తిరిగినగామిడివాఁ డోయమ్మ
గోలవలె నుండుఁగాని కోడెకాఁడమ్మా
తాలిమి యించుకాలేని తరువరివాఁడమ్మ
ఆలరీఁడు నీబిడ్డఁ డదె బుద్దిచెప్పవో

కడలేనిసాహసాల గట్టు (ట్టి?) వాయివాఁడమ్మ
తడమారి ఇందరిలో తాటఁగట్టమ్మ
ముడికారితనముల మునిముచ్చువాఁడమ్మ
బడిబడి నుద్దండపనులు మానుపవో

శ్రీవేంకటాద్రిమీఁది సేఁతలయేతులవాఁడు
వావాత నుడుగులవడ్డి వాఁడు
వేవేలు దూరినాను విడువక మమ్ము నేలె
వోవల మాతప్పులెల్ల నోరుచుకొమ్మనవో

Watch for audio - https://youtu.be/NhuRr9Q02YM

అపు డేమనె నేమను - Apudemane Nemanu

అపు డేమనె నేమను మనెను
తపమే విరహపుఁ దాపమనె

పవనజ యేమనె పడఁతి మఱేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనై
ఇవల నెట్ల దరియించే ననె

యింకా నేమనె యింతి మఱేమనె
కొంకక యేమని కొసరుమనె
బొంకులదేహము పోదిది వేగనె
చింకవేఁట యిటు చేసె ననె

నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపుమనకూటమి
ఘనవేంకటగిరిఁ గంటి ననె

Watch for audio - https://youtu.be/uga-8CJZ-2c 

ఇతరములన్నియు - Itaramu Lanniyu

ఇతరము లిన్నియు నేమిటికి
మతిచంచలమే మానుట పరము

ఎక్కడిసురపుర మెక్కడివైభవ-
మెక్కడి విన్నియు నేమిటికి
యిక్కడనే పరహితమునుఁ బుణ్యము
గక్కునఁ జేయఁగఁ గల దిహపరము

యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు-
లెవ్వరిందరును నేమిటికి
రవ్వగులక్ష్మీ రమణునిఁ దలఁపుచు
యివ్వలఁ దాఁ సుఖియించుట పరము

యెందరు దైవము లెందరు వేల్పులు
యెంద రిందురును నేమిటికి
కందు వెఱిఁగి వేంకటగిరిరమణుని
చిందులేక కొలిచిన దిహపరము 

భావదీపిక:
అన్నమయ్య యేమంటున్నారో ఆలకించండి. స్వర్గప్రాప్తికి ప్రాకులాడటం, బంధుమిత్రులతో సుఖించడం, ముక్కోటి దేవతలకు మొక్కటం వంటి చిల్లర పనులు చేయుటెందులకు? అనవసరమైన ఇతర ప్రయత్నములెందుకు? ఇటువంటి మతిచంచలము మానుట పరము (శ్రేష్టము). ఎక్కడి స్వర్గము, యెక్కడి స్వర్గ సుఖాలు? ఇవన్నీ యెక్కడవున్నాయి? పోనీ వున్నాయనుకొన్నా అవి యేమిటికి (యెందుకు? ఇక్కడనే (ఈ భూమిమీదే) 'పరోపకారం" అనే పుణ్యంచేస్తే వెంటనే ఇహమున ఆత్మానందం, పరమున కైవల్యము సాధింపవచ్చును కదా! మనవాళ్లు అనుకొనే చుట్టాలు యెవ్వరు? బంధువులనే వారలెవ్వరు? వీళ్లంతా యేమిటికి (దేనికి?) సర్వశ్రేష్ఠుడైన లక్ష్మీరమణుని ధ్యానిస్తూ ఇక్కడనే ఆనందం అనుభవించటం శ్రేష్ఠము కదా! ఒకసారి ఆలోచించండి. మనకు యెంతమంది దేవుళ్ళు వున్నారు? యెంతమంది దేవతలున్నారు? ఇంతమంది అవసరమా? దేనికి చెప్పండి? మర్మము తెలిసి శ్రీవేంకటేశ్వరుని చిందరవందర కాకుండా కొలచినచో ఇహములో ఆనందం, పరములో కైవలం లభిస్తాయి!
* పరహితము = పరోపకారము, * రవ్వగు = శ్రేష్ఠుడైన 
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/9BYBuw62p7s