Tuesday, December 9, 2025

ఏమని చెప్పెద - Emani Cheppeda

ఏమని చెప్పెద నిటమీఁద హరీ
శ్రీమంతుఁడ నినుఁ జేరితి మిదివో

వినుచున్నారము వెనకటిపాట్లు
కనుచున్నారము కలఁగేటివారల
దినదినభావము తెలిసీఁ దెలియదు
మనసున భయ మిసుమంతయు లేదు

భువి నెరుఁగుదు మిదె పుట్టెడిదెసలను
తవిలి మరణములు దలఁచెద మట్లనె
వివరపుటాసలు విడిచీ విడువవు
నవమగువిరక్తి నాఁటదు వోయె

చదివెద మిదివో సకలశాస్త్రములు
వెదకెద మిదె శ్రీ వేంకటేశ నిను
మదిలోనుండగఁ మరచివుంటి మిదె
యెదుటఁగంటి మిఁక యేలాపనులు 

భావము:
నిలువెత్తు శ్రీవేంకటేశ్వరుని సందర్శించిన మైమరపులో ఆ అర్చావతారాన్ని చూస్తూ పులకరించిన అన్నమయ్య నోటినుండి వెలువడిన కీర్తన ఇది. ఓ శ్రీహరీ! ఇంకా ఇటుపైన ఏమని చెప్పెదనయ్యా? నీవు శ్రీమంతుడవు. మేము నీ భృత్యులము. ఇదివో నీ ఆశ్రయంలో చేరితిమి. మాకు సర్వస్వమూ నీవే. అన్యమేదీలేదు. మేము మాచుట్టూ జన్మంతరమున చేసిన మరు జన్మలలో యేవిధముగా ఆ కర్మఫలము అనుభవించవలసివుంటుందో వినుచున్నారము. అట్లు ఆ పాపఫలము కలిగినవారలను కొందరిని కనుచున్నారము కూడా. అయితే జీవభ్రాంతివలన, దినదిన భావము తెలిసియూ తెలియనివారివలె ప్రవర్తించుచున్నాము. మనస్సున కొంచెమైనను జంకు గొంకు నెరుగకున్నాము. ఉన్నతమైన జన్మపొందినవారు హేయమైన మరణము బొందుట గమనించితిమి. దూషించదగిన ఆశలతో వారు చేసిన దుష్కార్యములను గురించి విని అట్టివి మేము వెంటనే విడిచిపెట్టాలని అనుకొంటాము. కాని అదేమి చిత్రమో ఆ ఆశలు మమ్ములను విడువవు. మాకు కొత్తజీవితం ప్రసాదించగల “విరక్తి" నాటుకొనదు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవిచ్చిన శ్రేష్ఠమైన జన్మవలన సకల శాస్త్రములను చదివితిమి. అందువలన నిన్ను వెదకి కనుగొన ప్రయత్నించుచున్నాము. కాని నీవు మా మదిలోనే అంతర్యామివని మఱచితిమి. ఇదిగో నేడు మా ఎదుటనే నిన్ను కనుగొంటిమి. ఇక మాకు ప్రాపంచిక విషయములేల?
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/GiJi9U9mXAo 

No comments:

Post a Comment