Wednesday, March 25, 2026

సర్వాంతరాత్ముడవు - Sarvantaratmudavu

సర్వాంతరాత్ముడవు శరణాగతుఁడ నేను
సర్వాపరాధినైతి చాలుఁజాలునయ్యా

వూరకున్న జీవునికి వొక్కొక్క స్వతంత్ర మిచ్చి
కోరేటియపరాధాలు కొన్ని వేసి
నేరకుంటే నరకము నేరిచితే సర్గమంటా
దూరువేసే వింతేకాక దోష మెవ్వరిదయ్యా

మనసు చూడవలసి మాయలు నీవే కప్పి
జనులకు విషయాలు చవులుచూపి
కనుఁగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి
ఘనము సేసే విందు గర్త లెవ్వరయ్యా

వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే
కన్న కన్న భ్రమతలే కల్పించి
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె
నిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలుసునయ్యా

భావము :
మేము అస్వతంత్రులమైన జీవులమయ్యా! ఈ జీవులకు కోర్కెలు కల్పించేది మళ్ళీ నీవే. మంచి చెడు కల్పించి మాకు స్వర్గమో నరకమో అంటకట్టే వాడివి నీవే. వాటిని పొందాక మా మీద నేరం మోపేదీ నీవే. నీవు సర్వాంతరాత్ముడవు. మేము నిన్ను ఆశ్రయించి శరణుచొచ్చిన శరణాగతులము. ఈనాడు నీవు కల్పించిన బలహీనతల వలన నేను అపరాధినై నీయెదుటబడవలసి వచ్చింది. చాలు చాలునయ్యా! నన్ను యేలికవై నీవే నేరములెంచక ఆదుకో అంటున్నారు అన్నమయ్య.
ప్రభూ! నీవు సర్వాంతరాత్ముడవు. (అందరిలోనూ అంతరాత్మవోలె యుండువాడు.) మరి నేనో, నీ శరణాగతుడను. నాలోని బలహీనతలకు, ఉన్నతికి కారణము నేనే అని అనిపించినా అసలు కారణం నీవే. సర్వాపరాధములను చేసిన చవటగ మిగిలి పోయాను. ఇక చాలుచాలునయ్యా!
1. ఏదో ఎవరిదారిన వారున్న జీవులకి కొంత కొంత స్వతంత్రము ఇచ్చి వారిని యేవేవో కోరికలతో కొన్ని అపరాధములను చేయిస్తావు. జీవికి తెలివి లేకపోతే ఇదిగో పాపము చేశావని నరకము అంటకట్టెదవు. వాడు నీ తత్త్వము నేర్చి మంచిగా వుంటే స్వర్గప్రాప్తి ఆపైన అహంకారం అనే దోషం  అంటకట్టెదవు. ఓ దేవదేవా! ఇందులో దోషమెవ్వరిదో చెప్పవయ్యా!
2. ఇకపోతే మాకు మనస్సు అనే దౌర్భాగ్యాన్ని అంటగట్టి దాన్ని లేనిపోని మాయలలో ముంచి తేల్చి, మమ్మల్ని ఆదుకోవలసిన నీవే ఈ జనులందరికి విషయసుఖముల రుచిచూపించి... ఇదంతా నీమాయ అను సత్యాన్ని గ్రహించిన వారికి మోక్షం ఇస్తావు. ఒకవేళ వారు సత్యమును కానకుంటే వారికి కర్మబంధం అంటకడతావు. నీవేమో ఘనుడిగానే వుండిపోతావు. మరి మేము కర్మబద్ధులమై పోతాము. ఏమిటీ అన్యాయం? దీనికి కర్తలెవరయ్యా?
3. దేవా! అసలీ ప్రాణులందరూ వున్నది వొక్కనీ గర్భముననే కదా! మరి నీ గర్భంలో వున్న నీ బిడ్డలకి నీవే, కానలేని, కానరాని భ్రమలను కల్పించి అనేక  కర్మలు చేసేట్లు పురికొల్పుతావు. మళ్ళీ నీవే శిక్షిస్తావు. ఏమిటి స్వామీ ఈ ఆట. నీ శరణాగతులకు ఈ బాధలేవీ వుండవు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు  మమ్ము ఇట్టే యేలితివి. నన్ను యెంచుకోవాలని నీకే తెలుసును తండ్రీ! 
(భావము : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/XbCWLtv98xY 

No comments:

Post a Comment