Wednesday, March 25, 2026

గోవింద కేశవ నీకు - Govinda Keshava Neeku

గోవింద కేశవ నీకు కుయ్యో మొఱ్ఱో
వోవల నీపాలఁ జిక్క దోహో నామనసు

వొకటిపైఁ గాంక్షించు వొకటిపై వేసారు
వొకవేళ దుర్మాన మొడిగట్టును
వికలుఁడై యంతలోనే విషయపు బారిఁ జిక్కు
ఆకటా యిన్నిటాఁ దుమురాయఁబొ నామనసు

తలపోసు నొకవేళ తమకించు నొకవేళ
వొలుకుఁగోపము చల మొకవేళ
కలగించు నొకవేళ గర్వించు నొకవేళ
పొలసి యిన్నిటా వీదిఁ బోయఁబో నా మనసూ

సంతసించు నొకవేళ జయమందు నొకవేళ
పంతమాడు నొకమట్టు పడినవేళ
యింతలో నీవు శ్రీ వేంకటేశ కావకయుండితే
రంతుల నేమీఁ జెప్పరాదువో నామనసూ

తాత్పర్య వివరణ:
హే! గోవిందా! హే! కేశవా! నీకు కుయ్యో! మొఱ్ఱో (కుయ్యో! మొఱ్ఱో అని | నీ కొఱకు యేడుస్తున్నానయ్యా!) ఇదేమిటి ప్రభూ! ఈ నా మనస్సు వోవల (ఒప్పుగా) నీపాల జిక్కదు (నీయందులగ్నముకాదు!) ఓహో! యేమి నా దౌర్భాగ్యము!!
ప్రభూ! ఈ నామనస్సుందే... ఇది ఒకటిపై గాంక్షించు (ఒకదాన్ని కోరుకుంటుంది). కానీ ఇంకోదానికోసం వెంపర్లాడుతుంది. ఒక్కొక్కప్పుడు దుర్మార్గమైన పనులకు ఒడిగడుతుంది. మళ్ళీ అంతలోనే వికలత్వమునొంది విషయలోలత్వము నొందుతుంది. అకటా! (అయ్యో!) నా మనస్సు యిన్నిటా ఇన్ని విధాలుగ తుమురాయెబో (ముక్కలు ముక్కలయిపోయింది కదా!)
ప్రభూ! ఈ మనస్సువున్నదే ఒక్కొక్కప్పుడు నిన్ను తలపోస్తూ వుంటుంది.) ఒక్కొక్కప్పుడు తమకిస్తుంది. (చలించిపోతుంది). ఒక్కొక్కప్పుడు విపరీతమైన కోపమునకు లోనవుతుంది. ఒకప్పుడు మత్సరముతో వుంటుంది. ఒక్కొక్కప్పుడు పోట్లాడుతుంది. ఒక్కొక్కప్పుడు విపరీతమైన గర్వమును పొందుతుంది. ఓ దేవా! పొలసి (కావాలని) నా మనస్సు నన్నిలా వీధిపాలు చేసిందయ్యా!
ఈ నా మనస్సు ఒక్కొప్పుడు విజయగర్వంతో గొప్ప సంతోషంతో వుంటుంది. ఒక మట్టుపడినవేళ (అణగారివున్నవేళ) పంతముకూడా నా మనస్సు పడుతుంది. అంతెందుకు? ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు కనుక దీన్ని దయదలచకుండావుంటే ఈ పాటికి రంతుల (భోగాసక్తమై యేమయ్యేదో ఈ మనస్సు నేను చెప్పలేను.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు

Watch for audio - https://youtu.be/DbszymTWn-4 

No comments:

Post a Comment