Wednesday, March 25, 2026

దేవదేవోత్తముని తిరుతేరు - Deva Devottamuni Thiruteru

దేవదేవోత్తముని తిరుతేరు
దేవతలు గొలువఁగా తిరుతేరు

తిరువీధులేగీని తిరుతేరు
తిరుపుగొన్నట్లాను తిరుతేరు
తెరలించె దనుజులఁ దిరుతేరు
తిరిగె దిక్కులనెల్ల తిరుతేరు

ధిక్కిరించీ మోతలఁ దిరుతేరు
దిక్కరికుంభా లదరఁ దిరుతేరు
తిక్కుముత్తేలకుచ్చుల తిరుతేరు
తెక్కులఁబ్రతాపించీఁ దిరుతేరు

తీరిచెఁ గలకలెల్లఁ దిరుతేరు
ధీర గరుడవాహపుఁ దిరుతేరు
చేరి యలమేలుమంగతో శ్రీవేంకటేశ్వరుని -
తీరున నెలకొన్నట్టి తిరుతేరు 

భావామృతం :
దేవదేవుడని పిలువబడెడి దేవతా శిఖామణులందరిలోన సర్వశ్రేష్టుడెవరో ఆయన దేవదేవోత్తముడు. ఆయనే శ్రీమన్నారాణుడైన శ్రీవేంకటేశ్వరుడు. అదిగో ఆ వస్తున్నదే ఆయన 'తిరుతేరు ’ (శ్రీప్రదమైన రథము). దేవతలందరూ కొలుచుచుండగా సాగివస్తున్నదా 'తిరుతేరు”.
ఆ తిరుతేరు తిరుమలలోని తిరువీధుల గుండా సాగివచ్చుచున్నది. ఆ తిరుపు గొన్నట్లు ఆను' తేరు, (భగవంతుడు తిరుగుటకు నియమించబడినది). ఆ తేరు దానవులను తెరలించింది (తొలగించింది. అంటే, స్వామి ఆ రధంపై నుండే అనేక దానవులను నిర్మూలించాడని). నేడు తిరువీధులలో అన్ని దిక్కులలోనూ సాగుచున్నది స్వామి యొక్క తిరుతేరు, (దీన్ని చూస్తున్న మనదే భాగ్యం.)
ఈ తిరుతేరు సాగుచున్నప్పుడు తప్పెట్లు, బాకాలు, డోళ్ళు, మంగళ వాయిద్యములు చేయుచున్న ధ్వనుల యొక్క 'హోరు' ధిక్కరించుచున్నట్లు (యుద్దములో తిరుగుబాటు చేయుచున్నట్లు) ఉన్నది. అది, స్వామి వెంట వచ్చుచున్న 'దిక్కరి కుంభాలు' (పెద్దపెద్ద కుండలు) అదురుచున్న తిరుతేరు (అదరిపడుచున్న తిరుతేరు). ఇది, తిక్కు ముత్తేల కుచ్చుల తిరుతేరు, (అంటే..... ఆకర్షణీయమైన ముత్యములు కుచ్చులుగా కట్టి, వ్రేలాడదీసిన తిరుతేరు). తెక్కుల (గర్వముగల) ప్రతాపము కనబరచుచున్న తిరుతేరు.
ఈ తిరుతేరు కలకలము తీరిచె (క్షోభను నివారించును). గరుత్మంతుడు వాహనముగా అలంకరించిన తిరుతేరు ఇది. శ్రీవేంకటేశ్వరుడు మరియు అలమేల్మంగ ఒకటిగా చేరి, శోభాయమానంగా (తేరుగా నెలకొని ఊరేగుచున్న తిరుతేరు ఇదియే. చూచి మీ జన్మధన్యం చేసికొనండి.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/ta6hHUfzM0Q 

No comments:

Post a Comment