Wednesday, March 25, 2026

విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా - Vicheyavamma Vennelabomma

విచ్చేయవమ్మా వెన్నెలబొమ్మా
మచ్చిక మరునిఢాక మగువ నీరాక

పంచల పసిండి నిగ్గు వచ్చిదేరే సిగ్గు
వంచన వలపు తీపు వాలుక చూపు
కంచపుంబాలకూడు కాఁకలనీవాడు
మంచపు నీ తలఁబ్రాలు మట్టెల పాదాలు

కోవిల కొసరుఁబాట కొమ్మరో నీమాట
తావులచెంగావి నీ తళుకుమోవి
గోవజవ్వాది కరంగు గుబ్బల నీమెఱుంగు
భావజు దాడిరొదలు పాదపు నీకదలు

ముద్దుల నీనగవు చిమ్ముల రతిబిగువు
అద్దలింపుఁ గసరు మోహంపుఁ గొసరు
గద్దరి నీయలపు వేంకటపతి తలఁపు
అద్దపునీమోము మోహనరతిసాము 

తాత్పర్య వివరణ:
స్నిగ్ధమైన వెన్నెల బొమ్మవంటి ఓ అలమేల్మంగా! మెల్లగా నీపతి వద్దకు విచ్చేయవమ్మా! (రావమ్మా!) ఓమగువా! నీరాక, మచ్చికతో మిమ్ము అలరించ దలంచిన, మరుని (మన్మధుని) ఢాక (ఢక్కావలె) స్వామివారికి వినపడుతున్నది కాబోలు.
ఓ దేవీ! నీవు సిగ్గుపడుతుంటే, పసిండికి (బంగారమునకు) పంచల నిగ్గు (పంచవన్నెల కాంతి) సమకూడినట్లయినది. నీ వాలుకన్నుల చూపు, ప్రియుని నీ వంచించే వలపులు కూడా తీపిగానే వుంటాయేమో అనిపిస్తున్నది. నీవాడు (నీ మనోహరుడు) కాకలవున్నాడమ్మా (ఆయన నీవు ఆలోచనలో మెదలగానే వేడెక్కిపోతున్నాడు.) ఆయనకు కంచము నిండా పాలతో నిండిన మధురాన్నం తినిపించవమ్మా! మట్టెల సవ్వడి చేసే నీ పాదాలు నీవు వంగి చూసికొనగానే నీ శిరసునున్న తలంబ్రాలు నీ పాన్పుపై పడినవమ్మా!
కొమ్మరో! (ఓ యువతీ!) నీవు మాట్లాడుతుంటే కోయిల కొసరి కొసరి పాడుతున్నట్లుంది. తళతళ మెరయుచున్న నీ మోవి (అధరము) చెంగావిరంగు తాపినట్లున్నది. గోవ (మనోజ్ఞముగా) జవ్వాది మెత్తిన (మెత్తగా), దానిలో కరిగినట్లున్న నీ చనుగుబ్బలు మెరిసిపోతున్నాయి. కదలెడి నీ పాదముల సవ్వడి భావజుడు (మదనుడు) మీపై దాడి చేస్తున్నట్లున్నది తల్లీ!
దేవీ! ముద్దులొలికే నీ చిరునవ్వు, రతికేళిలో నీ బింకమూ, నీ ప్రియుని నీవు అదిలించి కసురుకొనే వుత్తిత్తి చిరాకు స్వామికి విపరీతమైన మోహాన్ని కలుగజేస్తున్నది. దిట్టతనముగల సురతమున నీ అలయక (నిస్సత్తువ) చూపినా, నీపతి వేంకటపతి తలపు, అద్దమువంటి నీమోమున నీపతి రతిసాము ప్రతిఫలింపచేస్తున్నదమ్మా!
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/J7EPzcFJufM 

No comments:

Post a Comment