Saturday, February 7, 2026

నా తప్పు లోఁ గొనవే - Na Tappulogonave

నా తప్పు లోఁ గొనవే నన్నుఁ గావవే దేవ
చేఁతలిన్నీ జేసి నిన్నుఁజేరి శరణంటిని

అందరిలో నంతర్యామివై నీవుండఁగాను
యిందరిఁ బనులుగొంటి నిన్నాళ్ళును
సందడించి యిన్నిటా నీచైతన్యమై యుండఁగాను
వందులేక నేఁ గొన్నివాహనా లెక్కితిని

లోకపరిపూర్ణుఁడవై లోనా వెలి నుండఁగాను
చేకొని పూవులుఁ బండ్లుఁ జిదిమితిని
కైకొని యీమాయలు నీకల్పితమై వుండఁగాను
చౌకలేక నేవేరే సంకల్పించితిని

యెక్కడచూచిన నీవే యేలికెవై వుండఁగాను
యిక్కడాఁ దొత్తుల బంట్ల నేలితి నేను
చక్కని శ్రీవేంకటేశ సర్వాపరాధి నేను
మెక్కితి నన్ను రక్షించు ముందెఱఁగ నేను

భావవివరముః
పరమాత్మతో అన్నమయ్య మనవి వినండి. ప్రభూ! నాతప్పు లోగొనవే (మన్నించవయ్యా). చేసేవన్నీ చేసి నేడు నిన్ను జేరి శరణంటిని అని భావింపవలదు. నేను చేసిన కొన్ని తప్పులను అంగీకరిస్తున్నాను, ఆలకింపుము. మా అందరిలోనూ అంతర్యామిగా నీవే వున్నావని అందరితోనూ పని చేయించుకొంటే పరమాత్మ నాకు చేసినట్లేనని గ్రహించలేకపోయాను. అతిశయించి అన్నిటిలోనూ చైతన్యమై నీవేవుండగా వందులేక (ఏమాత్రం విచారం లేక) నేను కొన్నిటిని వాహనాలుగా చేసికొని తిరిగాను. లోకమంతా పరిపూర్ణుడవై, లోపలా బయటా నీవేవుండగా, ఎన్ని పూవులను కోసి లతలను బాధించాను!! ఎన్ని పండ్లను చెట్లనుంచి త్రుంచి తిన్నాను!! నీవు నీ చేతలతో మాయాకల్పితములుగా సృజిస్తే సరుకు జేయక నేను వేరుగా సంకల్పించితిని. స్వామీ! యెక్కడ చూచినా నీవే జగదీశ్వరుడవై కనబడతుంటే నేను యెందర్నో యేలికలను కొని వాళ్ళకు తొత్తులుగా, బంట్లగా సేవించాను. చక్కదనాల శ్రీవేంకటేశ్వరా! నేను సర్వాపరాధినైనప్పటికీ శరణని నీకుమొక్కాను. నేను గతంలో అజ్ఞానినే కాని, నీవాడను.
* చౌక - తిరస్కారం  *ముందెరగను - అజ్ఞానిని
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/xiRELKaXXDE 

No comments:

Post a Comment