Saturday, February 7, 2026

అటువంటి వైభవము - Atuvanti Vaibhavamu

అటువంటి వైభవము లమరఁజేసినదైవ
మిటువంటియోగంబు లిన్నియును జేసి

జలజాక్షి లావణ్యజలధి నుప్పొంగింప
నలివేణి ముఖచంద్రుఁ డభ్యుదయమాయ
కలికి వలరాయఁడను కాలకూటంబుతో
దలకొన్న యధరామృతంబు జన్మించె

వనిత సౌభాగ్యంబువనధిలోపలఁ దోఁచె
గొనకొన్న గుఱుతైన కుచపర్వతములు
తనివోనికోరికల తగుతురంగములతో
ననువైన విరహబడబానలము గలిగె

భామ యవ్వనమనెడి పాలజలనిధిలోన
వామాక్షియైన యవ్వనలక్ష్మీ గలిగె
యీమంచి తిరువేంకటేశ్వరుం డిందులోఁ
బ్రేమమున సుఖియించి పెంపొందఁగలిగె

Watch for audio - https://youtu.be/WpYIsRsu7jY

No comments:

Post a Comment