Saturday, November 8, 2025

కొల్లున నవ్వేరు నిన్ను - Kolluna Navveru Ninnu

కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుఁడా
గొల్లెతల నేమనేవు గోవిందుఁడా

యేపున నీసుద్దులెల్ల యిట్టె యశోదతోడ
గోపిక లాడుకొనేరు గోవిందుఁడా
తీపుల నీచేఁతలెల్ల తేట తెల్లమాయనిదే
కోపగించఁ జెల్లదిఁక గోవిందుఁడా

సిసువవై యాడువారి చీరలు దీసినందుకు
కొసరి తిట్టేరు నిన్ను గోవిందుఁడా
పసులఁగాచేచోట భామలు విందు దెచ్చిరి
కుసిగుంపు సేయకుమీ గోవిందుఁడా

వాడలసతుల నొక్కవావిగానే సేసితివి
కోడెల నావులఁ గాచేగోవిందుఁడా
యీడనే శ్రీవేంకటాద్రి నిరవై శ్రీ సతితోడఁ
గూడి లోలుఁడ వైతివి గోవిందుఁడా 

Watch for audio - https://youtu.be/4BZzquFbLSo 

No comments:

Post a Comment