Saturday, November 8, 2025

ఈతఁడు తారక బ్రహ్మమితఁడు - Itadu Taraka Bramhamitadu

ఈతఁడు తారకబ్రహ్మ మితఁడు మాదేవుఁడు
కౌతుకానఁ జెప్పే వినఁగదరే వో జనులు

రాముఁడు యిందీవరశ్యాముఁడు నానాసార్వ-
భౌముఁడు షోడశకళాసోముఁడు
దోమటిరాక్షసులను తుత్తుమురు సేసినాఁడు
కామితఫలములిచ్చి కాచినాఁడు సురల

పూర్ణుఁడు నీలమేఘవర్ణుఁడు దానమున వి-
స్తీర్ణుఁడు వాహనసువర్ణుఁడు
అర్ణవము దాఁటి రావణాదుల గెలిచినాఁడు
నిర్ణయించి చెప్పరాదు నేఁడీతని మహిమ

వరుఁడు సీతకు పరాత్పరుఁడు కోదండదీక్షా-
గురుఁడు దివ్యామోఘశరుఁ డితఁడు
నిరతి శ్రీవేంకటాద్రినెలవై యుండేటివాఁడు
సరి భరతలక్ష్మణశత్రుఘ్న సహితుఁడు

Watch for audio - https://youtu.be/d68qvCig71c 

No comments:

Post a Comment