Friday, November 21, 2025

హరి నీకే శరణని - Hari Neeke Saranani

హరి నీకే శరణని గెలుచుటగాక
యిరవుగ నెరఁగఁగ నెవ్వరితరము

తనువికారములు తరవులు వెట్టిన
కొనయెరుకైనా కొరతవడు
మనసువికారము మమతలఁ దగిలిన
యెనసి యెదురుపడ నెవ్వరితరము

కంతువికారము కన్నులఁగప్పిన
పంతపు విరతియు బయలౌను
చింతాలహరులు చీఁదర రేఁగిన
యింతయు వీడ్కొన వె(నె)వ్వరితరము

అతిగుణవికార మాసలఁ బెట్టిన
సతతయోగములు జడనుపడు
మతి శ్రీవేంకటపతి నిన్నుఁ గొలిచిన
యితరము దగ్గర నెవ్వరితరము 

భావ దర్పణము :
అన్నమయ్య ఈ కీర్తనలో ఒక గొప్ప రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. శ్రీహరిని సాధించాలంటే, తన కరుణ గెలవాలంటే స్వామి శరణాగతియే చక్కటి మార్గము. ఎందుకంటే ఆయనను పూర్తిగా నెరుగుట ఎవ్వరి తరమౌతుంది? అటువంటప్పుడు శరణమే సులభము. మానవుని శరీరము కలిగించు వికారములు నిర్బంధించినప్పుడు, దాని తుది పరిణామం తెలిసినా కొరత మిగిలిపోతుంది. అదే మనస్సు కనుక వికారమునకు లోనైతే మమతల వుచ్చులో తగిలి భ్రాంతి చెందుతుంటుంది. అప్పుడు దాని నెదుర్కొనుట యెవ్వరి తరము? మన్మథ వికారము కన్నులను కప్పివేస్తే పంతముతో కూడిన విశ్రాంతి అవసరమౌతుంది. చింతితుడై చిరాకు కలిగినప్పుడు దీనినంతా | ఒక్కసారిగా విడిచిపెట్టడం యెవ్వరి తరమౌతుంది చెప్పండి. గొప్పగుణవికారముచేత, ఆశలో తగులుకొని యెల్లప్పుడూ యోగసాధనలో కూడా వెనకపడిపోవటం జరుగుతుంది. ఓ శ్రీవేంకటపతీ! అప్పుడు మనస్సులో నిన్ను కొలిచినవానికి విషయములు దగ్గరవవు. అట్లా ఆ శరణాగతులను చెడగొట్టుట యెవ్వరి తరము.
* జడనుపడు - మందమతియై వెనకపడిపోవును * విరతి - విశ్రాంతి * తరవులు - నిర్బంధము
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/kjV8by9RmUc 

No comments:

Post a Comment