Wednesday, March 25, 2026

ఎందాఁక నిద్ర నీకిదె - Yendaka Nidra Nikide

ఎందాఁక నిద్ర నీకిదె తెల్లవారెఁగదె
యిందిరారమణ నీవిటు మేలుకొనవే

కమలనాభుఁడ నీకు గంగాదినదులెల్ల-
నమర మొకమజ్జనం బాయితము సేసె
తమితోడఁ గనకాద్రి తానే సింహాసనము
విమలమై యొప్పె నదే విచ్చేయవే

హరి నీకు నజుఁడు పంచాంగంబు వినిపించ
నిరతమగు వాకిటను నిలిచినాఁడు
సురలు నీయవసరము చూచుకొని కొలువునకు
సరవి నాయిత్తపడి సందడించేరు

కామధేనువు వచ్చె కనుఁగొనుటకై నీకు
శ్రీమహాదేవి నీచేలాగు కదివో
యీమహిమ శ్రీవేంకటేశ నీకే చెల్లె
కామించి యన్నియునుఁ గైకొంటివిపుడు 

భావామృతం :
ఓ ఇందిరా రమణా! (లక్ష్మీపతీ!) నీవు ఎంత దనుక నిద్రించెదవు స్వామీ! తెల్లవారిపోయినది కదా! ఇప్పుడు నీవు మేలుకోవలెను ప్రభూ! (మేమంతా నీ కోసం తపిస్తున్నాము.)
ఓ పద్మనాభా! పవిత్రమైన గంగ మొదలైన నదులన్నీ నీ చిత్తంవచ్చిన దాంట్లో స్నానమాచరించి మమ్మల్ని తరింపజేయమని వేడుకొంటూ నిరీక్షిస్తున్నాయి. నీపై అపేక్షతో ఈ ‘కనకగిరి' (అక్కడవున్న స్వామి పైన ఈ కీర్తన చెబుతున్నా రన్నమయ్య) తనంత తానేగొప్ప సింహాసనమై నీకై పవిత్రముగా శోభిల్లుచున్నది. అదిగో తిలకించు ప్రభూ! నీవు లేచివచ్చి ఇటు మమల్ని తరింపచేయుము తండ్రీ!
ఓ శ్రీహరీ! అజుడు (పుట్టుకలేని చతుర్ముఖ బ్రహ్మ) నీవు స్నానమాడి సిద్ధమవగానే నేటి పంచాగము వినిపించి తిధి వార వర్జ్య విశేషములను నిత్యమూ నీకు తెలిపినట్లే తెలుపుటకు నీ వాకిటిలో నిలిచి సిద్ధముగానున్నాడు.
దేవతలందరూ నీకేమే మవసరమవుతాయో వాటిన్నిటినీ క్రమబద్ధంగా నీ కొరకు సిద్ధముగానుంచుటకు హడావిడి చేస్తున్నారు (ఎంత అద్భుతమైన భావనో చూడండి). కంగారుపడుతున్నారు. లే ప్రభూ! ఇకనైనా లేచి రావయ్యా!
నిన్ను దర్శించుకొని కావలసినవన్నీ ఏర్పాటు చేయుటకొరకు కామధేనువు కూడా వచ్చేసింది చూడు. నీ చెల్లెలు పార్వతీదేవి (మహాదేవి) నిన్ను భక్తితో స్తుతించుటకు విచ్చేసింది. ఇంత వైభోగం ఇంకొకరికి చెల్లునా? ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు దేనినపేక్షిస్తే అది తక్షణమే సిద్ధమవుతుంది. ఇప్పటికిప్పుడే వీటిని స్వీకరించితివి. ఓ శ్రీపతీ! మహానుభావా! మేమంతా ధన్యతనొందాము. 
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/babYCaqLKUk 

No comments:

Post a Comment