Wednesday, March 25, 2026

ఏదాయ నేమి హరి - Yedayanemi Hari

ఏదాయ నేమి హరి యిచ్చినజన్మమే చాలు
ఆదినారాయణుఁడీ యఖిలరక్షకుఁడు

శునకముబతుకును సుఖమయ్యే తోఁచుఁగాని
తన కది హీనమని తలఁచుకోదు
మనసొడఁబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో నంతరాత్మ దైవమౌట దప్పదు

పురువుకుండేనెలవు భువనేశ్వరమై తోఁచు
పెరచోటి గుంతయైన ప్రియమైయుండు
యిరవై వుండితేఁజాలు యెగువేమి దిగువేమి
వరుస లోకములు “సర్వం విష్ణుమయ”ము

అచ్చమైన జ్ఞానికి నంతా వైకుంఠమే
చెచ్చెరఁ దనతిమ్మటే జీవన్ముక్తి
కచ్చుపెట్టి శ్రీ వేంకటపతిదాసుఁడైతే
హెచ్చుకుందేమిలేదు యేలినవాఁడితఁడే 

భావామృతం :
ఏ జన్మ అయితే నేమి, అది శ్రీహరి ఇచ్చినదే కదా! ఈ ఆదినారాయణుడే సర్వులను రక్షించు బాధ్యత తీసికొనిన దేవదేవుడు.
ఒక కుక్కకు దాని జన్మగొప్పగానే వుంటుంది. అది ఎన్నడూ తనది హీనమైన జన్మ అని అనుకోదు. తన మనస్సు అంగీకరిస్తే మంచి జన్మేమిటి కానిదేమిటి? శరీరంలో అంతరాత్మ రూపంలో దేవుడు తప్పకుండా వుంటాడు. అందుచేతనే ఏ జీవికైనా జీవితేచ్ఛ కలుగుతుంటుంది.
ఒక పురుగునకు అది వుండే నెలవు (చోటు) దానికి భువనేశ్వరంలా తోస్తుంది. ప్రపంచంలో సర్వశ్రేష్టమైనదిగా అనిపిస్తుంది. పరాయిచోటనుండే గుంట యెంతో అయిష్టంగా వుంటుంది. సుస్థిరమై వుండాలి గాని ఊర్ధ్వలోకమైనా అధోలోకమైనా బేధమేమి వుంటుంది? వరుసలో వున్న లోకాలన్ని విష్ణుమయమే. కాబట్టి ఎవరు యెక్కడ వున్నా విష్ణు చింతనలో వుంటే విష్ణువుతో వున్నట్లే అవుతుంది.
నిజమైన జ్ఞానికి అంతా వైకుంఠమే. చెచ్చెర (శీఘ్రముగా) తనయొక్క తిమ్మటే (తగులమే) జీవన్ముక్తి. అనగా సంసార బంధాలలో వున్నప్పటికీ ఆ జ్ఞాని జీవన్ముక్తుడే. శ్రీ వేంకటేశుని కచ్చుపెట్టి (కోరికగల) దాసులకైతే, హెచ్చుకుందేమి లేదు (హెచ్చు తగ్గులు లేవు). వారందరికీ ఏలిక ఈ శ్రీవేంకటేశ్వరుడే.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Watch for audio - https://youtu.be/oWsRFxlw8rE 

No comments:

Post a Comment