Wednesday, March 25, 2026

విన్నప మిదియే - Vinnapa Midhiye

విన్నప మిదియే వేవేలకు గోవిందా గోవిందా
సన్నుతించెదను నావలనఁ గలుగు సర్వాపరాధము లెంచకుమీ

యెఱఁగమినాది యెఱుక నీపని యేమరి సంసారినైన యిన్నాళ్ళును
మఱతును నేను మఱవవు నీవు మదమున సిరు లుప్పతిల్లఁగా
కొఱగాను నేను కొఱగలవు నీవు కొమ్మలవలపులఁ దగిలితిఁ గనక
మఱి నీవే గతి రక్షింపుము నా మర్మము నీచేతనున్నది సుమ్మీ

నేరమి నాది నేరుపు నీది నేఁబుట్టుగులకు లోనైనయపుడే
కోరుదు నేను కోరవు నీవు గొనకొని యాపదలు పైకొనఁగా
దూరుదు నేను దూరవు నీవు తొరలి పురాకృతకర్మము లప్పుడు
యేరీతినైనా నీవే దిక్కింక యిదె నీకు శరణు చొచ్చితిఁ జుమ్మీ

తలఁచమి నాది తలఁపు నీది యిటు తగ నంతర్యామివి గలకాలము
కొలుచుట నాది కొలువుగొనుట నీది కూరిమితో నే నీకు మొక్కఁగా
ఫలము నాది నా ఫలదుఁడవు నీవు పరికింపఁగా శ్రీవేంకటేశ్వర
బలువుఁడవు నీవు నన్ను నేలునాపాలిదై వమవు నీవే సుమ్మీ

భావవివరముః
భక్తిరసప్రధానమైన కీర్తన చెబుతున్నారు పెదతిరుమలయ్య. ఓ గోవిందా! నావలన కలిగిన సర్వాపరాధములను యెంచకు (పరిగణించకు) నన్ను మన్నించు. ఓ గోవిందా! ఇది నా విన్నపము. అనేకమైన నా పాపములను క్షమించు. ఎందుకంటే నాది యెఱుగమి (అజ్ఞానము). నీపని నావంటి వానిని జ్ఞానిని చేయుట. ఇన్నాళ్ళూ సంసారినై యేమఱి వున్నాను. నాకు మతిమఱుపు వుంది. నీవు మఱువవు. కొద్దిపాటి సిరులు రాగానే మదమెక్కి కన్నుమిన్ను గానను నేను. అందుకే నేను కొఱగాను (పనికిరాను). మరి నీవో | కొఱగలవు (ప్రయోజనం వున్నవాడవు). ఆడదాన్ని చూస్తే వలపు పిచ్చినాకు వుంటుంది. ఇదిగో నా రహస్యాలన్నింటిని నీకు విప్పి చెప్పాను. మఱి నీవే గతి. నన్ను క్షమించి, రక్షించు. ప్రభూ! నేరములన్నీ నావే. నీవి నేర్పులు. అందువల్లనే యెన్ని నీచ జన్మలనో పొందాను. నీకే కోరికా లేదు. ఏమాత్రం ఆపద వచ్చినా, దానినుంచి బయటపడవేయమని కోరుకొంటాను నేను. నీవెవ్వరినీ నిందించవు. నా పురాకృత కర్మఫలమునకు నిన్ను నిందిస్తాను నేను. ఇదిగో, ఇదే నీకు శరణుచొచ్చితిని. ఏదోవిధంగా నాకు దిక్కువై నన్ను ఆదుకో. దేవా! నాది తలచమి. మరి నీదో, తలపు (జ్ఞప్తి). ఎందుకంటే నా అంతరాత్మగా 'జ్ఞప్తి' నిచ్చేవాడవు నీవే. అంతటి నిన్ను కొలుచుట నా కర్తవ్యము. నా కొలువు మన్నించుట నీ దయ. నీదినాపై కూరిమి (ప్రేమ). అందుకే నీకు మొక్కుతున్నాను. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు ఫలదాతవు. కర్మఫలము పొందేవాడను నేను. నీవు బలవంతుడవు నా నమ్మిన దేవుడవు నీవే సుమా!
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు) 

Watch for audio - https://youtu.be/QTKLqyz4Tjs 

No comments:

Post a Comment