శ్రీగురుం డర్థితో శేషాద్రి యందు
యోగనిద్రాకేళి నున్న యత్తఱిని
వనజాస నాది దేవత లేఁగుదెంచి
వినుతించి రప్ప డవ్విధ మెట్టి దనిన
శ్రీకర ! వేంకటక్షితిధరావాస !
నా కేంద్రనుత రమానాథ మేల్కొనుము
వసుదేవదేవకీ వరగర్భజాత
కిసలయాధర రామకృష్ణ మేల్కొనుము
తపము పెంపున యశోదానందులకును
గృపతోడ శిశువైన కృష్ణ మేల్కొనుము
పూతనాకైతవ స్ఫురిత దుర్వార
చైతన్యహరణ ప్రశస్త్ర మేల్కొనుము
అఱిములకి శకటాసురాంగంబు లీల
విఱుగఁ దన్నిన యదువీర ! మేల్కొనుము
సుడిగాలిరాకాసి స్రుక్కడంగించి
కెడపిన యదుబాలకృష్ణ మేల్కొనుము
మద్దులఁ గూల్చి యున్మదవృత్తి మెఱయు
ముద్దుల గోపాలమూర్తి మేల్కొనుము
అద్రిరూపం బైన యఘదైత్యుఁ జంపి
రౌద్రంబు మెఱయు భూరమణ మేల్కొనుము
ఆననంబునఁ దల్లి కథిల లోకములు
పూని చూపిన యాది పురుష మేల్కొనుము
ఖరధేనుకాసుర క్రకచ మేల్కొనుము
వరగర్వఘనబకవైరి మేల్కొనుము
చతురాననుడు వత్పసమితి నొంచి నను
బ్రతి యొనర్చిన పరబ్రహ్మ మేల్కొనుము
గురుతర గోపాల గోపికా మూస
తరణ గోవర్ధనోద్ధరణ మేల్కొనుము
కాళియ ఫణిఫణాంగణనృత్యరంగ
లాలితచరణ విలాస మేల్కొనుము
అతుల కుబ్దామనోహరుఁడ మేల్కొనుము
చతురమాలాకార శరణ మేల్కొనుము
వనజాక్ష : యక్రూరవరద మేల్కొనుము
వినయవాక్యోద్ధవవినుత మేల్కొనుము
కోకలిమ్మన్నఁ గైకొన కున్నఁ బట్టి
చాకిఁ గొట్టిన యట్టి సరస మేల్కొనుము
భుజవిక్రమ క్రమస్పూర్తిమై భోజ
గజముఁ జంపిన బాహంగర్వ మేల్కొనుము
జెట్టి పోరును గిట్టి చీరి చాణూరు
చట్టలు వాపిన శౌరి మేల్కొనుము
చండ భారతరణ చాతుర్య ధుర్య
గాండీవిసారధ్యకరణ మేల్కొనుము
బల భేది భేదించి పారిజాతంబు
నిలకుఁ దెచ్చిన జగదీశ ! మేల్కొనుము
పరలోకగతులైన బాలుర దెచ్చి
గురున కిచ్చిన జగద్గురుఁడ మేల్కొనుము
బాణబాణాసనోద్బట భీమ బాణ
పాణి ఖండన చక్రపాణి మేల్కొనుము
శంసింప జగదేక శరణంబ వైన
కంసుని తలగొండు గండ మేల్కొనుము
మానిత సామ్రాజ్య మండలి నుగ్ర
సేను నిల్పిన ధర్మశీల మేల్కొనుము
రాజసూయమున శూరతఁ జైద్యుఁ దునిమి
పూజలందిన జగత్పూజ్య మేల్కొనుము
మురనరకాసుర ముఖ్య దానవులఁ
బొరిగొన్న యదు రాజపుత్ర మేల్కొనుము
వీరకౌరవసభ విశ్వరూపంబు
ధీరతఁ జూపిన దేవ ! మేల్కొనుము
ఇంపునఁ బృథుకంబు లిడిన కుచేలు
సంపన్నుఁ జేసిన చతుర ! మేల్కొనుము
దారుణభూ భారతరణావతార
భూరివ్రతాపవిస్ఫురణ మేల్కొనుము
సదమలానంద ! నిశ్చయముల కంద !
విదురుని వింద ! గోవింద ! మేల్కొనుము
బోజక న్యాముఖాంభోజ ద్విరేఫ
రాజీవనయనాభిరామ ! మేల్కొనుము
వరరూపవతి జాంబవతితోడి రతుల
నిరతిమై నోలాడు నిపుణ ! మేల్కొనుము
మంజుల సత్యభామా మనస్సంగ
రంజితగాత్ర సంరంభ మేల్కొనుము
లలిత కాళిందీవిలాసకల్లోల
కలిత కేళీలోల ఘనుఁడ మేల్కొనుము
చారుసు దంతా విశాలాక్షి కుముద
సారప్రభాపూర్ణచంద్ర ! మేల్కొనుము
నేత్రరాగవి శేష నిచిత ప్రతోష
మిత్రవిందారనోన్మేష ! మేల్కొనుము
భద్రానఖాంకుర బాలచంద్రాంక
ముద్రిత భుజతటీమూల ! మేల్కొనుము
లక్షణాపరిరంభ లక్షితోదార
వక్షోవిశాలకవాట ! మేల్కొనుము
వేడుక బదియాఱు వేల కామినులఁ
గూడి పాయని పెండ్లికొడుక ! మేల్కొనుము
కలిత నక్రగ్రాహగంభీరజలధి
వలయిత ద్వారకావాస ! మేల్కొనుము
జలదనీల శ్యామ ! జగదభిరామ
వెలయ మేల్కొను మంచు విన్నవించుటయు
వీనులఁ గదిసిన వెలిదమ్మికన్నుఁ
గోనల నమృతంబు గురియ మేల్కొచి
సరసిజాముఁడు దేవసంఘంబు మీఁద
కరుణాకటాక్షవీక్షణము నిగుడ్చి
శ్రీవేంకటాచల శిఖర మధ్యమున
సౌవర్ణమణిమయ సౌధంబు లోన
పూగ చంపక కుంద పున్నాగ వకుళ
నాగరంగప్రసూన విరాజమాన
తరులతా పరివేష్టితం బైన యట్టి
నిరుపమ కోనేరి నిర్మలాంబువులఁ
దిరుమజ్జనంబాడి ది వ్యాంబరంబు
ధరియించి దివ్యగంధము మేన నలఁ ది
నవరత్నమయ భూషణంబులు దాల్చి
వివిధ సౌరభముల విరు లోలి ముడిచి
ధారుణీ సురులకు దానంబు లొసఁగి
చేరి యక్షతములు శిరమునఁ దాల్చి
వినుతులు గావింప విబుధ సన్మునుల
మనవులు విని వారి మన్నించి మించి
యగణితరత్నసింహాసనారూఢుఁ
డగుచు మేరువు మీఁది యుధ్రంబు వోలెఁ
గరకంకణోజ్జ్వలక్వణనంబు లెసఁగ
సరసిజముఖులు వెంజామరల్ వీవ
బంగారు గుదియల పడవాళ్ళు దొరలు
భంగించి యటు బరాబరులు సేయంగ
నారదవీణా నినాదంబు లెసఁగ
చారణ మునిసిద్ధ సంఘంబు గొలువ
నానాప్సరస్సతుల్ నాట్యఘుల్ సేయ
మానవేశులు మహామహులు సేవింప
ఘనతర నిత్యభోగంబులు వెలయు
జనుల కెల్ల మహా ప్రసాదంబు లొనరఁ
గోరిన వారికిఁ గోర్కు లీడేర
నీరీతి జగముల నేలుచు నుండు
నని భక్తిఁ దాళ్ళపాకాన్నమాచార్యు
తనయుండు తిమ్మయ తగఁ బ్రస్తుతించె
నేచి యీ కృతి ధరణీశుల సభల
నాచంద్రతారార్కమై యొప్పఁ గాక !