Wednesday, February 21, 2024

జోజో దీనజనావనలోలా - JOJO DEENA JANAVANALOLA

జోజో దీనజనావనలోలా
జోజో యదుకుల తిలకా గోపాలా 

వేదములు రత్నాల గొలుసులై యమర
వేదాంత మపరంజి తొట్లగా నమర
నాదము ప్రణవము పాను పై యమర
ప్రణవార్థమై యిచ్చట పవ్వళింపు స్వామీ 

అతి చిత్రముగఁబది యవతారములబ్రోవ
అమరుచు పదినాల్గు జగములఁ బ్రోవఁ
బ్రతి యుగమున జనియించు మిగుల
ప్రబలి జన్మరహితుఁడనుకొన్న స్వామీ 

శాంతియు మణిమయ మకుటమై మెఱయ
శక్తులు మహాహారంబులై మెఱయ
దాంతియుఁ గుసుమమాలికయై మెఱయ
ధరలో శ్రీవేంకటేశ రమణుడౌస్వామీ ! 


దృష్టిదాఁకు మా యయ్యకు - Drusti takumaayyaku

దృష్టిదాఁకు మా యయ్యకు తెరవేయరే
దృష్టించెదరెవరైన దరిజేర నియ్యకురే

చప్పుడు సేయుటకవసరము గాదనరే
అప్పుడు మజ్జన మాడునని దెలుపరే
కప్పురంబు సురఁటుల గొలిచెదరనరే
అప్పుడు సతులతోను నారగించినాడనరే

దంతపుఁ జవికెలో నేకాంతమాడు ననరే
అంతరంగమున నెత్తమాడెదరని తెలుపరే
దొంతిపూల తొట్లలోన దొమిగూడి యున్నాఁడనరే
చెంత కేళాకూళిలోన జిత్తగించి యున్నాఁడనరే

పట్టపురాణియుఁదాను బవ్వళించియున్నాఁడనరే
రట్టుసేయ నిందెవరైనా రానీయకురే
పట్టపు అలమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుఁడు
సృష్టిలోకకర్తగాన సేవించి పొమ్మనరే 


లావణ్యశృంగారరాయ - Lavanya Srungararaya

లావణ్యశృంగారరాయ లక్ష్మీనాథ
యేవేళ నీవినోదాన కేదాయ నేమి

పాలజలధివంటిది పవ్వళించు నామనసు
గాలివూర్పులే కడళ్లు కలదు లోఁతు
చాలఁగ దొల్లి నీవు సముద్రశాయివట
యీలీల నీవినోదాన కేదాయ నేమి

నిక్కపుభూమివంటిది నెలవుకో నామనసు
పెక్కులిన్నియుఁ గలవు పెరుగుచుండు
పుక్కటఁ దొల్లియు నీవు భూసతిమగఁడవట
యెక్కువ నీవినోదాన కేదాయ నేమి

నిండుఁగొండవంటి దిదె నిలుచుండు నాభక్తి
వుండుచోటనేవుండు నొక్కచోటను
కొండలరాయఁడవట కోరికె శ్రీవేంకటేశ
అండ నీవినోదాన కేదియాయ నేమి 


కుందణంపుమై - Kumdanampumai

కుందణంపుమై గొల్లెత తా -
నెందును బుట్టని యేతరి జాతి

కప్పులు దేరేటి కస్తూరి చంకల
కొప్పెర గుబ్బల గొల్లెత
చప్పుడు మట్టెల చల్లలమ్మెడిని
అప్పని ముందట హస్తిణిజాతి

దుంప వెంట్రుకల దొడ్డతురుముగల -
గుంపెన నడపుల గొల్లెత
జంపుల నటనలఁ జల్లలమ్మెడిని
చెంపల చెమటల చిత్తిణిజాతి

వీఁపున నఖములు వెడవెడ నాఁటిన
కోపపుఁ జూపుల గొల్లెత
చాఁపున కట్టిగఁ జల్లలమ్మెడిని
చాఁపేటి యెలుగున శంకిణిజాతి

గారవమున వేంకటపతి కౌఁగిట
కూరిమిఁ బాయని గొల్లెత
సారెకు నతనితో చల్లలమ్మెడిని
బారపుటలపుల పద్మిణిజాతి 


ఏలే జాణతనాలు - Ele Janatanalu

ఏలే జాణతనాలు యింతేసి నీకు
యేలేవాఁడవు నీవే యేమని చెప్పుదురా

సెలవుల నవ్వేవేమే చెలియా నీకె
సెలవుసుమీ యది చెప్పితి నేను
పలుకులు నేరుతువే పసలుగాను ఆ –
పలుకులు కర్పురపుబరణివే కదరా

మనసు దెలుపవే మగువా అవులే
మనసుద్దు లెల్లాను మరుఁడెఱుఁగు
మొనలుగాఁ బెంచితివేమే ముద్దులగోళ్లు
మొనలు చూడరా జాజిమొగ్గలలో నున్నవి

పేరు చెప్పఁగదవే పిన్నదానా పాలు
పేరుఁ దోడంటు వెట్టితే పెరుగువెలెనే
సారెసారెఁ బెనఁగేవే సమరతుల
సారెలు శ్రీవేంకటేశ చక్కఁగా నాడించరా
 

Saturday, February 10, 2024

నీదాస్యమొక్కటే - Ni Dasyamokkate

నీదాస్యమొక్కటే నిలిచి నమ్మఁగలది
శ్రీదేవుఁడవు నీచిత్తము నాభాగ్యము

అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా
తనువిధి మలమూత్రములప్రోగు
జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా
వొనరఁ గర్మమనే వోఁదానఁ బడినది

చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా
పొదలిన మతముల పోరాట మది
మదిమది నుండిన నామనసే నమ్మితినా
అదియును నింద్రియాల కమ్ముడువోయినది

పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా
పాత్రమగు రుణానుబంధము లవి
చిత్రముగ నన్నుఁ గావు శ్రీవేంకటేశ నీవే
పత్రపుష్పమాత్రమే నాభక్తియెల్లా నీకు 


అన్నిటికి నొడయఁడవై - Annitiki Nodayadavai

అన్నిటికి నొడయఁడవై న శ్రీపతివి నీవు
యెన్నరాదు మాబలఁగఁ మెంచుకో మాపౌఁజు

జ్ఞానేంద్రియము లైదు శరీరిలోపల
ఆనక కర్మేంద్రియము లైదు
తానకపు కామక్రోధాల వర్గము లారు
యీనెలవు పంచభూతా లెంచు మాపౌఁజు

తప్పనిగుణాలు మూఁడు తనువికారము లారు
అప్పటి మనోబుద్ధ్యహంకారాలు
వుప్పతిల్లు విషయము లుడివోని వొక‌అయిదు
యిప్పటి మించేకోపము యెంచుకో మాపౌఁజు

ఆఁకలిదప్పియును మానావమానములను
సోఁకిన శీతోష్ణాలు సుఖదుఃఖాలు
మూఁకగమికాఁడ నేను మొక్కెద శ్రీవేంకటేశ
యేఁకటారఁ గడపేవా నెంచుకో మాపౌఁజు 


ఇన్ని జన్మము లేఁటికి - Inni Janmamuletiki

ఇన్ని జన్మము లేఁటికి హరిదాసు-
లున్న వూరఁ దా నుండినఁ జాలు

హరిభక్తుల యింటియన్నము గొనువారి-
వరువుడై వుండవలెనన్నఁ జాలు
పరమభాగవత భవనంబులఁ జెడ్డ
పురువు దానయి పొడమినఁ జాలు

వాసుదేవుని భక్తవరులదాసులు మున్ను-
రోసినయెంగిలి రుచిగొన్నఁ జాలు
శ్రీ సతీశునిఁ దలఁచినవారి దాసాన-
దాఁసుడై వుండఁదలఁచినఁ జాలు

శ్రీ వేంకటేశుఁ జూచినవారిశ్రీ పాద-
సేవకుఁడై యండఁజేరినఁ జాలు
యీవిభుదాసుల హితుల పాదధూళి-
పావనమై సోఁకి బ్రదికినఁ జాలు 


కైకొన్నకొలఁది కర్మము - Kaikonna Koladi Karmamu

కైకొన్నకొలఁది కర్మము
వాకుచ్చి తనతోనే వగవఁగనేలా

తలఁచినకొలఁదేదైవము తన-
కలపుకోలుకొలఁదే కడనరులు
బలువుకొలఁదియే పంతము
తొలఁగర(క?) యితరుల దూరఁగనేలా

మచ్చిక నొడివినంతే మంత్రము
అచ్చపుభక్తి కొలఁదే యాచార్యుఁడు
నిచ్చలుఁ గోరినయంతే నిజమైనలోకము
పచ్చివెచ్చిచదువుల భ్రమయఁగనేలా

నెమ్మది జాతెంతే నియమము
సమ్మతించినంతే సంతోసము
యిమ్ముల శ్రీవేంకటేశుఁడిచ్చినంతే యిహపర-
మెమ్మెల కిది మరచి యేమరఁగనేలో  


మానవుగా మమ్ము నేల - Manavuga Mammu Nela

మానవుగా మమ్ము నేల మగనాలిఁ జెనకేవు
కానీ కానీలే యింకాఁ జాలదా

దక్కె నీకుఁ జాలదా తగు రుకుమిణి నీవు
వెక్కసాన లూటిసేసి వేసుకొన్నది
మొక్కల మది చాలదా మున్ను త్రిపురాంగనలఁ
జిక్కించి చీఁకటితప్పు సేసినది

చెల్లె నదె చాలదా చేకొని రేపల్లె నీవు
గొల్లెతల మానములు కొల్లగొన్నది
అల్లది చాలదా నరకాసురుఁడు దెచ్చుకొన్న
పెల్లగు కామినులనుఁ బెండ్లాడినది

అంత నీకుఁ జాలదా అల పూవులవారింటి
కాంత నీవు దొడికిన కల్లతనము
చెంతలఁ గూడితి నన్ను శ్రీ వేంకటేశ నీవు
మంతు కెక్కితిఁ జాలదా మన్నించినది 


దేవ నీ చెలువములోఁ - Deva Ni Cheluvamulo

దేవ నీ చెలువములోఁ దిరమై మిక్కిలి నీ
దేవి చెలువము దెచ్చెఁ దేటతెల్లమిగాను

గరిమ నీ వురము కౌస్తుభమాణికముతో
సరి దూఁగి యెక్కు డాయ సతీమణి
వరుస నీదు బాహువల్లుల నడుమను
పెరిగి నీ లలితాంగి పెద్దరిక మందె‌

నీలిమేఘమువంటి నీ మేనికాంతికి
మేలిమివన్నె దెచ్చె మెరుఁగుఁబోఁడి
పోలింప నీదు తమ్మిబొడ్డుకంటెఁ బొడవున
కాలు దొక్కి నిలిచెను కమలాలయ

అదివో నీ బంగారుహారముల నడుమను
పొదిబంగా రై నిలిచె పుత్తడిబొమ్మ
పొదిగి శ్రీవేంకటేశ భోగించె నీ కాఁగిటికి
అదనఁ బుట్టుభో గాయ నలమేలుమంగ 


ఏమిటివాఁడఁ గాను - EmativadanuGanu

ఏమిటివాఁడఁ గాను యిఁకనేను నా -
సామపుఁ గర్మము నీకే సమర్పయామి

తలఁపులోపలనున్న తత్వమా యిట్టె
వెలినుండే నాపాలి విష్ణుమూర్తీ
పలుకు లోపల నుండే పరమాత్ముఁడా నా
చలమరి మతి నీకే సమర్పయామి

పుట్టుగులిచ్చినయట్టి పురుషోత్తమా తుద -
ముట్టించు మోక్షపుమురమర్దనా
గుట్టుతో నిహముచూపే గోవిందుఁడా నా
జట్టి చైతన్యము నీకే సమర్పయామి

అరిదిభోగములిచ్చేయంతరాత్ముఁడా నాకు
శరణమైనయట్టి సర్వేశ్వరా !
వెరసి నన్నేలిన శ్రీ వేంకటేశుఁడా నా
సరవులన్నియు నీకే సమర్పయామి 


రతిరాజ గురుఁడవు - Ratiraja Gurudavu

రతిరాజ గురుఁడవు రమణిని నే నీకు
ఇతరము లెల్లాను యేమి చెప్పేమయ్యా

వరుసల నీ చిత్తము వచ్చినదే కాఁపురము
అరసి నిన్నుఁ  బాయని దది బదుకు
సరసము నీతో నాడే చనవే సౌఖ్యము
యెరవుల సుద్దు లిఁక నేమి చెప్పేమయ్యా

సెలవి నీవు నవ్విన చెలువమె సఫలము
అలరి నీవు మాటాడుటది సంపద
తలఁచి నీకు వలచు దాని జన్మమే జన్మము
యెలమి నున్న కోరికె లేమి చెప్పేమయ్యా

భావించి నీవు చూచిన భాగ్యమే యెక్కుడు
తావుకొన్న నీ రతులే ధనధాన్యాలు
శ్రీ వేంకటేశ్వర నే నీదేవి నలమేల్మంగను
యీవేళ నేలితి వింక నేమి చెప్పేమయ్యా 


Saturday, February 3, 2024

నిత్యాత్ముడై యుండి - Nityaatmudai Yundi

నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సంస్తుత్యుఁడీ తిరువేంకటాద్రివిభుఁడు

ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁడేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁడేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁగాఁడు యేమూర్తి త్రైమూర్తి లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాత్ముఁడేమూర్తి పరమాత్ముఁడామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు

యేదేవుదేహమున నిన్నియును జన్మించెనే దేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁడిజీవులిన్నింటిలో నుండు నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుఁడాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు

యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పు నిశ్వాస మీమహామారుతము యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁడేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు 


తమయెఱుక తమకుఁ - Tamayeruka Tamaku

తమయెఱుక తమకుఁ దగినంతే
నెమకిన మాకును నీకృప యింతే

పొసఁగ నీనాభినిఁ బుట్టిన బ్రహ్మలు
యెసఁగిన నీపూర్వ మెఱిఁగేరా
వెస నీముఖమున వెడలిన వేదము
దెసల నీమహిమ తెలియఁగఁగలదా

నగుచు నీమాయల నడచే జగములు
సొగసి నీమూరితి చూపెడినా
తగ నినుఁ గానఁగ తపించు మునులును
పొగరుల మము నిఁక బోధించేరా

అంతేసివారల కటువలె నుండఁగ
వింతజీవులకు వివేక మెట్లొకో
యింతట శ్రీవేంకటేశ నీవే మము
చెంతఁజేరి దయసేయఁగదే  


నారాయణ నీ నామ - Narayana Ni Nama

నారాయణ నీ నామమహిమలకు
గోరఁ బోవుటకు గొడ్డలి దగునా

హరియని నొడిగిన నణఁగేటి పాపము
సిరుల నేను నుతిసేయఁగఁగలనా
పరగిన పిచ్చుకపై బ్రహ్మాస్త్రము
దొరకొని వూరకె తొడిగినయట్లు

అచ్చుత యనఁగా నందెటి సంపద
యిచ్చల నెంచిన నిలఁగలదా
కొచ్చికొచ్చి యొక కొండంత కనకము
వెచ్చపుఁ బోఁకకు వెల యిడినట్లు

యెదుటనే శ్రీవేంకటేశ్వర యనఁగాఁ
బొదిగెటి తపముల పుణ్యము గలదా
కదిసి సముద్రము గడచి వోడలోఁ
జిదిసి యినుము దెచ్చినయట్లు 


నాకుఁ గలపని యిదె - Naku Galapani Idhe

నాకుఁ గలపని యిదె నారాయణుఁడ నీవు
శ్రీకాంతుడవు నాకు సిద్ధించుకొరకు

జలధివంటిది సుమీ చంచలపు నామనసు
కల వింద్రియముల నేటిజలచరములు
వొలసి భక్తెనెడి వోడ యెక్కితి నేను
జలశాయి నీవ నేటిసరకు దెచ్చుటకు

కొండవంటిది సుమీ కొనకెక్కు నామనసు
వుండుఁ గామాదులను వురుమృగములు
వుండి నీశరణమను వూఁత గొని యెక్కితిని
కొండలప్ప నీవనేటి కొనఫలముకొరకు

టీవులను ధరణివంటిది సుమీ నామనసు
నీవె శ్రీవేంకటేశ నిక్షేపము
వావాత నీవనేటి వసిదవ్వి కైకొంటి
భూవిభుఁడ నీవనేటి పురుషార్థము 


ఈమాట విన్నవించరే - Ee Mata Vinnavinchare

ఈమాట విన్నవించరే యింతులాల విభునికి
దీమసపునాగుణము తెలియదా మీకు

బాస దప్పవద్దుగాని పరకాంతల నింటికి
వాసితోడఁ దెచ్చుకొంటే వలదనేనా
ఆసకొల్పవద్దుగాని అక్కడఁ దా నెటువలె
వేసా లెన్నిచేసినా వెంగెమాడేనా

పంతమాడవద్దుగాని భావించి నామే లెఱిగి
యెంత నాతో నవ్వినా నేఁటికనేనా
వింతసేయవద్దుగాని వేడుకకాఁడవైఇట్లు
సంతోసానఁ దిరిగినా సాదించేనా

జోలిఁ బెట్టవద్దుగాని చోటిచ్చి పానుపుమీఁద
యేలాగునఁ గూడినా యెమ్మెలాడేనా
వేళతోడ నన్నును శ్రీవేంకటేశుఁ డిదె కూడె
మేలములెన్నియాడినా మితిమీరేనా 


గోవింద గోవింద యని కొలువరె - Govinda Govinda Yani Koluvare

గోవింద గోవింద యని కొలువరె
గోవిందా యని కొలువరె

హరి యచ్యుతా యని యాడరె
పురుషోత్తమా యని పొగడరె
పరమ పురుషా యని పలుకరె
సిరివర యనుచునుఁ జెలఁగరే జనులు

పాండవ వరద యని పాడరె
అండజ వాహనుఁ గొనియాడరె
కొండలరాయనినె కోరరె
దండితో మాధవునినె తలఁచరె జనులు

దేవుఁడు శ్రీవిభుఁడని తెలియరె
సోవల ననంతునిఁ జూడరె
శ్రీవేంకటనాధునిఁ చేరరె
పావనమై యెప్పుడును బ్రదుకరే జనులు 


భావించ నేర్చినవారి - Bhavincha Nerchinavari

భావించ నేర్చినవారి భాగ్యముకొలది ముక్తి
శ్రీవల్లభుఁడే జీవన్ముక్తి

చూచి తలఁచేవారికి సులభాన నుండు ముక్తి
కాచుకున్నవారికిఁ గలదు ముక్తి
చేచేత నందుకొంటే చేరువనే వుండు ముక్తి
యేచి కొలిచితేఁ దనయింట నుండు ముక్తి

తగిలి సాము సేసితేఁ దనలో నున్నవి ముక్తి
పగ లేకుండితే భూమిపై దే ముక్తి
నొగులక నుడిగితే నోరనే వున్నది ముక్తి
బగివాయకుండితే బట్టబయటనే ముక్తి

ధరియించుకుండితేను తనువుపై నుండు ముక్తి
అరసితే గురుస్మరణందుండు ముక్తి
యిరవై శ్రీవేంకటేశు నెప్పుడు సేవించితేను
దొరకి పుణ్యులకు నెదుట నుండు ముక్తి 


చూచి వచ్చితి నీవున్న చోటికిఁ - Chuchi vachiti Nivunna Chotiki

చూచి వచ్చితి నీవున్న చోటికిఁ దోడితెచ్చితి
చేచేతఁ బెండ్లాడు చిత్తగించవయ్యా

లలితాంగి జవరాలు లావణ్యవతి యీకె
కలువకంటి మంచికంబుకంఠి
జలజవదన చక్రజఘన సింహమధ్య
తలిరుంబోడిచక్కఁదన మిట్టిదయ్యా

అలివేణి మిగులనీలాలక శశిభాల
మలయజగంధి మహమానిని యీకె
పెలుచుమరునివిండ్లబొమ్మలది చారుబింబోష్ఠి
కనితకుందరద చక్కందన మిట్టిదయ్యా

చెక్కుటద్దముల దిది శ్రీకారకర్ణములది
నిక్కుఁజనులరంబోరు నిర్మలపాద
గక్కన శ్రీవేంకటేశ కదిసె లతాహస్త
దక్కె నీ కీలేమచక్కందన మిట్టిదయ్యా