Saturday, February 3, 2024

ఈమాట విన్నవించరే - Ee Mata Vinnavinchare

ఈమాట విన్నవించరే యింతులాల విభునికి
దీమసపునాగుణము తెలియదా మీకు

బాస దప్పవద్దుగాని పరకాంతల నింటికి
వాసితోడఁ దెచ్చుకొంటే వలదనేనా
ఆసకొల్పవద్దుగాని అక్కడఁ దా నెటువలె
వేసా లెన్నిచేసినా వెంగెమాడేనా

పంతమాడవద్దుగాని భావించి నామే లెఱిగి
యెంత నాతో నవ్వినా నేఁటికనేనా
వింతసేయవద్దుగాని వేడుకకాఁడవైఇట్లు
సంతోసానఁ దిరిగినా సాదించేనా

జోలిఁ బెట్టవద్దుగాని చోటిచ్చి పానుపుమీఁద
యేలాగునఁ గూడినా యెమ్మెలాడేనా
వేళతోడ నన్నును శ్రీవేంకటేశుఁ డిదె కూడె
మేలములెన్నియాడినా మితిమీరేనా 


No comments:

Post a Comment