Saturday, February 10, 2024

మానవుగా మమ్ము నేల - Manavuga Mammu Nela

మానవుగా మమ్ము నేల మగనాలిఁ జెనకేవు
కానీ కానీలే యింకాఁ జాలదా

దక్కె నీకుఁ జాలదా తగు రుకుమిణి నీవు
వెక్కసాన లూటిసేసి వేసుకొన్నది
మొక్కల మది చాలదా మున్ను త్రిపురాంగనలఁ
జిక్కించి చీఁకటితప్పు సేసినది

చెల్లె నదె చాలదా చేకొని రేపల్లె నీవు
గొల్లెతల మానములు కొల్లగొన్నది
అల్లది చాలదా నరకాసురుఁడు దెచ్చుకొన్న
పెల్లగు కామినులనుఁ బెండ్లాడినది

అంత నీకుఁ జాలదా అల పూవులవారింటి
కాంత నీవు దొడికిన కల్లతనము
చెంతలఁ గూడితి నన్ను శ్రీ వేంకటేశ నీవు
మంతు కెక్కితిఁ జాలదా మన్నించినది 


No comments:

Post a Comment