Saturday, November 26, 2022

ఇందిరాధిపుని సేవ - Indiradhipuni seva

ఇందిరాధిపుని సేవ యేమరకుండుటగాక
బొందితోడిజీవులకు బుద్దు లేఁటిబుద్దులు

రేయెల్లా మింగిమింగి రేపే వెళ్లనుమియు
బాయట నిద్రాదేవి పలుమారును
చాయలకు నిచ్చనిచ్చా జచ్చిచచ్చి పొడమేటి-
మాయజీవులకునెల్లా మని కేఁటిమనికి

కనురెప్ప మూసితేనే కడు సిష్టే చీఁకటౌను
కనురెప్ప దెరచితే క్రమ్మర బుట్టు
ఘనమై నిమిషమందే కలిమి లేమియుఁ దోఁచె
యెనయుజీవుల కింక యెఱు కేఁటియెఱుక

వొప్పగుఁ బ్రాణము లవి వూరుపుగాలివెంట
యెప్పుడు లోనివెలికి నెడతాఁకును
అప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డందరికి
తప్పక యాతఁడే కాచు తలఁపేఁటి తలఁపు 

రాముఁడు రాఘఁవుడు - Ramudu Raghavudu

రాముఁడు రాఘఁవుడు రవికులుఁ డితఁడు
భూమిజకుఁ బతియైన పురుషనిధానము

అరయఁ బుత్రకామేష్టియందుఁ బరమాన్నమున
పరగ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపఁగ నసురల శిక్షింపఁగ
తిరమై యుదయించిన దివ్యతేజము

చింతించే యోగీంద్రుల చిత్తసరోజములలో
సంతతము నిలిచిన సాకారము
వింతలుగా మనులెల్ల వెదకి కనేయట్టి-
కాంతులఁ జెన్నుమీరిన కైవల్యపదము

వేదవేదాంతములందు విజ్ఞానశాస్త్రములందు
పాదుకొనఁ బలికేటి పరమార్థము
పోదితో శ్రీవేంకటాద్రిఁ బొంచి విజనగరాన
ఆదికి సనాదియైన‌ అర్చావతారము 



ఎదుట నెవ్వరు లేరు - Eduta Nevvaruleru

ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే
వదలక హరిదాసవర్గమైనవారికి

ముంచిననారాయణమూర్తులే యీజగమెల్ల
అంచితనామములే యీయక్షరాలెల్లా
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా
తెంచివేసి మేలు దాఁ దెలిసేటివారికి

చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే
భారపుయీ భూమెత నీపాదరేణువే
సారపుఁగర్మములు కేశవుని కైంకర్యములే
ధీరులై వివేకించి తెలిసేటివారికి

చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుఁడే
హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే
మత్తిలి యీతనికంటే మరి లే దితరములు
తిత్తిదేహపుబ్రదుకు తెలిసేటివారికి 

నీకే శరణు నీవు - Neeke Saranu Neevu

నీకే నే శరణు నీవు నన్నుఁ గరుణించు
యీకడ నాకడ దిక్కు యెవ్వరున్నా రిఁకను

కన్నులఁ జంద్రసూర్యులుగలవేలుపవు నీవు
పన్నినలక్ష్మిభూమిపతివి నీవు
అన్నిటా బ్రహ్మకుఁ దండ్రియైన యాదివేలుపవు
యెన్నఁగ నీకంటే ఘన మెవ్వరున్నా రిఁకను

దేవతలందరు నీ తిరుమేనైనమూర్తి
ఆవలఁ బాదాన లోక మణఁచితివి
నీవొక్కఁడవే నిలిచిన దేవుఁడవు
యేవేళ నీకంటే నెక్కుడెవ్వరున్నా రిఁకను

అరసి జీవులకెల్ల నంతరాత్మవైన హరి
సిరుల వరములిచ్చే శ్రీవేంకటేశ
పురుషోత్తముఁడవు భువనరక్షకుఁడవు
యిరవైననీవేకాక యెవ్వరున్నా రిఁకను 

అంతయు నీవే హరి - Antayu Neeve Hari

అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీరఘురామా

కులమును నీవే గోవిందుఁడా నా-
కలిమియు నీవే కరుణానిధీ,
తలఁపును నీవే ధరణీధరా ,నా-
నెలవును నీవే నీరజనాభా

తనువును నీవే దామోదరా, నా-
మనికియు నీవే మధుసూధనా
వినికియు నీవే విట్ఠలుఁడా,నా-
వెనకముందు నీవే విష్ణుదేవుఁడా

పుట్టుగు నీవే పురుషోత్తమా కొన
నట్ట నడుము నీవే నారాయణా,
యిట్టె శ్రీవేంకటేశ్వరుఁడా నాకు
నెట్టన గతి యింక నీవే నీవే 

Saturday, November 19, 2022

ఎక్కడి మానుషజన్మం - Ekkadi Manusha Janmam

ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తిం బిఁకనూ

మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము
మఱవను యింద్రియభోగము మాధవ నీ మాయా
మఱచెద సుజ్ఞానంబును మఱచెద తత్వరహస్యము
మఱచెద నురువును దైవము మాధవ నీ మాయా

విడువనుఁ బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుఁడ నీ మాయా
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుఁడ నీ మాయా

తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల
తగులను మోక్షపుమార్గము తలఁపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయా 

ఏల మమ్ముఁ దడవేవు - Ela mammu Dadavevu

ఏల మమ్ముఁ దడవేవు యింకానయ్య
యేలితివి నాఁడెనాఁడె యెరుఁగుదుమయ్యా

చిత్తములో చింతలెక్కి చిగురులు గోసేవారు
అత్తి నిన్ను వెదకేరు అదిగోవయ్య
వౌత్తిలి నవ్వులు నవ్వి వొడుళ్ళు నించేవారు
బత్తులు సేసేరు నీకుఁ బైకొనవయ్యా

మించులమాటల మంద మిరియాలు చల్లేవారు
అంచుల నిన్నుఁబిలిచేరాలకించవయ్య
పొంచి నీతో జాళెలేక బొమ్మరాలు వేసేవారు
ముంచి చేతులు చాఁచేరు మొగిఁజూడవయ్యా

తోడనెసరెత్తి లేళ్ళఁ దోలేటియట్టివారు
యీడనే విందులు చెప్పేరియ్యకోవయ్య
కూడితి శ్రీవేంకటేశ గొబ్బున నిదె నేఁడు
వాడికెగా కొంతగొంత వారిమెచ్చవయ్యా 

పాయపుమదముల - Payapu Madamula

పాయపుమదముల బంధమా మము
జీయని యిఁకఁ గృపసేయఁగదో

ధనధాన్యములై తనులంపటమై
పనిగొంటివి నను బంధమా
దినదినంబు ననుతీదీపులఁ బెను-
గనివైతివి యిఁక గావఁగదో

సతులై సుతులై చలమై కులమై
పతివైతివి వోబంధమా
రతిఁ బెరరేఁపుల రంతులయేఁపుల
గతిమాలితి విఁక గావఁగదో

పంటై పాఁడై బలుసంపదలై
బంటుగ నేలితి బంధమా
కంటి మిదివో వేంకటగిరిపై మా-
వెంటరాక తెగి విడువఁగదో 

భోగము నాయందు - Bhogamu Nayandu

భోగము నాయందు నీకు భోగివి నీవు
శ్రీగురుఁడ విన్నిటాను చిత్తగించు నన్నును

చక్కని జన్మపు సంసారవృక్షమునకు
పక్కున ఫలము నీవు భావించఁగా
మక్కువ కర్మమనేటి మత్తగజమునకును
యెక్కువ మావటీఁడవు యెంచఁగ నీవు

నెట్టన దేహమనేటి నిర్మల రాజ్యమునకు
పట్టమేలు చుండిన భూపతివి నీవే
దిట్టయిన మనసనేటి తేజి గుఱ్ఱమునకు
వొట్టిన రేవంతుఁడవు వుపమింప నీవు

సంతసమైన భక్తి చంద్రోదయమునకు
రంతులఁ జెలఁగు సముద్రమవు నీవు
చెంతల శ్రీవేంకటేశ జీవుఁడనే మేడలోన
అంతర్యామివి నీవు అంకెల జూడఁగను 


ఆతఁడేపో మాయేలిక - Atadepo Mayelika

ఆతఁడేపో మాయేలిక ఆతఁడే జగన్మూల-
మాతఁడే శ్రీవేంకటాద్రి యందు మీఁది దైవము

కమలవాసినియైనకాంతఁ బెండ్లాడినాఁ(నవాఁ)డు
కమలములో బిడ్డఁ గన్నవాఁడు
కమలాప్తునిలోనఁ గలిగి మెరయువాఁడు
కమలనాభుఁడేపో కలుగు మాదైవము

జలధి బంధించి లంక సంహరించినవాఁడు
జలధిచొచ్చినదైత్యుఁజంపినవాఁడు
జలధిసుతునకు వరుస బావైనవాఁడు
జలధి శయనుఁడేపో చక్కని మాదైవము

కొండ గొడుగుగనెత్తి గోవులఁగాచినవాఁడు
కొండవంటి రాకాసిఁ గొట్టినవాఁడు
కొండలకు నెక్కుడైన గురుతు శ్రీవేంకటాద్రి-
కొండరూపు దానేపో కోరిన మాదైవము 

Monday, November 14, 2022

అన్నిటా నీ వంతర్యామివి - Annita Nivantaryamivi

అన్నిటా నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను
యెన్నఁగ నీవొక్కఁడవే గతియని యెంచికొలుచుటే ప్రపన్నసంగతి

యేకాంతంబున నుండినపతిని యెనసిరమించుటే సతిధర్మంబు
లోకమురచ్చలోనుండినపతి లోఁగొని పైకొని రానట్లు
యీ కొలఁదులనే సర్వదేవతలయిన్ని రూపులై నీ వున్నప్పుడు
కై కొని నిను బహుముఖములఁగొలుచుట గాదు పతివ్రత వ్రత ధర్మంబు

పూనిన బ్రాహ్మణుల లోపలనే నినుఁ బూజించుట వేదోక్తధర్మము
శ్వానకుక్కుటాదులోపల నిను సరిఁ బూజించఁగరానట్లు,
యీనియమములనె ప్రాకృతజనులను యీశ్వర నీశరణాగత జనులను
కానక, వొక్కట సరిగాఁజూచుట కాదఁ వివేకధర్మంబు

వేంకటపతిగురువనుమతినే నేవే నాకును శిష్యధర్మము
ఆవలనీవల నితరమార్గములు యాత్మలోన రుచిగానట్లు
భావింపఁగ సకలప్రపంచమును బ్రహ్మం సత్యజ్ఞానమనంతము
కైవశమై యిన్నిటా వెనుతగులు కాదవివేకధర్మంబు 


భోగీంద్రశయనుని - Bhogindrasayanuni

భోగీంద్రశయనుని బోయతి దివ్య-
భోగాలు మరిగిన బోయతి

పొదిగొన్న పెనుఁగొప్పు బోయతి మించుఁ-
బొదలిన గుబ్బల బోయతి
పొదలఁ బూవులు చూచి బోయతి యంప-
పొది సవి వెరచెనె బోయతి

పొడల గందపుమేని బోయతి పచ్చి-
పొడికప్పురపు బూఁత బోయతి
పొడవైన హరిఁ జూచి బోయతి నేఁడు
పుడుకు వేఁదురుగొన్న బోయతి

పొందైన రచనల బోయతి పతిఁ
బొందక పొందిన బోయతి
పొందులెరఁగని బోయతి రతిఁ
బొందె వేంకటపతి బోయతి 

అట్టె బదుకవయ్యా - Atte Badukavayya

అట్టె బదుకవయ్యా అంతలోనే మాకేమి
ఇట్టె వలపే నీకు యెక్కువసింగారమా

మాయదారివాఁడవు మానినులవుంగరాలు
యీయెడ వెళ్లఁబెట్టుక యెమ్మెసేసేవు
చాయలమేనిరేఖలు చాలవా అందుకుఁదోడు
కాయముపై మచ్చములు కడుసింగారమా

పొద్దువోనివాఁడవు పొలఁతులవలువలు
కొద్దిమీర మొలఁ గట్టుకొనివచ్చేవు
ముద్దుముద్దువలె నీమోవికెంపులే చాలవా
పెద్దరికపుటెరవు పెక్కువసింగారమా

కతకారివాఁడవు కాంతలపువ్వు దండలు
ఇతవై మెడవేసుక యెలయించేవు
తతి నన్నుఁ బొందితివి దగ్గరి శ్రీవేంకటేశ
రతులసదమదము రాఁపులసింగారమా 


కరుణానిధి నీవే - Karunanidhi Nive

కరుణానిధి నీవే కనుఁగొంచునున్నాఁడవు
యిరవై నాలో నున్నాఁడ వేది గతి యిఁకను

పేరుచున్నవి నాలోనఁ బెక్కు వికారములు
వూరుచున్నవెన్నైనా వూహలెల్లాను
చేరుచున్నవొక్కొక్కటే సేనాసేనకోరికలు
యీరీతి నున్నాఁడ నాకు నేది గతి యిఁకను

పట్టుచున్నవి నానాప్రకృతుల వోజలు
పుట్టుచున్నవి యనేకభోగేచ్ఛలు
చుట్టుకొనుచున్నవి సులభపు వేడుకలు
యిట్టివి నానడతలు యేది గతి యిఁకను

సందడింపుచున్నవి సారెకు నా మమతలు
ముందువెనకై వున్నవి మోహాలెల్లా
చెందె నీపై భక్తి నేఁడు శ్రీవేంకటేశ్వర
యెందునూ నీవే కాక యేది గతి యిఁకను 


Friday, November 11, 2022

శరణమాతనికే - Sarana Matanike

శరణ మాతనికే సర్వభావాల
యిరవై మమ్ము రక్షించ నీశ్వరుఁడే యెఱుఁగు

వచ్చిన త్రోవెఱఁగము వడిఁ బూర్వకాలమందు
చొచ్చెటి త్రోవెఱఁగము సోదించి విూఁద
కుచ్చిన కర్మములతో గుదియై వేలుకాడేము
హెచ్చి మా బ్రదుకుఁదోవ యీశ్వరుఁడే యెరుఁగు

నన్ను నేనే యెఱఁగను నానాచందములను
అన్నిటా నాలోనున్న హరిఁ గానను
కన్నులఁ జూచుచు మంచి కాయములో నున్నవాఁడ
యెన్నఁగ నాజ్ఞానము యీశ్వరుఁడే యెరుఁగు

మొదలు దెలియను ముంచి కొన దెలియను
చదువుచు నున్నవాఁడ సర్వవేదాలు
హృదయములోనుండి యిటు నన్ను గావఁగ
యిదివో శ్రీవేంకటాద్రి యీశ్వరుఁడే యెఱుఁగు 


ఎప్పుడేబుద్ధి పుట్టునో - Yeppudebuddi Puttuno

ఎప్పు డేబుద్ధి వుట్టునో యెరఁగరాదు
దెప్పరపు మా బ్రదుకు దేవునికే సెలవు

యేడనుండి పుట్టితిమో యింతక తొల్లి యింక -
నేడకుఁ బోయెదమో యిటమీఁదను
వీడని మాయంతరాత్మ విష్ణుఁడు మా -
జాడ జన్మమతనికే సమర్పణము

గతచన్న పితరు లక్కడ నెవ్వరో
హితవై యిప్పటి పుత్రు లిదియెవ్వరో
మతి మాజీవనమెల్ల మాధవుఁడు
అతనికే మాభోగాలన్నియు సమర్పణము

తొడికి స్వర్గాదులు తొల్లియాడవో యీ -
నడచే ప్రపంచము నాకేడదో
కడఁగి శ్రీ వేంకటేశు గతియే మాది
అడఁగు మా పుణ్యపాపా లతని కర్పణము 


ఉయ్యాల మంచము - Vuyyala Manchamu

ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును

చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా
యెందును నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును

పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక
మంచముపై బవ్వళించి మాటలాడదు
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి
వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు

వెన్నెలల వేంకటాద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి
మన్ననల యింత లోన మలసీని జెలియ 


ఎట్టిహితోపదేశకుఁడు - Etti Hitopadesakudu

ఎట్టిహితోపదేశకుఁ డెటువంటిదయాళువు
అట్టె తాళ్లపాకన్నమాచార్యులు

పచ్చితామసుల మమ్ముఁ బరమసాత్వికులఁగా
యిచ్చటనె సేసినాఁడు యెంతచిత్తము
యిచ్చగించి మాకులాన నెన్నఁడులేనివైష్ణవ
మచ్చముగాఁ గృపసేసె నన్నమాచార్యుఁడు

ముదిరిన పాపకర్మములు సేసినట్టి మమ్ము
యెదుటఁ బుణ్యులఁ జేసె నెంతసోద్యము
కదిసి యేజన్మానఁ గాననిసంకీర్తన
మదన నుపదేశించె నన్నమాచార్యుడు

గడుసుఁదనపు మమ్ముఁ గడు వివేకులఁ జేసి
యిడుమలెల్లాఁ బాప నేమరుదు
నడుమనె యెన్నఁడుఁ గానని శ్రీవెంకటనాథు
నడియాలముగ నిచ్చె నన్నమాచార్యుఁడు 


నీవే రక్షింతువుగాక - Nive Rakshintuvu Gaka

నీవే రక్షింతువుగాక నిన్ను నమ్మితిమి నేము
దైవమవై నీ వుండఁగ తగ మాదే బ్రదుకు

కోరి వొకరాతివీరుఁ గొల్చి బతికీ నొకఁడు
పైరు వొక్కచెట్టువెట్టి బతికేననీ నొకఁడు
కూరిమిఁ బాము చేఁబట్టుకొని బతికీ నొకఁడు
శ్రీరమణుని దాసుల చేతిదేపో భాగ్యము

ఇసుమంత మన్ను వట్టి యేచి బతికీ నొకఁడు
పసురము నింటఁ గట్టి బతికేననీ నొకఁడు
పసగా వేలె డినుము పట్టి బతికీ నొకఁడు
వసుధేశ నీవు గలవారి కేమి గడమ

ఆకునలముఁ గసవునంటి బతికీ నొకఁడు
లోకులు పెక్కుపాయాల లోలులై బతికే రదే
యీకడ శ్రీవేంకటేశ ఇవెల్లా నీమహిమలే
చేకొని నీమరఁగు చొచ్చినవారే ఘనులు 


నరహరి నీ దయమీఁదట - Narahari Nidayamidata

నరహరి నీ దయమీఁదట నా చేఁతలు గొన్నా
శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా 

మొఱయుచు నరకపు వాకిలి మూసిరిహరినీదాసులు
తెఱచిరి వైకుంఠపురము తెరువుల వాకిళ్ళు
నుఱిపిరి పాపములన్నియు నుగ్గుగ నిటు తూర్పెత్తిరి
వెఱవము వెఱవము కర్మపువిధులిఁక మాకేలా

పాపిరి నా యజ్ఞానము పరమాత్ముఁడ నీదాసులు
చూపిరి నిను నామతిలో సులభముగా నాకు
రేఁపిరి నీపై భక్తిని రే‌యినిఁ బగలును నాలో
వోపము వోపము తపములు వూరకె ఇఁక నేలా

దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీవేంకటేశ్వర
అద్దిరి నీదాసులు నీయానందములోన
ఇద్దరి నీనా పొందులు యేర్పరచిటువలెఁ గూర్చిరి
వొద్దిక నొద్దిక నాకిఁక నుద్యోగములేలా  




చిత్తగించఁ గదవయ్య - Cittaginca Gadavauua

చిత్తగించఁ గదవయ్య చెలియసింగారము
హత్తి నీకు దేవులుగా నన్నిటాఁదగినది

కుప్పెసవరముతోడ కొప్పువెట్టె విరులతో
ముప్పిరి గీలించె ముత్తెముల పాపట
కప్పులుదేర నొసల గస్తూరి బొట్టమరించె
వొప్పగా రత్నాలకమ్మ లొనరించె వీనుల

కంకణ సూడిగములు కైకొనె సందిదండలు
కొంకె మెడఁ బదకముహారాలు నించె
పొంకముగ చంద్రగావిపుట్టము ధరించుకొనె
లంకించె నొడ్డాణము బిల్లల మొలనూలును

పెట్టె నందెలుఁ బెండెము బెరయఁ బాదాలను
మట్టెలు మోఁతలతోడ మలయఁగాను
ఇట్టె శ్రీ వేంకటేశ ఇంతి నిట్టె యేలితివి
పట్టము గట్టుక నీపానుపుపై నున్నది 


Watch for Audio -  https://youtu.be/eOqf8eJH5Og 

రమ్మనవే వాని రమ్మనవే - Rammanave vani Rammanave

రమ్మనవే వాని రమ్మనవే- యీ -
తమ్మికనుఁగొనల తళుకులవాని

మెలుపున నేను మేడమీఁద యీ-
చిలుకఁ బేరుకొని పిలువఁగను
అలపున వీథిఁ దానరుగుచును తనుఁ
బిలిచితినంటాఁ బలికినవాని

కేరడమైన కిన్నెరలో యీ-
నారణి ముట్టుచు నలుగడను
చేరువల తాఁజెలఁగుచును యిటు
పేరుకొనుచు ననుఁ బిలిచినవాని

పరవశమై నేఁ బానుపున యీ-
గిరికుచముల నొడ్డగిలఁగాను
తిరువేంకటఘనగిరిపతి ననుచును యీ-
సిరులుగ ననునిటు చెనకినవాని 


Watch for Audio -  https://youtu.be/20iQzHems6Y 

నారాయణ నీ నామమె - Narayana ne Namame

నారాయణ నీ నామమె గతి యిఁక
కోరికలు నాకుఁ గొనసాగుటకు

పై పై ముందట భవ జలధి
దాపు వెనకఁ జింతా జలధి
చాపలము నడుమ సంసార జలధి
తేప యేది యివి తెగనీఁదుటకు

పండె నెడమఁ బాపపు రాశి
అండఁ గుడిని పుణ్యపురాశి
కొండను నడుమఁ ద్రిగుణరాశి - యివి
నిండఁ గుడుచుటకు నిలుకడ యేది

కింది లోకములు కీడునరకములు
అందేటి స్వర్గాలవె మీఁద
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ -
యందె పరమపద మవల మరేది 


Watch for Audio -  https://youtu.be/ULAIw_YMtN4