Saturday, November 26, 2022

నీకే శరణు నీవు - Neeke Saranu Neevu

నీకే నే శరణు నీవు నన్నుఁ గరుణించు
యీకడ నాకడ దిక్కు యెవ్వరున్నా రిఁకను

కన్నులఁ జంద్రసూర్యులుగలవేలుపవు నీవు
పన్నినలక్ష్మిభూమిపతివి నీవు
అన్నిటా బ్రహ్మకుఁ దండ్రియైన యాదివేలుపవు
యెన్నఁగ నీకంటే ఘన మెవ్వరున్నా రిఁకను

దేవతలందరు నీ తిరుమేనైనమూర్తి
ఆవలఁ బాదాన లోక మణఁచితివి
నీవొక్కఁడవే నిలిచిన దేవుఁడవు
యేవేళ నీకంటే నెక్కుడెవ్వరున్నా రిఁకను

అరసి జీవులకెల్ల నంతరాత్మవైన హరి
సిరుల వరములిచ్చే శ్రీవేంకటేశ
పురుషోత్తముఁడవు భువనరక్షకుఁడవు
యిరవైననీవేకాక యెవ్వరున్నా రిఁకను 

No comments:

Post a Comment