Saturday, November 19, 2022

భోగము నాయందు - Bhogamu Nayandu

భోగము నాయందు నీకు భోగివి నీవు
శ్రీగురుఁడ విన్నిటాను చిత్తగించు నన్నును

చక్కని జన్మపు సంసారవృక్షమునకు
పక్కున ఫలము నీవు భావించఁగా
మక్కువ కర్మమనేటి మత్తగజమునకును
యెక్కువ మావటీఁడవు యెంచఁగ నీవు

నెట్టన దేహమనేటి నిర్మల రాజ్యమునకు
పట్టమేలు చుండిన భూపతివి నీవే
దిట్టయిన మనసనేటి తేజి గుఱ్ఱమునకు
వొట్టిన రేవంతుఁడవు వుపమింప నీవు

సంతసమైన భక్తి చంద్రోదయమునకు
రంతులఁ జెలఁగు సముద్రమవు నీవు
చెంతల శ్రీవేంకటేశ జీవుఁడనే మేడలోన
అంతర్యామివి నీవు అంకెల జూడఁగను 


No comments:

Post a Comment