Saturday, November 19, 2022

ఆతఁడేపో మాయేలిక - Atadepo Mayelika

ఆతఁడేపో మాయేలిక ఆతఁడే జగన్మూల-
మాతఁడే శ్రీవేంకటాద్రి యందు మీఁది దైవము

కమలవాసినియైనకాంతఁ బెండ్లాడినాఁ(నవాఁ)డు
కమలములో బిడ్డఁ గన్నవాఁడు
కమలాప్తునిలోనఁ గలిగి మెరయువాఁడు
కమలనాభుఁడేపో కలుగు మాదైవము

జలధి బంధించి లంక సంహరించినవాఁడు
జలధిచొచ్చినదైత్యుఁజంపినవాఁడు
జలధిసుతునకు వరుస బావైనవాఁడు
జలధి శయనుఁడేపో చక్కని మాదైవము

కొండ గొడుగుగనెత్తి గోవులఁగాచినవాఁడు
కొండవంటి రాకాసిఁ గొట్టినవాఁడు
కొండలకు నెక్కుడైన గురుతు శ్రీవేంకటాద్రి-
కొండరూపు దానేపో కోరిన మాదైవము 

No comments:

Post a Comment