Saturday, November 19, 2022

ఎక్కడి మానుషజన్మం - Ekkadi Manusha Janmam

ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తిం బిఁకనూ

మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము
మఱవను యింద్రియభోగము మాధవ నీ మాయా
మఱచెద సుజ్ఞానంబును మఱచెద తత్వరహస్యము
మఱచెద నురువును దైవము మాధవ నీ మాయా

విడువనుఁ బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుఁడ నీ మాయా
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుఁడ నీ మాయా

తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల
తగులను మోక్షపుమార్గము తలఁపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయా 

No comments:

Post a Comment