Sunday, June 23, 2024

నీ వేల వత్తువయ్య - Nivela Vattuvayya

నీ వేల వత్తువయ్య నెలఁతఁ బాసి
మావంటివారు నీకు మనసయ్యేరా

ఇప్పటికి మాతోడ యిచ్చక మాడేవు గాక
తప్పరాని బాస నీవు దాఁటఁ గలవా
అప్పసమై తలఁపెల్లా ఆపెకుఁ గుదువవెట్టి
దెప్పరమై మావెంటఁ దిరుగ నోపుదువా

నిక్కమువంటి మాఁటలే నెరపేవు గాక నీవు
వొక్కమనసై యీడ నుండఁ గలవా
అక్కజపు నీమేను ఆపెకు మీదిచ్చి
యిక్కడ మాతొంటిపొందు యితవయ్యీనా

ముచ్చట సేసుక మాతో మొగమోడే వింతే పక్క
మచ్చికయాపె కాఁగిలి మాన గలవా
కచ్చుపెట్టి నన్ను శ్రీవేంకటనాథ కూడితివి
యెచ్చరిక నిట్టె మాయింటికి రాఁగలవా

Watch for audio - https://youtu.be/sC7X7OX7UGE 

నెలమూఁడు శోభనాలు - Nelamudu Shobhanalu

నెలమూఁడు శోభనాలు నీకు నతనికిఁ దగు
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా

రామనామమతనిది రామవు నీవైతేను
చామన వర్నమతఁడు చామవు నీవు
వామనుఁడందురతని వామనయనవు నీవు
ప్రేమపు మీ యిద్దరికి పేరుబలమొకటే

హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు
కరిఁ గాచెఁ దాను నీవు కరియానవు
సరిఁ దా జలధిశాయి జలధికన్యవు నీవు
బెరసి మీ యిద్దరికిఁ బేరుబలమొకటే

జలజనాభుఁడతఁడు జలజముఖివి నీవు
అలమేలుమంగవు నిన్నలమెఁ దాను
ఇలలో శ్రీ వేంకటేశుఁడిటు నిన్నురాన మోచె
పిలిచి పేరుచెప్పెఁ బేరుబలమొకటే 

Watch for audio - https://youtu.be/lNtBbN5Dm5s 

హరినే యడుగరో - Harine Adugaro

హరినే యడుగరో ఆమాఁట
సరుగ నిందరికి సర్వేశ్వరుఁడు

కామముఁ గ్రోధము కాయపు గుణములు
నేమపుటాత్మకు నిందేది
గామిడి మాయే కర్త యిందుకును
సోమరి మమ్మంటఁ జోటేది

పాపముఁ బుణ్యము భావవికారము
పైపై నాత్మకుఁ బనిలేదు
శ్రీపతి పంపిటు సేసితి మింతే
తాప మమ్ముఁ దగులఁ దగవేది

కాయముఁ బ్రాయము కర్మపు గుణములు
సేయని యాత్మకు సెలవేది
యేయెడ శ్రీవేంకటేశునాజ్ఞలివి
చాయల నితనికి శరణంటిమి

Watch for audio - https://youtu.be/DomJGR5TIPU 

వచ్చెను అలమేలుమంగ - Vaccenu Alamelumanga

వచ్చెను అలమేలుమంగ ఈ
పచ్చల కడియాల పణతి చెలంగ

బంగారు చేదివిటీలు పూని
శృంగారవతులు వేవేలురాగా
రంగైన వింజారమరలు వీవ
మాంగల్యలీల సొంపగు జవరాలు

పలుకుల తేనియ లొలుక చెంత
చిలుకలు కలకల పలుక రవల
గిలుకు పావలు ముద్దుగులుక మేటి
కలికి చూపుల మొనలు తళుకని చిలక

రంభాది సతులెల్ల చేరి యెదుట
గంభీర గతులను మీర నటనా
రంభములను మేలుకోరి కొలువ
అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి

Watch for audio - https://youtu.be/uK0ZNlrAVII 

పరమాత్ముఁడు సర్వపరిపూర్ణుఁడు - Paramatmudu Sarvaparipurnudu

పరమాత్ముఁడు సర్వపరిపూర్ణుఁడు
సురలకు నరులకు చోటయి యున్నాఁడు

కన్నులఁ గంటానే కడు మాటలాడుతానే
తన్నుఁగానివానివలె దాఁగియున్నాఁడు
అన్నియు వింటానే అట్టే వాసన గొంటానే
వన్నెలనూనె కుంచమువలె నున్నాడు

తనువులు మోచియు తలఁపులు దెలిసియు
యెనసియు నెనయక యిట్లున్నాఁడు
చెనకి మాయకు మాయై జీవునికి జీవమై
మొనసి పూసలదారమువలె నున్నాఁడు

వేవేలు విధములై విశ్వమెల్లా నొకటై
పూవులు వాసనవలె బొంచియున్నాఁడు
భావించనిరాకారమై పట్టితే సాకారమై
శ్రీవేంకటాద్రిమీఁద శ్రీపతై యున్నాఁడు 

Watch for audio - https://youtu.be/2Vg5iB5zrVc 

నారాయణా వాసుదేవ - Narayana Vasudeva

నారాయణా వాసుదేవ నగధర నారసింహ
శ్రీరామ పూర్ణకామ శ్రీకృష్ణ పవ్వళింపు

కరివర కరుణాకర కమలాక్ష గరుడేశ
మరువంపు  శయ్యమీద మన్నారు పవ్వళింపు

కాకుత్స కులనాధ కావేరీరంగనాధ
పాకశాసన వినుత పరమాత్మ పవ్వళింపు

గోపికాదధిచోర గోవర్ధనోద్ధార
పాపసంఘవిదార భయహర పవ్వళింపు

కమలసంభవనుత కరిరాజవరద శౌరి
విమల కస్తూరిరంగ వేడ్కతోబవ్వళింపు

వేదాంతశృతిసార విశ్వరూపవిహార
మాధవీకుసుమహార మాధవ పవ్వళింపు

విదురు నింటికిబోయి విందారగించితివి
నిదుర పోవయ్యా కృష్ణ నిర్మల పవ్వళింపు

పరమేశ పరమపురుష పరిపూర్ణభక్తరక్ష
విరుల పానుపుమీద శ్రీవేంకటేశ పవ్వళింపు 

Watch for audio - https://youtu.be/rVFTOqh0Uuw 

సకలలోక నాధుడు - Sakalaloka Nadhudu

సకలలోకనాధుడు జనార్థునుఁ డితఁడు  
శుకయొగివంద్యునిసుజ్ఞాన మెంత  

మరునితండ్రికిని మఱి  చక్కదనమెంత  
సిరిమగనిభాగ్యము చెప్ప నెంత
పురుషోత్తముఘనత పొగడఁగ నిఁక నెంత  
గరిమ జలధిశాయి గంభీర మెంత  

వేవేలు ముఖాలవానివిగ్రహము  చెప్ప నెంత 
భూవల్లభునివోరుపు పోలించ నెంత 
వావిరి  బ్రహ్మతండ్రికి  వర్ణింప  రాజస మెంత 
యేవల్ల  జక్రాయుధుని కెదురెంచ నెంత   

అమితవరదునకు ఔదర్యగుణ మెంత
విమతాసురవై రివిక్రమ మెంత 
మమతల నలమేలుమంగపతిసొబ గెంత
అమర శ్రీవేంకటేశుఆధిక్య మెంత  


Watch for audio - https://youtu.be/I-zNGT-Y_QY 

సిగ్గరి పెండ్లికొడుకుఁ - Siggari Pendli Koduku

సిగ్గరి పెండ్లికొడుకుఁ జేరి చూతము
వొగ్గి సదమదము లై వున్నాఁ డటా

వద్ది కిట్టె రమ్మనరే వచ్చీనో రాఁడో
గద్దరి తన లాగులు కందము నేఁడు
బద్దులో నిజమో కాని పచ్చివెచ్చిచేఁతల
వొద్దికతో బండుబం డై వున్నాఁ డటా

మాట మాట దియ్యరే మన సెట్లున్నదో
గాఁటపు తన విద్యలు కందము నేఁడు
చీటకపుచెమ టట చిట్లుగందా లట
మేటిదొరఁ బిలువరే మెరసీ నటా

ముసుఁగు దెరవరే మొకము చూతము నేఁడు
కసుగాటు చేఁత లెల్లఁ గందము గాని
పసతో శ్రీవేంకటపతి నన్ను నిటు గూడె
నస చేసి నాతోనె నవ్వీ నటా  


Watch for audio - https://youtu.be/yWvtJhvEU5Y 

అంతరంగమెల్లా శ్రీహరి - Antarangamella Srihari

అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే
వింతవింతవిధముల వీడునా బంధములు

మనుజుఁడై ఫలమేది మఱి జ్ఞానియౌదాఁక
తనువెత్తి ఫలమేది దయగలుగుదాఁక
ధనికుఁడై ఫలమేది ధర్మము సేయుదాఁకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము

చదివియు ఫలమేది శాంతముగలుగుదాఁకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాఁకను
మదిగల్గి ఫలమేది మాధవుఁ దలఁచుదాఁకా
యెదుట తారాజై తే నేలెనా పరము

పావనుఁడై ఫలమేది భక్తిగలిగినదాఁకా
జీవించేటిఫలమేది చింతదీరుదాఁకను
వేవేల ఫలమేది శ్రీవేంకటేశుఁ గన్నదాఁకా
భావించి తా దేవుఁడై తేఁ బ్రత్యక్షమవునా


Watch for audio - https://youtu.be/xw7A9R9sPNA 

వీణ వాయించెనే - Veena Vayeeinchane

వీణ వాయించెనే అలమేలుమంగమ్మ
వేణుగాన విలోలుడైన వేంకటేశునోద్ద ||

కురులు మెల్లన జారగా
సన్నజాజివిరులూ జల్లన రాలగా
కరకంకణంబులు ఘల్లని మ్రోయగ
మరువైన వజ్రాల మెరుగుతులాడగా ||

సందిటి దండలు కదలగాను
ఆణిముత్యాల సరులు వుయ్యాలలూగగాను
అందమై పాలిండ్లను అలదిన కుంకుమ
గంధము చెమటచే కరగే ఘుమఘుమమనగా ||

ఘననయనములూ మెరయగా
వింతరాగమును ముద్దులు కులుకగా
ఘననిభవేని జంత్రగాత్రము మెరయగ
వినెడి శ్రీవేంకటేశుల వీనులవిందుగా ||

Watch for audio - https://youtu.be/yKJW3w9bngw 

Saturday, June 15, 2024

నమో నమో దశరధనందన - Namo Namo Dasharadhanandana

నమో నమో దశరధనందన రామ
కమనియ్య యాగభాగకర్త రామ

కాకుత్థ్సకుల రామ కౌసల్యాసుత రామ
శ్రీకరగుణోన్నత శ్రీరామ
కాకాసురవైరి రామ కౌశికవత్సల రామ
భీకరతాటకాంతకబిరుద రామ

వారిధిబంధన రామ వాలిహరణ రామ
చారుహరకోదండభంజన రామ
ధారుణీజపతి రామదశకంఠహర రామ
సారవిభీషణాభీషేచన రామ

అమరపాలిత రామ అయోధ్యాపతి రామ
సమరకోవిద రామ సర్వజ్ఞ రామ
విమల రామ శ్రీవేంకటగిరి రామ
రమణ శరణాగతరక్షక రామ 


Watch for audio - https://youtu.be/Za3JNA1NoGk

గోవింద నీవన్నిటిలోఁ - Govinda Nivannitilo

గోవింద నీవన్నిటిలోఁ గూడితేఁ జాలుఁగాని
యీవల సంసారమైన యిది ధ్రువపట్టమే

తలఁపు లోపల నీవు దగ్గరితేనే చాలు
కలలోని కాపుఁరముఁ గైవల్యమే
బెళకు నాలుకకు నీపేరు వచ్చితేఁజాలు
పలికిన వన్నియు పరమవేదములే

తొడరి నీపూజ చేత దొరకితేనే చాలు
పడుచుల బొమ్మరిండ్లు బ్రహ్మలోకమే
కడలేని నీభక్తి గలిగితేనే చాలు
కడజన్మమయినా నిక్కపు విప్రకులమే

కాయముపై నీముద్ర గానవచ్చితేనే చాలు
పాయపు రతిసుఖము పరతత్వమే
యేయెడ శ్రీవేంకటేశ యిటు నీకే శరణంటి
పోయిన నా పాపమెల్లాఁ బుణ్యకర్మమే 


Watch for audio on - https://youtu.be/qT43U5KLYBg 

అతని నమ్మలే రల్పమతులు - Atani Nammale Ralpamatulu

అతని నమ్మలే రల్పమతులు భువి
నతఁ డాద్యుఁడు పరమాత్ముఁడు

సకలలోకపతి సర్వేశ్వరుఁడట
వొకఁడిఁక దొర మరి వున్నాఁడా
ప్రకటించఁగ శ్రీపతియే దాతట
వెకలి నియ్యఁగొన వేరే కలరా

దివిజవందితుఁడు దిక్కుల హరియట
యివల మొక్క సురలిఁక వేరీ
కవ నంతర్యామి కరుణాకరుఁడట
వివిధభంగులను వెదకఁగనేలా

వేదాంగుఁడు శ్రీవేంకటపతి యట
ఆదిమతము లిఁక నరసేదా
యేదెస నెవ్వరి కెప్పుడుఁ గలఁ డితఁ-
డీదేవుఁడె మన కిహపర మొసఁగ 


పొద్దిఁకనెన్నఁడు వొడచునొ - Poddikanenadu Vodachuno

పొద్దిఁకనెన్నఁడు వొడచునొ పోయినచెలి రాదాయను
నిదుర గంటికిఁ దోఁపదు నిమిషంబొకయేఁడు

కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు
నున్నని యొయ్యారంబులు నొచ్చినచూపులును
విన్నఁదనంబుల మఱపులు వేడుకమీరిన యలపులు
సన్నపుఁజెమటలుఁ దలఁచిన ఝల్లనె నామనసు

ఆఁగినరెప్పల నీరును నగ్గలమగు పన్నీటను
దోఁగియుఁ దోఁగనిభావము దోఁచిన పయ్యెదయు
కాఁగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు
వేఁగిన చెలితాపమునకు వెన్నెల మండెడిని

దేవశిఖామణి తిరుమలదేవునిఁ దలఁచినఁ బాయక
భావించిన యీ కామిని భావములోపలను
ఆవిభుఁడే తానుండిఁక నాతఁడె తానెఱఁగఁగవలె
నీ వెలఁదికిఁ గల విరహంబేమని చెప్పుదము


ఇంతకంటే నే మున్నది - Intakante Nemunnadi

ఇంతకంటే నే మున్నది యెంత దలపోసినాను
చింతదీర నీసేవ సేయుటే కలది

ఉపకారముగ దేహమొసఁగితి విటు నాకు
ఉపమించి నేఁజేసే ప్రత్యుపకార మిఁక నేది
యెపుడూ నీధర్మమున నిటు నీరుణస్థుఁడనై
ప్రపన్నుఁడనై నేను బ్రదుకుటే కలది

వేవేగ వెఱ్ఱిని జేయక వివేకిఁ జేసితివి
యీవికి నే మారుకు మా రిచ్చే దెక్కడ నున్నది
యీవల నీకుఁ గీర్తిగా నిట్టే నీయాధీనుఁడనై
భావించి భయము లేక బ్రదుకుటే కలది

జడులలోఁ గూర్చక యాచార్యునిలోఁ (తోఁ) గూర్చితివి
నడపేటి నీసరవికి నాసరవి యేమున్నది
యెడయక శ్రీవేంకటేశ నీకు బంటనై
బడివాయ కిట్లా నే బ్రదుకుటే కలది


పాపమెరంగనిబ్రహ్మఁడు - PapaMerangani Brahmadu

పాపమెరంగనిబ్రాహ్మఁడు యెందుఁ
జూపరానిచోట చూపీనయ్యా

తనివోక జీవముతలకాయ నంజుడు
పనివడి తిని తిన్న బ్రాహ్మఁడు
యెనసి యెదిరిఁ దన్ను నెఱఁగక విభుఁడై
ఘనవంశము మంటఁ గలపీనయ్యా

యెవ్వారు నెఱఁగనియెముకలయింటిలో
పవ్వళింపుచునున్న బ్రాహ్మఁడు
జవ్వనమదమున జడిసేటికోమలిఁ
బువ్వులతోఁటలోఁ బొదిగీనయ్యా

చెలఁగి కన్నెరికము చెడనిపడుచుఁ దెచ్చి
పలువేదనలఁబెట్టే బ్రాహ్మఁడు,
తెలిసి వేంకటాధిపునిదాసుఁడై
పులుగు పంజారాన బొదిగీనయ్యా  


నీవుసేసిన బాసలు - Nivu Sesina Basalu

నీవుసేసిన బాసలు నీ వెరఁగవా
రేవగలు నెట్టు వేసరించేము నిన్నును

ఆడినప్పటి మాటలో నర్తము నీ వెరఁగవా
యీడకు వచ్చుండఁగాను యిం తెరఁగవా
వేడుక పడ్డవాఁడవు వెలయించ నెరఁగవా
తోడనెని న్నెందాఁక దూరేము నిన్నును

నవ్విననవ్వులలోని నయము నీ వెరఁగవా
రవ్వ సేసినఁవాఁడవు రా నెరఁగవా
జవ్వనపువాఁడ వాసలు నీ వెరఁగవా
రివ్వలుగ నెందాఁక రేచేము నిన్నుము

యిట్టె చూచినవాఁడవు యిచ్చక మెరఁగవా
జట్టి గొన్నవాఁడవు మెచ్చ నెరఁగవా
నెట్టన శ్రీవేంకటేశ నీవె నన్నుఁ గూడితివి
గుట్టుతోడ నెందాఁకా కొసరేము నిన్నును 


అన్నిచోట్లఁ పరమాత్మ - Annichotla Paramatma

అన్ని చోట్లఁ పరమాత్మ నీవు
యిన్నిరూపుల భ్రమయింతువుగా

పాలజలనిధినుండి బదరీవనాన నుండి
ఆలయమై గయలోఁ బ్రయాగ నుండి
భూలోకనిధివై పురుషోత్తమాన నుండి
వేలసంఖ్యలరూపై విచ్చేతుగా

వుత్తర మధురలో నయోధ్యలోపల నుండి
సత్తైన నందవ్రజాన నుండి
చిత్తగించి పంచవటి సింహాద్రిలోన నుండి
వత్తుగా లోకములు పావనము సేయఁగను

కైవల్యమున నుండి కమలజలోకాన
మోవఁగ శ్రీరంగమున నుండి
యీవల నావల నుండి యీవేంకటాద్రిపై
నీవే నీవే వచ్చి నెలకొంటిగా


తలలేదు తోఁకలేదు దైవమా - Tala Ledu Toka Ledu Daivama

తల లేదు తోఁక లేదు దైవమానమాయలకు
తెలిసియుఁ దెలియక తిరిగేము నేము

తను వేఁటిదో యీ తలపోఁత లేఁటివో
యెనయు సంసార సుఖ మిది యేఁటిదో
వెనక ముందేఁటిదో వివేక మెరఁగక
దినదినమును నేమో తిరిగేము నేము

పుట్టు గిది యెక్కడో పోయేటి దెక్కడో
ఇట్టె యీ సిరులెల్లా నెక్కడెక్కడో
మట్టులేని హరి నిర్మాణ చక్రములోన
దిట్టలమై యేమేమో తిరిగేము నేము

నేరు పేదో నేర మేదో నిలిచిన దొకటేదో
వూరకే నీ దాసులమై వున్నారము
చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర
గారవించి కరుణించి కావఁగదవే 

అల్లనాఁడే యిదెరఁగ - Allanade Ideraga

అల్లనాఁడే యిదెరఁగ మైతిమిగాని
యిల్లిదె దేవుని కృప యీడ నున్నది సుండి

చేరువవో మోక్షము శ్రీహరిభక్తికిని
ధారుణిఁ గర్మమునకే దవ్వుగాని
యీరీతి నింద్రియముల నించుకంతే దాఁటిన
దూరముగాదు జ్ఞానపుతోవ వున్నది సుండి

ధరఁ జేతిది వైకుంఠ మతనిదాస్యమునకు
పరధర్మముల కగపడదుగాని
అరుదైన యాసల ఆయము వొడిచితేనే
అరసి యాకంతగుండా నందవచ్చుఁ జుండి

తలఁపులో దక్కె ముక్తి తగు శరణాగతికి
శిలుగుఁ బుణ్యములకుఁ జిక్కదుగాని
తెలిసి శ్రీవేంకటేశు తిరుమంత్రము నాలికెఁ
బలికినాడనే దివ్యపద మబ్బుఁ జుండి


నారాయణనే నస్వతంత్రుఁడను - NarayanaNe Naswatantrudanu

నారాయణ నే నస్వతంత్రుఁడను నాకా పనిగా దేవియును
ధారుణి లోపలఁ బుట్టించితివి తరువాతి పనులు నీకే సెలవు

శ్రీపతి నీకే సమర్పితంబై శేషంబైనది యాతుమ దొల్లే
యేపున విషయములందులోఁ దగిలి యేమయిన నీకే సెలవు
చూపరఁ బసురము తొరలు వోయినను సొమ్ముగలుగువాఁడే పరవంజుక
పైపైఁ దానే వెదకి తెచ్చి కాపాడఁగ నతనికి భారముగాన

యీడులేక శ్రీహరి నీవుండెడి యీ దేహపు నీపరికరమూఁ
బాడిగఁ బంచేంద్రియములు పట్టుక బడిఁ దిప్పెడి నీకే సెలవు
వోడక యధికులు తమ దాసులు మరివొకరిపంపు లటు సేయఁగను
చూడరు తమబలములనే విడిపించుక తామే రక్షింతురు గాని

శ్రీవేంకటపతి నీవే నన్నిటు సృష్టించిన జీవుఁడనింతే
కావిరి నజ్ఞానము నన్నిటువలెఁ గప్పిన నది నీకే సెలవు
ధావతిఁ దలిదండ్రులు తమ బిడ్డల తనువులఁ బంకము లంటినను
యేవిధముల నీరార్చి పెంతు రటు ఇన్నిట నీవే గతినాకు


ఇందిరయుఁ దానుఁ గూడి - Indirayu Danu gudi

ఇందిరయుఁ దానుఁ గూడి యిట్టె వరాలొసఁగుతా
సందడించి దిక్కులెల్లా సాధించీ నిదివో

వేదములే గుఱ్ఱములు విష్ణుని రథమునకు
వాదపు శాస్త్రములే తీవ్రపుఁ బగ్గాలు
పాదగు పంచభూతాలే పరగు బండికండ్లు
ఆదిగొని మనోవీధులందు నేఁగీ నిదివో

జీవులెల్లా సారథులు శ్రీవిభుని తేరునకు
కావించుఁ నెజ్ఞాలు పడిగల గుంపులు
భావించఁ దన ప్రకృతి పట్టపుసింహాసనము
వేవేలు సంపదలతో వెలసీ నేఁడిదివో

చందురుఁడు రవియును సరుస బైఁడికుండలు
చెందిన పుణ్యములెల్ల సింగారాలు
అందపు శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ దాను
కందువల మెరయుచు కరుణించీ నిదివో


కొత్తపెండ్లికూఁతురవు - Kotta Pendli Kuturavu

కొత్తపెండ్లికూఁతురవు కోమలివి కడుఁగడు
పొత్తులకు రమ్మంటేను బులియఁగఁ దగునా

అలరి పతికి నిచ్చలాడనేవలెఁ గాక
చలపాదితనమేల జవరాలికి
పిలిచినప్పుడే వచ్చి పెనఁగఁగవలెఁ గాక
నిలువున గుట్టుతోడ నీటు చూపఁ దగునా 

మగనికి వేడుకతో మనసియ్యవలెఁ గాక
జిగురుమంకులవేల చెలియకును
నగినప్పుడే మరి ననుపుఁ గావలెఁ గాక
యెగసక్కెములకును యింత సేయఁ దగునా

శ్రీవేంకటేశు నిట్టే చేరి కూడవలెఁ గాక
కావిరి పంతములేల దేవులకును
యీవేళ నేలె నితఁడు యిది మెచ్చవలెఁ గాక
కోవరముగా నింకాఁ గొసరఁగఁ దగునా