Sunday, June 23, 2024

పరమాత్ముఁడు సర్వపరిపూర్ణుఁడు - Paramatmudu Sarvaparipurnudu

పరమాత్ముఁడు సర్వపరిపూర్ణుఁడు
సురలకు నరులకు చోటయి యున్నాఁడు

కన్నులఁ గంటానే కడు మాటలాడుతానే
తన్నుఁగానివానివలె దాఁగియున్నాఁడు
అన్నియు వింటానే అట్టే వాసన గొంటానే
వన్నెలనూనె కుంచమువలె నున్నాడు

తనువులు మోచియు తలఁపులు దెలిసియు
యెనసియు నెనయక యిట్లున్నాఁడు
చెనకి మాయకు మాయై జీవునికి జీవమై
మొనసి పూసలదారమువలె నున్నాఁడు

వేవేలు విధములై విశ్వమెల్లా నొకటై
పూవులు వాసనవలె బొంచియున్నాఁడు
భావించనిరాకారమై పట్టితే సాకారమై
శ్రీవేంకటాద్రిమీఁద శ్రీపతై యున్నాఁడు 

Watch for audio - https://youtu.be/2Vg5iB5zrVc 

No comments:

Post a Comment