Saturday, June 15, 2024

అల్లనాఁడే యిదెరఁగ - Allanade Ideraga

అల్లనాఁడే యిదెరఁగ మైతిమిగాని
యిల్లిదె దేవుని కృప యీడ నున్నది సుండి

చేరువవో మోక్షము శ్రీహరిభక్తికిని
ధారుణిఁ గర్మమునకే దవ్వుగాని
యీరీతి నింద్రియముల నించుకంతే దాఁటిన
దూరముగాదు జ్ఞానపుతోవ వున్నది సుండి

ధరఁ జేతిది వైకుంఠ మతనిదాస్యమునకు
పరధర్మముల కగపడదుగాని
అరుదైన యాసల ఆయము వొడిచితేనే
అరసి యాకంతగుండా నందవచ్చుఁ జుండి

తలఁపులో దక్కె ముక్తి తగు శరణాగతికి
శిలుగుఁ బుణ్యములకుఁ జిక్కదుగాని
తెలిసి శ్రీవేంకటేశు తిరుమంత్రము నాలికెఁ
బలికినాడనే దివ్యపద మబ్బుఁ జుండి


No comments:

Post a Comment