Saturday, August 24, 2024

ఐనదేది కాని దందులో నేది - Inadedi Kanidandulo Nedi

ఐన దేది కాని దందులో నేది
నానారూపి శ్రీనాథుఁడె కాకా

యెవ్వరి దూషించే మెవ్వరి భూషించే
మెవ్వరు స్వతంత్రు లిందులో
అవ్వల నివ్వల నంతరాత్ముఁడైన
యవ్వనజాక్షుని ననుట గాకా

యెందుకుఁ గోపించే మెందుకు మెచ్చే
మెందుఁ గద్దు మే లిందులో
అందు నిందుఁ దానె యల్లుకొన్న
నందనందనునే నమ్ముట గాకా

యేచోటు మంచిది యేచోటు చెడ్డది
యేచోటు సతమౌ నిందులో
కాచేటి శ్రీవేంకటనాథుఁడె
చేచేతఁ గాణాచై చెల్లించెఁ గాకా 

భావ వివరణ:
ఈ సృష్టిలో అనేకానేక రూపాలున్నాయి. ఆ రూపాలలో అనేకానేక జీవులున్నాయి. దేని విశిష్ఠత దానికుంది. ఇవన్నీ తమ మనుగడ కొనసాగించటానికి కారణమేమిటి? నానారూపాలలో వాటిలో వున్న శ్రీనాథుడే. ఇందులో ఆయన అయినదేది? కానిదేది? అన్నీ... ఆ శ్రీనాథుడే.
మనచుట్టూ వుండే శత్రువుల్లోనూ మిత్రులలోనూ ఆయనేవున్నాడు. వారి అంతరాత్ముడైవున్నది కూడా ఆ శ్రీహరియే. అవ్వల (దివిలోని దేవతలలోను) ఇవ్వల భువిలోని జీవులలోనూ ఆయనేవున్నాడు. ఇక నేను ఎవ్వరిని దూసించేది (తిట్టేది) ఎవరిని భూషింతు (పొగిడేది?) అన్నీ ఆ వనజాక్షుడే (పద్మలోచనుడే) అని కీర్తించుట తప్ప ఇంకా యేమిచేయాలి?
మన పురాకృత కర్మలకి ఫలితం, దానంతట అది రాదు. ఇంకొకరి ద్వారా ఆ ఫలితం మనకు సంక్రమిస్తుంది. అదే ఆ జగన్నాథుడిమాయ. అందువలననే కొందరు మనకు మేలు చేస్తారు మరి కొందరు కీడు చేస్తారు. ఇందులో అందరూ నందనందనుడైన గోవిందుడే. మరి మనం కొందరిని కోపిస్తామెందుకు? కొందరిని మెచ్చుకొంటామెందుకు ? ఇందులో మేలు దేంట్లో కద్దు (వున్నది)... దేంట్లో లేదు? మరి అందు నిందు (వారిలోనూ వీరిలోనూ) తానే అల్లుకొని (వ్యాపించి వున్నప్పుడు) ఆయనను తప్పించి ఇంకెవర్ని నమ్మగలను?
మన కర్మలననుసరించే మనకు సుఖదు:ఖాలు కలుగుతాయి. వాటిలో కొన్నిటిని భూమిమీదా కొన్నిటిని పరలోకాల్లోనూ (స్వర్గ నరలోకాలలో) అనుభవిస్తాం. ఈలోకంలో అనుభవించే మంచిని “అయినవారితోనూ” చెడుని “కానివారితోనూ” అనుభవిస్తాం. అనుభవించాక, క్షణం కూడా అక్కడా. | వుండము ఇక్కడా వుండము. ఏచోటూ సతమైనది (శాశ్వతమైనది) కాదు. మనల నందరిని కాచేటి (సంరక్షించే) శ్రీవేంకటేశ్వరుడే, చేచేత కాణాచి (ఈమాటకు సరితూగే మాట... (అరచేతిలో చింతామణి), ఆయనే అరచేతిలో మాణిక్యమై అన్నీ చెల్లిస్తుంటే ఇంకా చెడేమిటి? మంచేమిటి చెప్పండి.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు) 

Watch for audio - https://youtu.be/gvVoiRM5E_8 

ఎఱిఁగించవలయు - Eriginchavalayu

ఎఱిఁగించవలయు నిప్పుడిపుడే నీ-
కఱకఱి నిన్నియుఁ గసరకుమీ

చెలి నీపతిపై చిందులపాటలు
పలుమఱు నీలోఁ బాడఁగను
అలులివి విని తానటుఁ దమపిల్లల
పిలుపని మూఁగిన బెదరకుమీ

అందపునడపుల నటునీపలికెదు-
రిందువదన నీవేఁగఁగను
కందువనంచలు గతియిది దమదని
సందడిసేసిన జడియకుమీ

వోడక శ్రీవేంకటోత్తముకాఁగిట
మేడెపుఁగుచములు మెరయఁగను
యీడను జక్కవలివి తమజాతని
జోడుగవాలినజోఁపకుమీ 


Watch for audio - https://youtu.be/s7g6m1pKB4w 

శ్రీపతియె రక్షించుఁ గాక - Sripathiye Rakshinchugaka

శ్రీపతియె రక్షించుఁ గాక మరి
యేపున జంతువుల మే మెఱుఁగుదుము

జలధుల లోఁతును సరి భువి వేఁగును
అలరించిన శ్రీహరి యెఱుఁగు
పొలసిన జ్ఞానము పుణ్యపాపములు
యిలపై జీవుల మే మెఱుఁగుదుము

అనలము తేజము నాకసము విరివి
అనిశము నారాయణుఁ డెఱుఁగు
మునుకొన్న కాలము మొదలి జన్మములు
యెనయఁగఁ బ్రాణుల మే మెఱుఁగుదుము

విసరే గాలియు విశ్వములోపలి
పస శ్రీ వేంకటపతి యెఱుఁగు
సుసరివై శరణము చొచ్చుట యతనికి
యెసఁగిన దేహుల మే మెఱుఁగుదుము 


Watch for audio - https://youtu.be/sfdNZRCFJKQ 

పడఁతి నినుఁదలచి - Padati Ninu Dalachi

పడఁతి నినుఁదలచి పో పలుకఁడతఁడు, నీ-
వెడసినను బ్రాణంబులెరవులాతనికి

వెదచల్లు నీ మోమువెన్నెలలఁ దలఁచిపో
పొదలు వెన్నెలబయటఁ బొలయఁడతఁడు
ముదిత నీ నెరులు దురుమును దలఁచిపో యతఁడు
కొదమతేంట్ల (టుల) గనిన గుండె జల్లనును

లలితాంగి నీ దేహలత దలఁచి పో యిపుడు
చెలఁగి వనమునకు విచ్చేయఁడతఁడు
వెలఁది నీమోవికావిరి దలఁచి పో యతఁడు
తలిరాకు గని గుండె తల్లడంబౌను

కోమలిరో నీ యిట్ల కూటములు దలఁచిపో
ప్రేమమితరములపైఁ బెట్టఁడతఁడు
దీమసపు వేంకటాధిపుఁడుగన యాతనికి
సామాన్యసరసతలు సరుకుగావరయ 


Watch for audio - https://youtu.be/fS898wYk-ZA 

విశ్వరూప మిదివో - Viswarupamidivo

విశ్వరూప మిదివో విష్ణురూప మిదివో
శాశ్వతులమైతి మింక జయము మా జన్మము

కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనములు
మెండుగఁ బ్రత్యక్షమాయ మేలువో నా జన్మము

మేడవంటి హరిరూపు మించైన పైఁడి గోపుర-
మాడనే వాలినపక్షు లమరులు
వాడలఁ గోనేటిచుట్ల వైకుంఠనగరము
యీడ మాకుఁ బొడచూపె ఇహమేపో పరము

కోటి మదనులవంటి గుడిలో చక్కనిమూర్తి
యీటులేని శ్రీవేంకటేశుఁడితఁడు
వాఁటపు సొమ్ములు ముద్రవక్షపుటలమేల్మంగ
కూటువై నన్నేలితి యెక్కువవో నాతపము 


Watch for audio - https://youtu.be/P8vDBxGpX34

ఏ లోకమున లేఁడు - Ye Lokamuna Ledu

ఏ లోకమున లేఁడు యింతటి దైవము మరి
జోలిఁ దవ్వితవ్వి యెంత సోదించినాను

మంచిరూపున నెంచితే మరునిగన్నతండ్రి
ఇంచుకంత సరిలేదు ఇతనికిని
మించుసంపదలనైతే మేటిలక్ష్మీకాంతుఁడు
పొంచి యీతనికి నీడు పురుఁడించఁగలరా

తగఁ బ్రతాపమునను దానవాంతకుఁ డితఁడు
తగుల నీతని మారుదైవాలు లేరు
పొగరుమగతనానఁ బురుషోత్తముఁ డితఁడు
వెగటై యీతనిపాటి వెదకిన లేరు

పట్టి మొదలెంచితేను బ్రహ్మఁ గన్నతండ్రితఁడు
మట్టున నింతటివారు మరి వేరి
ఇట్టే శ్రీవేంకటేశుఁడీగికి వరదుఁడు ట్ట
కొట్టఁగొన నితరుల గురిసేయఁగలరా 


Watch for audio - https://youtu.be/e_dbN76b3w0