Saturday, August 24, 2024

ఐనదేది కాని దందులో నేది - Inadedi Kanidandulo Nedi

ఐన దేది కాని దందులో నేది
నానారూపి శ్రీనాథుఁడె కాకా

యెవ్వరి దూషించే మెవ్వరి భూషించే
మెవ్వరు స్వతంత్రు లిందులో
అవ్వల నివ్వల నంతరాత్ముఁడైన
యవ్వనజాక్షుని ననుట గాకా

యెందుకుఁ గోపించే మెందుకు మెచ్చే
మెందుఁ గద్దు మే లిందులో
అందు నిందుఁ దానె యల్లుకొన్న
నందనందనునే నమ్ముట గాకా

యేచోటు మంచిది యేచోటు చెడ్డది
యేచోటు సతమౌ నిందులో
కాచేటి శ్రీవేంకటనాథుఁడె
చేచేతఁ గాణాచై చెల్లించెఁ గాకా 

భావ వివరణ:
ఈ సృష్టిలో అనేకానేక రూపాలున్నాయి. ఆ రూపాలలో అనేకానేక జీవులున్నాయి. దేని విశిష్ఠత దానికుంది. ఇవన్నీ తమ మనుగడ కొనసాగించటానికి కారణమేమిటి? నానారూపాలలో వాటిలో వున్న శ్రీనాథుడే. ఇందులో ఆయన అయినదేది? కానిదేది? అన్నీ... ఆ శ్రీనాథుడే.
మనచుట్టూ వుండే శత్రువుల్లోనూ మిత్రులలోనూ ఆయనేవున్నాడు. వారి అంతరాత్ముడైవున్నది కూడా ఆ శ్రీహరియే. అవ్వల (దివిలోని దేవతలలోను) ఇవ్వల భువిలోని జీవులలోనూ ఆయనేవున్నాడు. ఇక నేను ఎవ్వరిని దూసించేది (తిట్టేది) ఎవరిని భూషింతు (పొగిడేది?) అన్నీ ఆ వనజాక్షుడే (పద్మలోచనుడే) అని కీర్తించుట తప్ప ఇంకా యేమిచేయాలి?
మన పురాకృత కర్మలకి ఫలితం, దానంతట అది రాదు. ఇంకొకరి ద్వారా ఆ ఫలితం మనకు సంక్రమిస్తుంది. అదే ఆ జగన్నాథుడిమాయ. అందువలననే కొందరు మనకు మేలు చేస్తారు మరి కొందరు కీడు చేస్తారు. ఇందులో అందరూ నందనందనుడైన గోవిందుడే. మరి మనం కొందరిని కోపిస్తామెందుకు? కొందరిని మెచ్చుకొంటామెందుకు ? ఇందులో మేలు దేంట్లో కద్దు (వున్నది)... దేంట్లో లేదు? మరి అందు నిందు (వారిలోనూ వీరిలోనూ) తానే అల్లుకొని (వ్యాపించి వున్నప్పుడు) ఆయనను తప్పించి ఇంకెవర్ని నమ్మగలను?
మన కర్మలననుసరించే మనకు సుఖదు:ఖాలు కలుగుతాయి. వాటిలో కొన్నిటిని భూమిమీదా కొన్నిటిని పరలోకాల్లోనూ (స్వర్గ నరలోకాలలో) అనుభవిస్తాం. ఈలోకంలో అనుభవించే మంచిని “అయినవారితోనూ” చెడుని “కానివారితోనూ” అనుభవిస్తాం. అనుభవించాక, క్షణం కూడా అక్కడా. | వుండము ఇక్కడా వుండము. ఏచోటూ సతమైనది (శాశ్వతమైనది) కాదు. మనల నందరిని కాచేటి (సంరక్షించే) శ్రీవేంకటేశ్వరుడే, చేచేత కాణాచి (ఈమాటకు సరితూగే మాట... (అరచేతిలో చింతామణి), ఆయనే అరచేతిలో మాణిక్యమై అన్నీ చెల్లిస్తుంటే ఇంకా చెడేమిటి? మంచేమిటి చెప్పండి.
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు) 

Watch for audio - https://youtu.be/gvVoiRM5E_8 

No comments:

Post a Comment