Sunday, April 21, 2024

పుట్టించేవాఁడవు నీవే - అన్నమయ్య సంకీర్తన (Puttinche Vadavu Nive - Annamayya Sankeerthana)

పుట్టించేవాఁడవు నీవే పోరులు వెట్టేవు నీవే
యెట్టు నేరుచుకొంటివిది నీ వినోదమా

కొందరు దేవతలును కొందరు రాక్షసులును
ఇందరి కంతర్యామి వెప్పుడు నీవు
అంది కోప మొకరిపై అట్టే ప్రసాద మొకరి -
కిందులోనే పక్షపాతమిది నీకే తగును

నరకమనుచుఁ గొంత నగి స్వర్గమని కొంత
నిరతి గురిసేసేవు నీకుక్షిలోనే
ధరఁ జీఁకటొకవంక తగ వెన్నెలొకవంక
నెరపేవు నీ మాయ నీకే తెలుసును

దాసపరిపాలనము తగు దుష్టశిక్షణము
వాసిఁ గైకొంటివి నీకు వశమై రెండు
దోసము నీవల్ల లేదు తొలుతే శ్రీవేంకటేశ
సేసినవారి పుణ్యమే చిత్తానఁ బెట్టితివి


పొద్దొకచాయలవాఁడు - Poddoka Chayalavadu

పొద్దొకచాయలవాఁడు పురుషోత్తముఁ డితఁడు
కొద్దిలేని మెఱుఁగులే కుప్పయైన ట్టాయనూ

చక్కని దేవుఁ డదే జలకములాడఁ గాను
వెక్కసపు తిరుమేన వెల్లులాయను
చొక్కపు గోపికలెల్లాఁ జూచినతేటలమాపు
తక్కక యీతనిమేన దైవారినట్టాయను

కప్పురకాపుమేనఁ గడు నిండా మెత్తుకోఁగా
నెప్పున వెన్నెలవన్నె నిండుకొనెను
అప్పటి బదారువేలు అందరును నవ్వఁగాను
ముప్పిరి నీతని మేన ముంచినయట్టాయను

చెలఁగి పుళుగుకాపు శ్రీవేంకటేశుఁడు వూసి
పలురత్నాలసొమ్ములఁ బరగీని
అలమేలుమంగకొప్పునందలినీల వర్ణము
యెలమిఁ దిరుమేనను యిరవైనట్టాయను 


నీకేల యీగుణము - Nikela Ee Gunamu

నీకేల యీగుణము నీ వేమి గట్టుకొంటివి
యీకడ లాలించితే మే మిటు నిన్ను గొలుతుము

మాటలకు లోఁగాని బ్రహ్మమనంటా దాఁచి దాఁచి
మాటాడకుండేవు సుమ్మీ మాతో నీవు
నీటున మనసులో నిలుపరానివాఁడనంటా
పాటించి మాకుఁ బొడచూపకుంటే గతి యేది

శ్రుతులకుఁ బట్టరాని చోద్యపుబ్రహ్మమనంటా
మతకానఁ జిక్కక మానేవుసుమ్మీ
పతివి నీ గంభీరము బయటఁబడీ నంటా
అతిగోప్యాన ని న్నది యెట్ఱెఱిఁగేము

మాయనన్నుకొనిన వుమ్మడిబ్రహ్మమనంటా
యేయడనైనా భ్రమయించేవు సుమ్మీ
పాయపు టలమేల్మంగపతివి శ్రీవేంకటేశ
యీయెడ నీశరణంటి మిన్నిటా మమ్మేలుమీ


నమో నమో దానవవినాశ - Namo Namo Danava Vinasha

నమో నమో దానవవినాశ చక్రమా
సమరవిజయమైన సర్వేశు చక్రమా

అట్టె పదారుభుజాల నమరిన చక్రమా
పట్టినఆయుధముల బలుచక్రమా
నెట్టన మూఁడుగన్నుల నిలిచిన చక్రమా
ఱట్టుగా మన్నించవే మెఱయుచు చక్రమా

ఆరయ నారుగోణాల నమరిన చక్రమా
ధారలు వేయిటితోడితగు చక్రమా
ఆరక మీఁదికి వెళ్లే అగ్నిశిఖల చక్రమా
గారవాన నీ దాసులఁ గావవే చక్రమా

రవిచంద్రకోటితేజరాసియైన చక్రమా
దివిజసేవితమైన దివ్య చక్రమా
తవిలి శ్రీవేంకటేశు దక్షిణకర చక్రమా
యివల నీదాసులము యేలుకోవే చక్రమా 


వత్తలూరికేశవా - అన్నమయ్య సంకీర్తన (Vattaluri Kesava - Annamayya Sankeerthana)

వత్తలూరికేశవా వన్నె లీడఁ జేసేవా
బత్తిగలవాఁడవౌదు పట్టకువయ్యా

పిల్లఁగోవి వింటిమి బిరుదులు గంటిమి
చల్లలమ్మఁ బోవలెఁ జాలునయ్యా
చెల్లు నీకుఁ జేఁతలు చెక్కులెల్ల రోఁతలు
పల్లదాలు యిఁకనేల పదవయ్యా

నిందలు వేసితివి నేరమీఁ జేసితివి
మందకునుఁ బోవలె మానవయ్యా
చిందె మోవిఁ దేనెలు సిగ్గులాయ మేనులు
ముందరి కట్టేకాని మొక్కకువయ్యా

చీర నీచేఁ జిక్కెను చిత్తమెల్లాఁ బొక్కెను
నీరుఁగొల నాడవలె నిలవయ్యా
యీరీతి శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
తేరీ పనులేమిగల్లా తెంకికి రావయ్యా


రెక్కలకొండవలె - Rekkala Kondavale

రెక్కలకొండవలె మీరిన బ్రహ్మాండమువలె
వెక్కసమైన తేరుపై వెలసీని దేవుఁడు

బిఱబిఱఁ దిరిగేటి పెనుబండికండ్లతో
గుఱుతైన పడగెల గుంపులతో
తఱితో ధరణి గ్రక్కదలఁ గదలెను తేరు
మెఱసీ వీధివీధుల మేఁటియైన దేవుఁడు

ధగధగమను నాయుధపు మెరుఁగులతోడ
జిగిమించుఁ బగ్గముల చేరులతో
పగటు రాకాసులపైఁ బారీనదె తేరు
నిగిడి నలుదిక్కుల నీటు చూపీ దేవుఁడు

ఘణఘణ మనియెడి గంటల రవముతోడ
ప్రణుతి నలమేల్మంగ పంతాలతోడ
రణములు గెలిచి మరలెనదే తిరుతేరు
గణుతికెక్కెను శ్రీవేంకటగిరిదేవుఁడు 


తెలిసినవారికి తేటాయె - Telisinavariki Tetaye

తెలిసినవారికి తేటాయె
తొలఁగక సిరితో తుద నొకటాయె

పరమబ్రహ్మము ప్రకృతియునుఁ గూడి
సరివితో మెలఁగ జగ మాయె
అరయఁగ నిరువది అయిదు తత్త్వముల
పెరుగుచు జీవుల భేదం బాయె

జీవులు దేవుఁడు సృష్టియునుఁ గూడి
కావించు కర్మపుగతు లాయె
దేవతల మునుల తెఱఁగుల నడకల
వేవేలు విధుల వేదం బాయె

క్రీడలు గాలము క్రియలుఁ జుట్టుగులు
కూడి మాయలకు గురు తాయె
యీడనే శ్రీ వేంకటేశ్వరు శరణము
జాడల నిహపరసాధన మాయె 


నీవే మాకు దిక్కు - Neeve Maku Dikku

నీవే మాకు దిక్కు నిన్నే తలఁతుము
కావు మా నేరమెంచక కరుణానిధీ

నెట్టన సూర్యులోని నెలకొన్న తేజమా
గట్టిగాఁ జంద్రునిలోని కాంతిపుంజమా
పుట్టిరక్షించే యజ్ఞపురుషుని ప్రకాశమా
వొట్టుక దేవతలలోనుండిన శక్తీ

సిరులుమించిన యట్టిజీవులలో ప్రాణమా
గరిమ వేదములలోఁ గల యర్థమా
పరమపదమునందుఁ బాదుకొన్న బ్రహ్మమా
చరాచరములలో సర్వాధారమా

జగములో వెలసేటిసంసారసుఖమా
నిగిడినమంత్రముల నిజమహిమా
మిగుల శ్రీవేంకటాద్రిమీఁదనున్నదైవమా
ముగురువేల్పులలోని మూలకందమా 


గందము పూసేవేలే - Gandamu Pusevele

గందము పూసేవేలే కమ్మని మేన యీ-
గందము నీమేనితావికంటె నెక్కుడా

అద్దము చూచేవేలే అప్పటప్పటికిని
అద్దము నీ మోముకంటె నపురూపమా
ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ-
గద్దరికన్నులకంటె కమలము ఘనమా

బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా
బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా
ఉంగరాలేఁటికినే వొడికిపువేళ్ళ
వెంగలిమణులు నీ వేలిగోరఁబోలునా

సవర మేఁటికినే జడియు నీ నెరులకు
సవరము నీకొప్పుసరి వచ్చీనా
యివలఁ జవులు నీకునేలే వేంకటపతి -
సవరని కెమ్మో విచవికంటేనా


Sunday, April 7, 2024

శ్రీహరి పాద తీర్ధమే - Sri Hari Paada Teerthame

శ్రీహరి పాద తీర్ధమే చెడని మందు
మోహపాశములు కోసి మోక్షమిచ్చే మందు 

కాయని పూయని మందు, కడు చల్ల చేసే మందు
కారని కంటగించని కమ్మని మందు
నూరని కాచని మేటి నునుపైన మందు
వేరువెల్లంకులు లేని వేరులేనీ మందు

గురుతైన రోగములను గుణముచేసేటి మందు
దురితములెల్ల బాపే దొడ్డైన మందు
నిరతము బ్రహ్మాదులు నిలిచి సేవించే మందు
నరకములేనట్టి నయమైన మందు

పొంకముతో గుణములన్ పొందజేసే మందు
మంకుబుద్ధి నెడబాపి మన్నించే మందు
పంకజాక్ష ప్రసన్న్ శ్రీవెంకటరాయని మందు
శంకలెల్ల పోగొట్టి సంరక్షించే మందు 


కొలువున్నాఁడదివో - Koluvunnadadivo

కొలువున్నాఁడదివో గోవిందరాజు
కొలఁదిలేనిసొమ్ముల గోవిందరాజు

గారవానఁ బాదములు కాంతలపైఁ బారఁజాఁచి
కూరిములు వెదచల్లీ గోవిందరాజు
దీరత సంకుఁజక్రాలతెల్లని కన్నులతోడ
కోరినవరము లిచ్చీ గోవిందరాజు

దట్టపుంగరాలవేళ్ల దాపలిచెయు వారఁజాఁచి
గుట్టుతో నూరకున్నాఁడు గోవిందరాజు
వొట్టుకొనె వలకేలు వున్నతిశిరసుకింద
కొట్టఁగొన నవ్వులతో గోవిందరాజు

చిప్పిలుతా నొత్తగిలె శేషునిపడగెనీడ
గొప్పకిరీటముతోడ గోవిందరాజు
అప్పుడే బొడ్డునఁ గనె నజుని శ్రీ వేంకటాద్రి-
కుప్పెకటారముతోడ గోవిందరాజు 


ఆరగించి కూచున్నాఁ - Araginchi Kuchunna

ఆరగించి కూచున్నాఁ డల్లవాఁడె
చేరువనే చూడరే లక్ష్మీనారసింహుఁడు

ఇందిరనుఁ దొడమీఁద నిడుకొని కొలువిచ్చి
అందపునవ్వులు చల్లీ నల్లవాఁడె
చెందినమాణికముల శేషునిపడగెమీఁద
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు

బంగారుమేడలోన పచ్చలగద్దియలమీఁద
అంగనలయాట చూచీ నల్లవాఁడె
రంగగుసొమ్ములతోడ రాజసపువిభవాల
చెంగట నున్నాడు లక్ష్మీనారసింహుఁడు

పెండెపుఁ బాదము చాఁచి పెనచి వొకపాదము
అండనే పూజలుగొనీ నల్లవాఁడె
కొండల శ్రీవేంకటాద్రి గోరి యహోబలమున
మొండుగాను మెరసీ లక్ష్మీనారసింహుఁడు 


నందగోపనందనుడే - Nandagopa nandanude

నందగోపనందనుడే నాఁటి బాలుడు
ఇందు నేఁడే రేపల్లె నేచి పెరిగేను

పువ్వువంటి మఱ్ఱియాకుపొత్తిఁ బవళించనేర్చె
యెవ్వఁడోకాని తొల్లె యీబాలుఁడు
మువ్వంకవేదములను ముద్దుమాఁట లాడనేర్చె
యెవ్వరూఁ గొంత నేర్పనేఁటికే వీనికి

తప్పుటడుగు లిడఁగనేర్చె ధరణియందు నాకసమున-
నెప్పుగా రసాతలమున నొంటి తొల్లియే
రెప్పలెత్తి చూడనేర్చె రేసీఁ జెంద్రునందు పగలు
గొప్పసూర్యునందు నింకఁ గొత్త నేర్పనేఁటికే

మంచివెన్నబువ్వ లిపుడు మలసి యారగించనేర్చె-
నంచితముగ శ్రీవేంకటాద్రిమీఁదను
యెంచి యప్పలప్పలనుచు యెనసి కాఁగిలించనేర్చె
దించరాని వురముమీఁద దివ్యకాంతను 


కైవల్యమునకంటే - KaivalyamunaKante

కైవల్యమునకంటే కైంకర్య మెక్కుడు
శ్రీవిభుఁడ నీవు మాకుఁ జిక్కేమర్మ మిదివో

చేపట్టి నీశిరసు పూజించే అహమికకంటే
నీపాదాలు పూజించే నేను మొక్కుడు
మాపుదాఁకా నినుఁగొల్చి మందెమేళమౌకంటే
దాపగు నీదాసుల శేషత్వ మెక్కుడు

హరి నీపస్రాదజీవినై గర్వించుటకంటే
నరయ నీదాసులలెంకౌ టెక్కుడు
వెరవున నీచెవిలో విన్నపాలు సేయుకంటే
ధర నీవూడిగకాండ్లఁ దలఁపించు టెక్కుడు

జట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్య మందుటకంటే
అట్టె నీనామఫలమందు టెక్కుడు
ఇట్టె శ్రీవేంకటేశ యేలితి విందువంకనే
తిట్టపు మాగురు నుపదేశ మెక్కుడు 


శ్రీ వేంకటేశ రాజీవాక్ష- Sri Venkatesha Rajeevaksha

శ్రీ వేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే
వేగవేగ మేలుకొను వెలిఛాయ లమరే

సురలు గంధర్వ కిన్నరులెల్ల గూడి తం
బురుశ్రుతులను జేర్చి సరవిగాను
అరుణోదయము దెలిసి హరిహరి యనుచు నర
హరి నిన్ను దలచెదరు హంసస్వరూప

అల చిలుక పలుకులకు నధరబింబము బోలె
తెలివి దిక్కుల మిగుల తేట బారే
అలరు కుచగిరుల నుదయాస్త్రాదిపై వెలిగె
మలినములు తొలగ నిదో మంచు తెరవిచ్చే

తళుకొత్త నిందిరా తాటంకరవిరుచుల
వెలిగన్ను తామరలు వికసింపగాను
అలర్మేల్ మంగ శ్రీవేంకటాచలరమణ
చెలువు మీఱగను ముఖకళలు గనవచ్చే 


నిద్దిరించి పాలజలనిధి - Niddirinchi PalaJananidhi

నిద్దిరించి పాల జలనిధివలెనే
వొద్దిక శ్రీరమణునికి వొత్తరే పాదములు

వేగుదాఁకాఁ జిత్తగించి విద్యలెల్ల నాదరించి
బాగుగాఁ గృపారసము పంచి పంచి
యేగతిఁ బవ్వళించెనో యెట్ల భోగించెనో
యోగీంద్రవరదుని వూఁచరే వుయ్యాలను

వాలుఁగన్నుల రెప్పల వడదాఁకి తనుతావి
చాలుకొన్న వూర్పులు చల్లి చల్లి
నీలవర్ణపుగుణము నెరపుచు నొకయింత-
కాలము గన్నులఁ దిప్పికప్పరే దోమతెర

సరుగన యోగనిద్ర చాలించి లోకమెల్లఁ
గరుణించఁ దలఁచి వేంకటగిరిపై
అరుదుగ సకలలోకారాధ్యుఁడయి మించి
విరివి నాలవట్టాలు విసరరే సతులు 


పాపపుణ్యములరూపము - Papa Punyamularoopamu

పాపపుణ్యములరూపము దేహ మిది దీని-
దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు

అతిశయంబైన దేహాభిమానము దీర
గతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదు
మతిలోనిదేహాభిమానంబు విడుచుటకు
రతి పరాజ్ముఖుఁడు గాక రపణంబు లేదు

సరిలేనిమమకారజలధి దాఁటిఁనఁగాని
అరుదైన నిజసౌఖ్య మది వొందరాదు
తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁగాని
పరగుబ్రహ్మనందపరుఁడుఁ దాఁగాఁడు 


ఎంతకత నడిపితివి - Entakata Nadipitivi

ఎంతకత నడిపితి వే‌మి జోలిఁ బెట్టితివి
చింతించ లోకములు నీచేతివే కావా

కౌరవులఁ బాండవుల కలహము వెట్టనేల
నేరిచి సారథ్యము నెఱపనేలా
కోరి భూభార మణఁచేకొరకై తే నీచే చక్ర-
మూరకే వేసితే దుష్టు లొక్కమాటే తెగరా

చేకొని వానరులఁగాఁ జేయనేల దేవతల
జోకతో లంకాపురి చుట్టుకోనేల
కాకాసురు వేసిన కసవే రావణుమీఁద-
నాకడఁ జంపువెట్టితే నప్పుడే సమయఁడా

గక్కన శ్రీవేంకటేశ కంబములో వెళ్లనేల
చొక్కముగాఁ బ్రహ్లాదుఁడు చూపఁగనేల
చిక్కక హిరణ్యకశిపునాత్మలో నుండక
తక్కించి నీవెడసితే తానే పొలియఁడా