Saturday, March 23, 2024

షోడశకళానిధికి - Sodasha Kalanidhiki

షోడశకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి

అలరు విశ్వాత్ముకున కావాహన మిదె పర్వ-
నిలయున కాసనము నెమ్మి నిదె
అల గంగాజనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధిశాయికిని మజ్జన మిదె

వర పీతాంబరునకు వస్త్రాలంకార మిదె
సరి శ్రీమంతునకు భూషణము లివె
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము

అమృతమథనునకు నదివో నైవేద్యము
గమిఁ జంద్రనేత్రునకుఁ గప్రవిడెము
అమరిన శ్రీవేంకటాద్రిమీఁది దేవునికి
తమితోఁ బ్రదక్షిణాలు దండములు నివిగో 


ఎక్కడిసుద్ది యీ భ్రమనేల - EkkadiSuddi Ee Bramanela

ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు
అక్కటా వోదేహులాల హరినే తలఁచరో

బలుదేవతలకునుఁ బాయదట వ్యామోహము
యిలపై నరులము నేమెంతకెంత
కలదట మునులకుఁ గడ(డు?) రాగద్వేషాలు
చలనచిత్తులము మా జాడ యిఁక నేది

పరగఁ దొల్లిటివారు పంచేంద్రియబద్ధులట
నెరవుగా ముక్తులమా నేఁటివారము
అరిదిఁ బ్రపంచము మాయామయమట నేము
దురితవర్తనులము తొలఁగేమా

ఘన సిద్ధగంధర్వులు కడ గానలేరట
దినమత్తులము మా తెలివేఁటిది
యెనలేని శ్రీవేంకటేశ్వరు శరణుచొచ్చి
మనువార మింతేకాక మరి గతియేది 


ఇప్పుడే తెలుసుకో - Ippude Telusuko

ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ విన్నవించితి
కొప్పువట్టీకె దీసితే గుంపించఁ గలవా

పుత్తడిబొమ్మవలె పూచిన లతికవలె
చిత్తరుపతిమెవలెఁ జెలి యున్నది
మత్తిల్లి యప్పటి నేఁడు మాతో నేమినవ్వేవు
వొత్తుకాపె విలిచితేఁ బోకుండఁగలవా

కొసరుఁగోయిలవలె కొలనితుమ్మిదవలె
పసని చిలుకవలెఁ బలికీనాపె
నసలు సేయుచు నిట్టే నాతో మాటలాడేవు
వొసగితే విడెమాకె వొల్లననఁగలవా 

మెత్తినగందమువలె మెడకంటసరివలె
ముత్తెమువలెనే వురమున నుందాకె
హత్తి శ్రీవేంకటేశుఁడ అట్టె నన్నుఁగూడితివి
బత్తి సేసితివాపెతోఁ బంతమాడఁగలవా 


ఏమి సేయఁగవచ్చు నేకాలమేత్రోవ - Emi seyagavachu nekalametrova

ఏమి సేయఁగవచ్చు నేకాలమేత్రోవ
ఆమీఁది దైవగతులటుగాక పోదు

కనుమాయ నెన్నడిమికరవుననె  లలితాంగి
పనువుచునుఁ గుచగిరుల పాలాయను
కనలి లోలోని దొంగలచేతఁ బోటుపడి
వొనరఁ గట్టనచీరయును శిథిలమాయ

పెడమరలి నునుఁదురుము పెదచీఁకటినె చెలియ
బడలి వదనము వంచఁ బాలాయను
వెడఁదకన్నుల చూపువేడుకల వగలెల్ల-
దడవి హితవైన చిత్తంబు బగలాయ

అరుదైన పరవశంబను అడవిలోఁ దగిలి
పరిమళపుఁ జెమట నది పాలాయను
యిరవైన తిరువేంకటేశు కౌఁగిటఁ గూడి
కురులు సవరించ సిగ్గులునుఁ బగలాయ 


సహజాచారములెల్లా - Sahaja Charamulella

సహజాచారములెల్లా సర్వేశ్వరునియాజ్ఞే
అహమించి నమ్మకుండు టదియే పాషండము

నిద్దిరించువానిచేతి నిమ్మవంటివలెనే
చద్దికర్మములు తానే జారితే జారె
పొద్దువొద్దు తనలోన భోగకాంక్ష లుండఁగాను
అద్దలించి కర్మ మొల్లననుటే పాషండము

కలగన్నవాడు మేలుకనినటువలెనే
తలగి ప్రపంచ మెందో దాఁగితే దాగె
యిల నీదేహము మోఁచి యింతా గల్లలనుచు
పలికి తప్పనడచే భావమే పాషండము

ధర నద్దము చూచేటి తనరూపమువలె
గరిమతో దనయాత్మ కంటేఁ గనె
సరుస శ్రీవేంకటేశుసాకార మటు గని
కరఁగి భజించలేని కష్టమే పాషండము 


సురలు సంతోషించిరి - Suralu Santoshinchiri

సురలు సంతోషించి రసురలెల్లా నడఁగిరి
తొరలి దిక్కుల దేవదుందుభులు మొరసె

కఁడగి వసుదేవుని కాంత దేవకిదేవికి
వుడివోని వేడుకఁ జంద్రోదయవేళ
కొడుకై జన్మించినాఁడు కూరిమి శ్రీకృష్ణుఁడు
నడురేయి నిదే శ్రావణబహుళాష్టమిని

రేపల్లె కెమున దాఁటి రేతిరే తెచ్చి తండ్రి
పాపని యశోదవద్దఁ బండఁగఁ బెట్టి
ఆపొద్దే మధురలోని కాఁడుఁబాపఁ దెచ్చుకొనె
కోపగించి కంసుని మార్కొనె నందనందని

పురుఁడు వెళ్లెను మరి పుణ్యావాజన సేసిరి
మురిపేన గొల్లెతలు ముద్దాడిరి
అరిది శ్రీవేంకటేశుఁ డలమేలుమంగపతై
యిరవై కొల్చినవారి నిందరి రక్షించెను 


చెలియా రమణునికి - Cheliya Ramanuniki

చెలియా రమణునికి చెప్పవే యీ సుద్దులెల్లా
తలకొన్న నేరుపులు తానే నేరుచును

చూపులనే మరుగని చుట్టరిక మేఁటికే
రాఁపుఁగాఁ దమకించని రతు లవి యేఁటికే
యేపునఁ జొక్క జేయని యెడతాఁకు లేఁటికే
చాపలానఁ బెనఁగని సరసము లేఁటికే

మనసు గరఁగనట్టి మాఁట లవి యేఁటికే
చనవుమై సోఁకని సరియాఁక లేఁటికే
ననుపు పెడరేఁచని నవ్వు లవి యేఁటికే
తనివిఁ బొందించని తరితీపు లేఁటికే

కలియించఁ జాలని కత లిన్నీ నేఁటికే
తలఁపు నాఁటని చక్కఁదన మది యేఁటికే
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
అలరి మర్మములంటే యాఁకట మరేఁటికే


Saturday, March 16, 2024

శ్రీహరి నిత్యశేషగిరీశ - Srihari Nityaseshagirisha

శ్రీహరి నిత్యశేషగిరీశ
మోహనాకార ముకుంద నమో శ్రీహరి

దేవకీసుత దేవ వామన
గోవిందా గోపగోపీనాథా! శ్రీహరి
గోవర్ధనధర గోకులపాలక
దేవేశాధిక తే నమో నమో

సామజాన (వ?)న సారంగ(శార్ఙ్గ?)పాణి
వామనా కృష్ణ వాసుదేవా! శ్రీహరి
రామనామ నారాయణ విష్ణో
దామోదర శ్రీధర నమో నమో

పురుషోత్తమ పుండరీకాక్ష
గరుడధ్వజ కరుణానిధి! శ్రీహరి
చిరంతనాచ్యుత శ్రీవేంకటేశ
నరమృగ తే నమో నమో


వటపత్రశయనుఁడా - Vatapatra Shayanuda

వటపత్ర శయనుఁడా వార్ధి బంధనా 
వసుదేవ నందన లాలీ 
చటుల నాగము మీఁద సమ్మతి తోను 
జెలఁగి యూగినవాఁడ లాలీ 

మీనమై జలధియును మెఱుఁగు బంగారు తొట్ల 
మీఁద నూగినవాఁడ లాలీ 
ఆనందకమఠమై యమృతమగు తొట్లలో 
యమరి యూగినవాఁడ లాలీ 

గోణంబు తొట్లలో కూటవరాహమై 
గునిసి యూగినవాఁడ లాలీ 
మానవసింహమై గడపతొట్లలోన 
మరఁగి యూగినవాఁడ లాలీ 

వామనుఁడై చాల త్రిభువనంబు తొట్లలో 
వచ్చి యూగినవాఁడ లాలీ 
రాముఁడై జమదగ్ని యూపుతొట్లెలోన 
రంజిల్లు వాఁడ లాలీ 

ఆమీద రాఘవుఁడై పుష్పకపు తొట్లలో 
నమరి యూగినవాడ లాలీ 
మామ కొరకు గొల్లమంద తొట్లలో 
మరగి యూగినవాడ లాలీ 

తగు బుద్ధ రూపమున దయయను తొట్లలో 
తన్ని యూగినవాడ లాలీ 
పొగడ కల్కియై ధర్మంబు తొట్లలో 
పొసగ యూగినవాడ లాలీ 

తగు అలమేలుమంగ కాఁగిలి తొట్లలో 
తగిలి యూగినవాఁడ లాలీ 
చిగిరించుమని మానసంబు తొట్ల మీఁద 
శ్రీ వేంకటనాధ లాలీ 


సర్వరక్షకుఁడైన - Sarvarakshakudaina

సర్వరక్షకుఁడైన సర్వేశుఁడేకాక
వుర్విమీఁద నందరిలో నొక్కఁడా రాముఁడు

కొండ పొడవులైన ఘోర వానర బలము
గుండుగా వారిధి దండఁ గూడఁబెట్టి
నిండు జెలనిధి గట్టి నిగిడి లంక సాధించె
అండనే రాముఁడు నరుఁ డనవచ్చునా

అన్నిటా దేవతలకు నసాధ్యమైన రావణు -
నెన్నికగాఁ బుత్ర మిత్ర హితుల తోడ
పన్నుకొని శస్త్రాస్త్ర పంక్తులనే ఖండించె
సన్నుతి నిట్టే రాముని జనుఁడన వచ్చునా

చలపట్టి లంక విభీషణునికిఁ బాలించి
బలువుగ సీతఁగూడి పట్టమేలి
యిలలో శ్రీ వేంకటాద్రి నిరవై లోకము గాచీ
నలువంక రాముఁడు నరుఁడనవచ్చునా 


జయ లక్ష్మి వరలక్ష్మి - Jaya Laxmi Varalaxmi

జయ లక్ష్మి వరలక్ష్మి సంగ్రామవీరలక్ష్మీ
ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా

పాలజలనిధిలోని పసనైన మీఁగడ
మేలిమి తామరలోని మించువాసన
నీలవర్ణునురముపై నిండిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా

చందురుతోడఁ బుట్టిన సంపదల మెఱుఁగవో
కందువ బ్రహ్మలఁ గాచే కల్పవల్లి
అందిన గోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మా ఇంటనే వుండవమ్మా

పదియారువన్నెలతో బంగారుపతిమ
చెదరని వేదముల చిగురుఁబోడి
యెదుట శ్రీ వేంకటేశు నిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా 


అప్ప డుండే కొండలోన - Appadunde Kondalona

 అప్ప డుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే 
ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ 
అప్పులుగల వాని వలనే ఓ వేంకటేశ 

ఆకాశాన పొయ్యేకాకి మూకజూచి కేకవేశే 
మూక మూడు విధము లాయరా - ఓ వేంకటేశ 
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ 

అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదుక పోతే 
వొల్వలెల్ల మల్యేలాయే - ఓ వేంకటేశా 
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా 

అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే 
కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా 
శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా 

పుట్టమీద చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే 
పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా   
అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా 

చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడుమేశే 
కాళ్ళులేని వాడు నడచే  ఓ వేంకటేశా 
పెదవిలేనివాఁడు చిలుక తినేరా ఓ వేంకటేశా 

గుంట యెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే 
కుప్పకాలి యప్పు తీరేరా  - ఓ వేంకటేశా 
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా 

సందెకాడ తలవ్రాలు సంధిదీరి  వేంకటరాయా! 
తెల్లవారనాయనీడరా   ఓ వేంకటేశా!
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా! 

ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేశి రాగ 
ముక్కింటిదేవుని జూచేరు ఓ వేంకటేశా! 
దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా! 

ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె
దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా 
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా!  

ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె 
పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశా 
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా 

ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని 
మేక యెకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా 

పున్నమ వెన్నెలలోన వన్యలాడితోను గూడి 
కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా 
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా  

అర్ధరాత్రివేళలోని రుద్రవీణ నెత్తుకొని 
నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా 
దీని భావము నీకే తెలుసురా - ఓ వేంకటేశా