Saturday, March 23, 2024

ఎక్కడిసుద్ది యీ భ్రమనేల - EkkadiSuddi Ee Bramanela

ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు
అక్కటా వోదేహులాల హరినే తలఁచరో

బలుదేవతలకునుఁ బాయదట వ్యామోహము
యిలపై నరులము నేమెంతకెంత
కలదట మునులకుఁ గడ(డు?) రాగద్వేషాలు
చలనచిత్తులము మా జాడ యిఁక నేది

పరగఁ దొల్లిటివారు పంచేంద్రియబద్ధులట
నెరవుగా ముక్తులమా నేఁటివారము
అరిదిఁ బ్రపంచము మాయామయమట నేము
దురితవర్తనులము తొలఁగేమా

ఘన సిద్ధగంధర్వులు కడ గానలేరట
దినమత్తులము మా తెలివేఁటిది
యెనలేని శ్రీవేంకటేశ్వరు శరణుచొచ్చి
మనువార మింతేకాక మరి గతియేది 


No comments:

Post a Comment