Saturday, March 16, 2024

వటపత్రశయనుఁడా - Vatapatra Shayanuda

వటపత్ర శయనుఁడా వార్ధి బంధనా 
వసుదేవ నందన లాలీ 
చటుల నాగము మీఁద సమ్మతి తోను 
జెలఁగి యూగినవాఁడ లాలీ 

మీనమై జలధియును మెఱుఁగు బంగారు తొట్ల 
మీఁద నూగినవాఁడ లాలీ 
ఆనందకమఠమై యమృతమగు తొట్లలో 
యమరి యూగినవాఁడ లాలీ 

గోణంబు తొట్లలో కూటవరాహమై 
గునిసి యూగినవాఁడ లాలీ 
మానవసింహమై గడపతొట్లలోన 
మరఁగి యూగినవాఁడ లాలీ 

వామనుఁడై చాల త్రిభువనంబు తొట్లలో 
వచ్చి యూగినవాఁడ లాలీ 
రాముఁడై జమదగ్ని యూపుతొట్లెలోన 
రంజిల్లు వాఁడ లాలీ 

ఆమీద రాఘవుఁడై పుష్పకపు తొట్లలో 
నమరి యూగినవాడ లాలీ 
మామ కొరకు గొల్లమంద తొట్లలో 
మరగి యూగినవాడ లాలీ 

తగు బుద్ధ రూపమున దయయను తొట్లలో 
తన్ని యూగినవాడ లాలీ 
పొగడ కల్కియై ధర్మంబు తొట్లలో 
పొసగ యూగినవాడ లాలీ 

తగు అలమేలుమంగ కాఁగిలి తొట్లలో 
తగిలి యూగినవాఁడ లాలీ 
చిగిరించుమని మానసంబు తొట్ల మీఁద 
శ్రీ వేంకటనాధ లాలీ 


No comments:

Post a Comment