Saturday, March 16, 2024

సర్వరక్షకుఁడైన - Sarvarakshakudaina

సర్వరక్షకుఁడైన సర్వేశుఁడేకాక
వుర్విమీఁద నందరిలో నొక్కఁడా రాముఁడు

కొండ పొడవులైన ఘోర వానర బలము
గుండుగా వారిధి దండఁ గూడఁబెట్టి
నిండు జెలనిధి గట్టి నిగిడి లంక సాధించె
అండనే రాముఁడు నరుఁ డనవచ్చునా

అన్నిటా దేవతలకు నసాధ్యమైన రావణు -
నెన్నికగాఁ బుత్ర మిత్ర హితుల తోడ
పన్నుకొని శస్త్రాస్త్ర పంక్తులనే ఖండించె
సన్నుతి నిట్టే రాముని జనుఁడన వచ్చునా

చలపట్టి లంక విభీషణునికిఁ బాలించి
బలువుగ సీతఁగూడి పట్టమేలి
యిలలో శ్రీ వేంకటాద్రి నిరవై లోకము గాచీ
నలువంక రాముఁడు నరుఁడనవచ్చునా 


No comments:

Post a Comment