Sunday, January 29, 2023

Ekkadi Papamulu - ఎక్కడిపాపములు

ఎక్కడిపాపము లెక్కడిపుణ్యము
లొక్కట గెలిచితి మోహో నేము

ప్రపన్నులెదుటను బడినయాతుమకు
చపలత మరి నాశము లేదు
ఉపమల గురుకృప నొనరిన మనసుకు
రపముల మఱి నేరములే లేవు

ఘనతర ద్వయాధికారగు దేహికి
మినుకుల భవభయమే లేదు
చనవుల హరిలాంఛన కాయమునకు
వెనుకొను కర్మపువెట్టియు లేదు

శ్రీవేంకటేశ్వరుఁ జేరినధర్మికి
ఆవల మఱి మాయలు లేవు
కైవశమాయను కైవల్యపదమునుఁ
జావుముదిమితో సడ్డే లేదు
 

దైవకృత మెవ్వరికిఁ - Daivakruta Mevvariki

దైవకృత మెవ్వరికిఁ దప్పింపరాదనుచు
భావించి జనులాడుపలుకు నిజమాయ

కందునకుఁ బెడఁబాసి చందురుఁడింతి ముఖ-
చందురుఁడైన నది అందును గలిగె
కందువగు చెలినొసలి కస్తూరితిలకమను -
కందు ముఖచంద్రునకుఁ గడునందమాయ

జలజములు శశిచేతనులికి యీ కాంతకుచ-
జలజంబులైన నది సరుసనే కలిగె
లలితమగు ప్రాణవల్లభుని సురతాంకమున
విలువ సేయఁగరాని విదియచందురులు

తీగె బహుజలములకుఁ దెమలి కామిని మేనుఁ-
దీగె యయ్యిన నదియుఁ దిరుగ మరి కలిగె
ఈ గతులఁ దిరువేంకటేశ్వరుని సమసురత-
యోగంబువలన ఘర్మోదకశ్రీలు 


ఎవ్వరు కర్తలు కారు - Evvaru Kartalu Karu

ఎవ్వరు గర్తలు గారు యిందిరానాథుఁడే కర్త
నివ్వటి ల్లాతనివారై నేమము దప్పకురో

కర్మమే కర్తయైతే కడకు మోక్షము లేదు
అర్మిలి జీవుఁడు గర్తయైతేఁ బుట్టుగే లేదు
మర్మపుమాయ గర్త‌అయితే మరి విజ్ఞానమే లేదు
నిర్మితము హరి దింతే నిజమిదెఱఁగరో

ప్రపంచమే కర్తయైతే పాపపుణ్యములు లేవు
వుపమ మనసు గర్తైఉంటే నాచార మే లేదు
కపటపు దేహములే కర్తలయితే చావు లేదు
నెపము శ్రీహరి దింతే నేరిచి బ్రదుకరో

పలుశ్రుతులు గర్తలై పరగితే మేర లేదు
అల బట్టబయలు గర్తైతే నాధారము లేదు
యెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రి
నిలయపుహరి యింతే నేఁడే కొలువరో 


అతివ జవ్వనము - Ativa Javvanamu

అతివ జవ్వనము రాయలకుఁ బెట్టిన (ట్టని) కోట
పతి మదనసుఖరాజ్యబారంబు నిలుప

కాంతకనుచూపు మేఘంబులోపలి మెఱుఁగు
కాంతుని మనంబు చీఁకటి వాపను
ఇంతి చక్కనివదన మిందుబింబము విభుని-
వంత కనుదోయి కలువలఁ జొక్కఁజేయ

అలివేణిధమ్మిల్లమంధకారపు భూమి
కలికి రమణునకు నేకతమొసఁగను
పొలఁతికి బాహువులు పూవుఁదీగెల కొనలు
పొలసి ప్రాణేశు వలపుల లతలఁ బెనచ

పంకజాననరూపు బంగారులో నిగ్గు
వేంకటేశ్వరు సిరులు వెదచల్లఁగా
చింకచూపుల చెలియచేఁత మదనునిచేఁత
యింకా నతనినె మోహించఁ జేయఁగను 


పాపినైననాపాలఁ గలిగి - Papinaina Napala galigi

పాపినైననాపాలఁ గలిగి తోవ
చూపుమన్న నెందుఁ జూపరు

ధృతిదూలి జగమెల్లఁ దిరిగి వేసరితి
యితరాలయముల కేఁగియేఁగి వేసరితి
గతిమాలి పరులపైఁ గనలి వేసరితి
మతిమాలి కులవిద్య మాని వేసరితి

విసిగి యాచారంబు విడిచి వేసరితి
పసచెడి ప్రియములు పలికి వేసరితి
కొసరి ద్రవ్యముపైఁ గోరి వేసరితి
కసుగంది లోలోనె కాఁగి వేసరితి

కోవిదులగువారిఁ గొలిచి వేసరితి
దైవములందరిఁ దడవి వేసరితి
శ్రీవేంకటేశునిసేవ మాని వట్టి-
సేవలన్నియు నేఁ జేసి వేసరితి 

Monday, January 23, 2023

ఒక్కచోటనే వున్నారు - Okkacotane Vunnaru

ఒక్కచోటనే వున్నారు వొద్దిక నాతఁడూ నీవూ
చెక్కుల చేతులతోడ చింత లిఁక నేఁటికే

మనసు లొడఁబడితే మాఁటలకుఁ జోటు గద్దు
తనువులు సోఁకితేను తమి రేఁగును
చెనకు లగ్గలమైతే సిగ్గులును నుప్పతిలు
చనవు సేసుక పతి సంగాతాలు సేయవే

మొగమొగాలు చూచితే మోహములు పెనగొను
నగవులు వలపుల నానఁబెట్టును
తగులాయపుఁ జేఁతలు తాలిములు వొడమించు
వెగటులే కితనితో వినోదము లాడవే

అలమి పైకొంటేను ఆయములు గరఁగును
తలపోఁత కోరికలు తనివొందించు
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
నెలకొనె నీ పంతాలు నిండుక వుండఁగదే

ఇసుక పాతర - Isuka Patara

ఇసుక పాతర యిందుకేది కడగురుతు
రసికుఁడ నన్నునింత రవ్వశాయనేఁటికి

బయలు వలెనుండును పట్టరాదు వలపు
మొయిలువలెనుండును ముద్దశాయరాదు
నియతములేదిందుకు నేరిచినవారిసొమ్ము
క్రియ యెరుంగుతా నన్నుఁ గెరలించనేఁటికి

గాలివలెఁ బారుచుండు కానరాదు మనసు
పాలవలెఁ బొంగుచుండు పక్కననణఁగదు
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగగుజ్జు
లోలోనె మమ్మునింత లోఁచి చూడనేఁటికి

వెన్నెలే కాయుచునుండు వింతగాదు వయసు
అన్నిటా వసంతరుతువై యుండుఁ బోదు
వున్నతి శ్రీ వేంకటేశుఁడుండనుండఁ జవి వుట్టు
మన్నించె యింక మారుమాటలాడనేఁటికి