Monday, January 23, 2023

ఒక్కచోటనే వున్నారు - Okkacotane Vunnaru

ఒక్కచోటనే వున్నారు వొద్దిక నాతఁడూ నీవూ
చెక్కుల చేతులతోడ చింత లిఁక నేఁటికే

మనసు లొడఁబడితే మాఁటలకుఁ జోటు గద్దు
తనువులు సోఁకితేను తమి రేఁగును
చెనకు లగ్గలమైతే సిగ్గులును నుప్పతిలు
చనవు సేసుక పతి సంగాతాలు సేయవే

మొగమొగాలు చూచితే మోహములు పెనగొను
నగవులు వలపుల నానఁబెట్టును
తగులాయపుఁ జేఁతలు తాలిములు వొడమించు
వెగటులే కితనితో వినోదము లాడవే

అలమి పైకొంటేను ఆయములు గరఁగును
తలపోఁత కోరికలు తనివొందించు
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
నెలకొనె నీ పంతాలు నిండుక వుండఁగదే

No comments:

Post a Comment