Sunday, January 29, 2023

అతివ జవ్వనము - Ativa Javvanamu

అతివ జవ్వనము రాయలకుఁ బెట్టిన (ట్టని) కోట
పతి మదనసుఖరాజ్యబారంబు నిలుప

కాంతకనుచూపు మేఘంబులోపలి మెఱుఁగు
కాంతుని మనంబు చీఁకటి వాపను
ఇంతి చక్కనివదన మిందుబింబము విభుని-
వంత కనుదోయి కలువలఁ జొక్కఁజేయ

అలివేణిధమ్మిల్లమంధకారపు భూమి
కలికి రమణునకు నేకతమొసఁగను
పొలఁతికి బాహువులు పూవుఁదీగెల కొనలు
పొలసి ప్రాణేశు వలపుల లతలఁ బెనచ

పంకజాననరూపు బంగారులో నిగ్గు
వేంకటేశ్వరు సిరులు వెదచల్లఁగా
చింకచూపుల చెలియచేఁత మదనునిచేఁత
యింకా నతనినె మోహించఁ జేయఁగను 


No comments:

Post a Comment