Sunday, January 29, 2023

ఎవ్వరు కర్తలు కారు - Evvaru Kartalu Karu

ఎవ్వరు గర్తలు గారు యిందిరానాథుఁడే కర్త
నివ్వటి ల్లాతనివారై నేమము దప్పకురో

కర్మమే కర్తయైతే కడకు మోక్షము లేదు
అర్మిలి జీవుఁడు గర్తయైతేఁ బుట్టుగే లేదు
మర్మపుమాయ గర్త‌అయితే మరి విజ్ఞానమే లేదు
నిర్మితము హరి దింతే నిజమిదెఱఁగరో

ప్రపంచమే కర్తయైతే పాపపుణ్యములు లేవు
వుపమ మనసు గర్తైఉంటే నాచార మే లేదు
కపటపు దేహములే కర్తలయితే చావు లేదు
నెపము శ్రీహరి దింతే నేరిచి బ్రదుకరో

పలుశ్రుతులు గర్తలై పరగితే మేర లేదు
అల బట్టబయలు గర్తైతే నాధారము లేదు
యెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రి
నిలయపుహరి యింతే నేఁడే కొలువరో 


No comments:

Post a Comment