Saturday, March 22, 2025

ఏది యిందులో సుఖము - Yedi Indulo Sukhamu

ఏది యిందులో సుఖ మెవ్వరు మంచివారలు
పాదు దెలియని ప్రాణిభ్రమ యింతే కాక

భోగింపుచు పిండి పిండి పూచి రక్తమాంసము
లాగతిఁ బుత్రదారాదు లలయింతురు
చేగదేర వెట్టిగొనే చేతుల యిడుమలెల్ల
సాగిన సభలలోన సంసారము

వుఱక మేనిలోఁ జొచ్చి వొగి నింద్రియాల కేఁచి
అఱమఱపించఁ జచ్చె నన్నపానములు
యెఱిఁగెఱిఁగి యుండగా నేలినవాని కమ్మించె
తఱిఁ దనజన్మ మెల్ల ధనధాన్యములు

వొప్పి గుఱిగాక వూరకున్నవాని నతిథుల
కప్పన మప్పించెను గృహారామములు
యిప్పుడే శ్రీవేంకటేశుఁ డేలి మమ్ముఁ గాచెఁ గాక
పుప్పిగాఁ దినె నిన్నాళ్ళు పుణ్యపాపములు 

Watch for audio - https://youtu.be/mDNXwrinuFs

నీ వెఱఁగవా నిండుఁ - Ni Veragava Nindu

నీ వెఱఁగవా నిండుఁ దగవు లివి
కావరంపుఁబని కాంతకుఁ దగునా

నిగ్గుల పతి వట నెలఁతను నే నట
సిగ్గువడక నినుఁ జెనకుదునా
యెగ్గులు వట్టితి వెదురురాననుచు
బగ్గన నాఁటది బలిమిసేయునా

చదురుల దొర వట జవ్వని నే నట
అదనెఱఁగక నిను నలముదునా
కదిమి కొసరితివి గర్వినైతి నని
గుదిగొని కామిని గొరబుసేతునా

శ్రీవేంకటేశ్వర శ్రీసతి నేనట
సోవగా నవ్వక సొలయుదునా
యీవలఁ గూడితి వియ్యకొంటి నని
కైవసమగు సతి కాదనునా 

Watch for audio - https://youtu.be/EMLwSG8FYlw 

కాలాంతకుఁడను - Kalantakudanu

కాలాంతకుఁడనువేఁటకాఁ డెప్పుడుఁ దిరిగాడును
కాలంబనియెడితీవ్రపుగాలివెర వెరిఁగి

పరమపదంబు చేనికి పసిగొనునర మృగములకు నును
తరమిడి, సంసారపుటోఁదములనె యాఁగించి,
వురవడిఁ జేసినకర్మపుటరులు దరిద్రంబనువల
వొరపుగ మాయనుపోగులు వొకవెరవున వేసీ

కదుముకవచ్చేటిబలురోగపుఁగుక్కల నుసికొలిపి,
వదలక ముదిసినముదిమే వాకట్టుగఁ గట్టి.
పొదలుచు మృత్యువు పందివోటై నల్లెట నాడఁగ.
పదిలముగా గింకరులనుచొప్పరులఁ బరవిడిచీ

ఆవోఁదంబులఁ జిక్కక, ఆవురులనుఁ దెగనురికి,
ఆవేఁటకాండ్ల నదలించాచేనే చొచ్చి ,
పావనమతిఁ బొరెవొడిచి పరమానందముఁ బొందుచు
శ్రీ వేంకటపతి మనమునఁ జింతించీ నరమృగము 

Watch for audio - https://youtu.be/OO_ClhxoB6Y

ఎవ్వ రెరుఁగుదురమ్మా - Evva Reruguduramma

ఎవ్వ రెరుఁగుదురమ్మా యిటువంటి నీ సుద్దు –
లివ్వల నేఁ డప్పటి మా యింటికి వచ్చితివి

కలికితనములనే కరఁగించితివి పతి
సెలవి నవ్వులు నవ్వి చిమ్మిరేఁచితి
మలకల మాఁటలాడి మరిగించుకొంటివి
యెలమి నీతని నింకా నేమి సేతువో

చేతులెత్తి మొక్కి మొక్కి చేతికి లోఁ జేసితివి
యేతులెల్లాఁ జూపి చూపి యెలయించితి
కాతరానఁ గాలు దొక్కి కడుఁ జోకఁ జేసితివి
యీతల నీతని నింకా నెంత సేతువో

సన్నల నీ మోవినే చవులు గొలిపితివి
పన్నుక చెనకులనే భ్రమయించితి
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డీతఁ డిట్టె నన్నుఁ గూడె
యెన్నిక చేఁతల నీవు యెంత సేతువో 

Watch for audio - https://youtu.be/07bRUq0HwJA

ఎన్నిలేవు నాకిటువంటివి - YenniLevu Naa Kituvantivi

ఎన్ని లేవు నా కిటువంటివి
కన్నులెదుట నిన్నుఁ గనుగొనలేనైతి

అరయ నేఁజేసినయపరాధములు చూచి
కరుణించి వొకడైనాఁ గాచునా
కరచరణాదులు కలిగించిననిన్నుఁ
బరికించి నీసేవాపరుఁడ గాలేనైతి

యేతరినై నేనెఱిఁగి సేసినయట్టి-
పాతక మొకఁడైనా బాపునా
ఆతుమలోనుండి యలరి నీవొసఁగిన-
చేతనమున నిన్నుఁ జెలఁగి చేరనైతి

శ్రీవేంకటేశ నేఁ జేసినయితరుల-
సేవ కొకఁడు దయసేయునా
నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ
నీవాఁడ ననుబుద్ధి నిలుపనేరనైతి 

Watch for audio - https://youtu.be/QgXuKNxxgeM

Thursday, March 13, 2025

మొక్కేమయ్యా నీకు - Mokkemayya Neeku

మొక్కేమయ్యా నీకు ముమ్మాటికి
యెక్కువతక్కువల నిన్నేమి సేసితిమో

విరహతాపముచేత విసిగినవేళ నిన్ను
యెరవుగా జూచి చూచి యే మాడితినో
తరలక నీవు నన్ను దగ్గరి కాగిలించితే
కరఁగినవేళ యెట్టు కాలు చేయి దాఁకునో

జవ్వనమదము చేత జడిసిన వేళ నిన్ను
యివ్వల నే నెంత రచ్చ కెక్కించితినో
నవ్వుతా నీవంత నాకు నీమో వియ్యఁగాను
యెవ్వల నీ కేడేడ నా యెంగి లాయనో

పానుపుపై నిద్దరము పవ్వ ళించేవేళ నిన్ను
పూని యంత యలయించి భోగించితినో
ఆనుక శ్రీవేంకటేశ అలమేలుమంగను న
న్నీ నెపానఁ గూడితివి యెట్లా మీరితినో 

Watch for audio - https://youtu.be/Zlx9m5DBf-A

ఇన్నిటా నొరయక - Innita Norayaka

ఇన్నిటా నొరయక యెఱు కేది
వెన్నునికృపఁగా వెలసేది

కోపము మతిలోఁ గుందినపుడు వో
పాపము లన్నియుఁ బాసేది
తీపులయాసలు దీరినపుడు వో
తాపత్రయములు దలఁగేది

ఘనకర్మంబులు గడచినపుడువో
వెనుకొనుభవములు విడిచేది
మునుకొని యింద్రియములు వీడినఁబో
పనివడి విరక్తి బలిసేది

ఆఁకటిరుచు లివి యణఁగినపుడు వో
చేకొని సుఖమునుఁ జెందేది
యీకడ శ్రీవేంకటేశ్వరు శరణము
పైకొనిననుఁబో బదికేది 

భావము: 
విష్ణుని దయ వలననే జ్ఞానము లభించును . కోపము విడిచినచో పాప భావములు మనలను విడిచి పోవును . కోరికలపై మోజు తీరినపుడే మూడు రకములైన బాధలు తొలగును. అనగా శరీర సంబంధమైనవి , మానసికములైనవి, దేశ పరములైనవి తొలగును. గొప్ప పనులు అనగా కీర్తి కొరకై , స్వలాభము కొరకై పనులు చేయుట మానినపుడే సంసారపు చిక్కులు వైదొలగును . ఇంద్రియములచే నడిపింప బడుట మానినపుడే వైరాగ్యము బలపడును . రుచి కొరకై ఆకలిని మించి భుజించుట విడిచినపుడే నిజమైన సుఖము ప్రాప్తించును.శ్రీ వేంకటేశ్వరుని శరణు పొందినపుడే బ్రతుకు సార్ధకమగును. కోరికలు, కోపము, కీర్తికాముకత లేనివాడు సమాజమునకై శ్రద్ధతో పనిచేసి స్వామి దయను పొందగలడు . 
(సంకీర్తనమునకు భావమూలం… డా!!గురు కొండవీటి జ్యోతిర్మయి గారు) 

Watch for audio - https://youtu.be/BDMrizxfLgE

రాముఁడు లోకాభిరాముఁడు - Ramudu Lokabhi Ramud

రాముఁడు లోకాభిరాముఁ డుదయించఁగాను
భూమిలో వాల్మీకికి పుణ్యమెల్లా దక్కెను

తటుకన మారీచుతలపైఁ బోయఁ గర్మము
కుటిలశూర్పనఖ ముక్కునఁ బండెను
పటుకునఁ దెగె దైత్యభామల మెడతాళ్ళు
మటమాయదైత్యులకు మరి నూరూ నిండెను

తరగె రావణు పూర్వతపములయాయుష్యము
ఖరదూషణాదులకు కాలము దీరె
గరిమ లంకకు నవగ్రహములు భేదించె
సిరుల నింద్రజిత్తాకు చినిఁగె నంతటను

పొరిఁ గుంభకర్ణునికి పుట్టినదినము వచ్చె
మరలి గండము దాఁకె మండోదరికి
పరగె నయోధ్యకు భాగ్యములు ఫలియించె
చిరమై శ్రీ వేంకటేశుచేఁతలెల్లా దక్కెను 

English Lyrics
----------------------- 
Ramudu Lokabhiramudu udayimchaganu
Bhumilo Valmikiki punyamella dakkenu  

Tatukana Marichutalapai boya garmamu
Kutila Surpanakha mukkuna bamdenu
Patukuna dege daityabhamala medatallu
Matamaayadaityulaku mari nooru nindenu  

Tarage Ravanu purvatapamula yayushyamu
Khara dushanadulaku kaalamu deere
Garima Lankaku Navagrahamulu bhedimche
Sirula Indrajittaku chinige nanthatanu  

Pori Kumbhakarnuniki puttina dinamu vache
Marali gandamu daake Mandodariki
Parage nayodhyaku bhagyamulu phaliyinche
Chiramai Sri Venkateshu chetalella dakkenu 

Watch for audio - https://youtu.be/uZy8oDjMuro

చెడ్డ చెడ్డ మనసుల - Chedda Chedda Manasula

చెడ్డ చెడ్డ మనసుల చెంచువారము- ఆల-
దొడ్డివాఁడ పోవయ్య దూళికాళ్ల రాక

ఏఁటి దాననైతినేమి యెవ్వతె నేనైతినేమి
ఆఁటదాని నన్ను నీకు నడుగనేలా
మూఁట మాఁటలనె కడు మోవనాడవద్దు లేటి-
వేఁటకాఁడ పోవయ్య వెంటవెంట రాక

ఎవ్వరి వారైననేమి యేడనేడ నుండిరేమి
దవ్వుచేరువలు నీకు దడవనేలా
నవ్వకుండఁగానె వట్టి నవ్వునవ్వేవెవ్వరైన
పువ్వక పూచెననేరు పోవయ్య రాక

ఎక్కువ కొప్పయిననేమి యెంత గుబ్బలైన నేమి
చక్కఁదనము వొగడ సారె నీకేలా
వెక్కసాలు మాని మాతో వేంకటేశ మా (మీ?) యింటి-
యిక్కువకే పోవయ్య యింతనంత రాక 

Watch for audio - https://youtu.be/70UrBi5tPhA 

నమోనమో లక్ష్మీనరసింహా - Namo Namo LaxmiNarasimha

నమో నమో లక్ష్మీనరసింహా
నమో నమో సుగ్రీవనరసింహా

వరద సులభ భక్త వత్సల నరసింహా
నరమృగవేష శ్రీనరసింహా
పరమపురుష సర్వపరిపూర్ణ నరసింహా
గిరిగుహావాస సుగ్రీవనరసింహా

భయహర ప్రహ్లాదపాలన నరసింహా
నయనత్రయారవింద నరసింహా
జయ జయ సురమునిసంస్తుత నరసింహా
క్రియాకలాప సుగ్రీవనరసింహా

అతికృపానిలయ మోహనరూప నరసింహా
నత పితామహముఖ్య నరసింహా
సతత శ్రీవేంకటేశ్వర దివ్యనరసింహా
కితవారిభంజన సుగ్రీవనరసింహా

Watch for audio - https://youtu.be/9oTMWHr2I4s

Thursday, March 6, 2025

ఎక్కడఁ జూచినఁ - Ekkada Juchina

ఎక్కడఁ జూచినఁ దానై యీతఁడున్నాఁడు
వెక్కసపు మనపాలి విష్ణుదేవుఁడు

చూడరె పదారువేలు సొరిది యిండ్లలోన
వేడుక నన్నిరూపులై విఱ్ఱవీఁగీని
జాడతో దేవతలకు జలనిధి దచ్చి తచ్చి
పాడితోడ నమృతము పంచిపెట్టీని

మొక్కరె రేపల్లెలోన ముంచి యాలమందలలో
నక్కడ గోపాలులతో నాటలాడీని
దిక్కులు సాధించి తనదేవుల నండఁ బెట్టుక
రెక్కల గుఱ్ఱముపై పేరెముదోలీని

సేవలెల్లాఁ జేయరె శ్రీవేంకటాద్రిమీఁద
వావిరి నందరికిని వరాలిచ్చీని
ఆవల నీవలఁ దానె అంతరాత్మ యిందరికి
భావాలలోన విశ్వరూపముచూపీని

Watch for audio - https://youtu.be/h87CBLgas8E 

తెలిసిన వారికి - Telicina Variki

తెలిసిన వారికి తెరు విది మరి లేదు
నలినాక్షుఁ బొగడెడి నామములో నున్నది

ఆకసాన లేదు మోక్ష మటు పాతాళమున లే
దీకడ భూలోకమందు యెందు లేదు
పైకొని ఆసలెల్ల పారఁదోలి వెదకితే
శ్రీకాంతుఁ బొగడేటి చిత్తములో నున్నది

సురలవద్ద లేదు సోదించ నమృతము
సరి దిక్కులందు లేదు జలధిలో లేదు
శరణాగతుల పాతజలములు చేర్చికొనే
హరిదాసులఁ బూజించే అరచేత నున్నది

రాజసాన సుఖమేది రాసి కర్మమందు నేది
వోజతోడ నియతుఁడై వుండేనానిది
సాజాని శ్రీవేంకటేశు సరిముద్రలు ధరించే
తేజముతో విజ్ఞానదేహములో వున్నది 

Watch for audio - https://youtu.be/dGlFIOd_wbM 

కన్నుల నీసంతోసము - Kannula Ni Santosamu

కన్నుల నీసంతోసము గంటిమయ్యా
సన్నల నివెల్ల మాకు సారెఁ జూపవయ్యా

సెలవుల నవ్వులు చెక్కిళ్ళ చెమటలు
కలిగెఁగా నేఁడు నీకుఁ గడుమేలయ్యా
మొలక కెంపులు మొవి, మోమున నిండుఁగళలు
తొలఁకీ నీ వన్నిటాను దొడ్డవాఁడవయ్యా

కడగన్నుల నిద్దుర కాయమునఁ బులకలు
తడఁబడీ నీకు నేఁడు తగునయ్యా
అడియాలాలు సందున నక్కుఁన జనులొత్తులు
ఆడరె జాణఁడవు నీ వౌదువయ్యా

శిరసుపై సేసలు కురుల చెదరులును
పరగె నీయందు నేఁడు బాపురే యయ్యా
యిరవై శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
సరుగ నన్నేలితివి సరసుఁడవయ్యా

Watch for audio - https://youtu.be/oSe1D1_oXnM 

వెలికీ వెళ్ళఁడు చలికీ - Veliki Velladu Chaliki

వెలికీ వెళ్ళఁడు చలికీ వెరవఁడు
వులికీ నులికీ నులికీనయ్యా

రోగియై తా రుచులఁ బాయఁడు
భోగియై రతిపొందల్లఁడు
వేగి మిగిలిన వెడచీఁకటినీరు
తాగీఁ దాగీఁ దాగీనయ్యా

తొడికీఁ దొడుకఁడు వుడికీ నుడుకఁడు
కడికీఁ గసరఁడు కడుఁజేరఁడు
మడికీ గుడికీ మానినమమతలఁ
బుడికీఁ బుడికీఁ బుడికీనయ్యా

నిండీ నిండఁడు నెరసీ నెరయఁడు
పండీఁ బండఁడు బయలీఁతలా
అండనె తిరువేంకటాధిపుఁ దలఁపుచు
నుండీ నుండీ నుండీనయ్యా

Watch for audio - https://youtu.be/d4QeTdQOO04

ఱాలు దింటా మలిగండ్లాఱడి - Raalu Dinta Maligandlaradi

ఱాలు దింటా మలిగండ్లాఱడి రాసిగా నేరేము
తేలుచు శ్రీహరి నీవే దిక్కౌటగాక

ఆసలేల మానుఁ దన ఆఁకలి లో నుండఁగాను
బేసబెల్లి దేహముతోఁ బెరుగుఁగాక
గాసి బంధమేలఁమానుఁ గాముఁడు లో నుండఁగాను
వేసట సంసారమై వెన్నడించుఁగాక

ధావతులేఁటికి మానుఁ దనుభోగాలుండఁగాను
మోవరాని చింతలతో ములుగుఁగాక
కావరములేల మాను కంతలమేనుండఁగాను
తోవ చేసుకొని వెళ్లఁదోయుచుండుఁగాక

వొక్కచిత్తమేలయౌను వూర్పుగాలి విసరఁగా
చిక్కి గుణత్రయముచేఁ జెదరుఁగాక
నిక్కి శ్రీవేంకటపతి నీకు నేనే శరణంటి
గక్కన నీజీవమును గరుణింతుగాక

Watch for audio - https://youtu.be/JnLXte1pyQA