Thursday, March 13, 2025

ఇన్నిటా నొరయక - Innita Norayaka

ఇన్నిటా నొరయక యెఱు కేది
వెన్నునికృపఁగా వెలసేది

కోపము మతిలోఁ గుందినపుడు వో
పాపము లన్నియుఁ బాసేది
తీపులయాసలు దీరినపుడు వో
తాపత్రయములు దలఁగేది

ఘనకర్మంబులు గడచినపుడువో
వెనుకొనుభవములు విడిచేది
మునుకొని యింద్రియములు వీడినఁబో
పనివడి విరక్తి బలిసేది

ఆఁకటిరుచు లివి యణఁగినపుడు వో
చేకొని సుఖమునుఁ జెందేది
యీకడ శ్రీవేంకటేశ్వరు శరణము
పైకొనిననుఁబో బదికేది 

భావము: 
విష్ణుని దయ వలననే జ్ఞానము లభించును . కోపము విడిచినచో పాప భావములు మనలను విడిచి పోవును . కోరికలపై మోజు తీరినపుడే మూడు రకములైన బాధలు తొలగును. అనగా శరీర సంబంధమైనవి , మానసికములైనవి, దేశ పరములైనవి తొలగును. గొప్ప పనులు అనగా కీర్తి కొరకై , స్వలాభము కొరకై పనులు చేయుట మానినపుడే సంసారపు చిక్కులు వైదొలగును . ఇంద్రియములచే నడిపింప బడుట మానినపుడే వైరాగ్యము బలపడును . రుచి కొరకై ఆకలిని మించి భుజించుట విడిచినపుడే నిజమైన సుఖము ప్రాప్తించును.శ్రీ వేంకటేశ్వరుని శరణు పొందినపుడే బ్రతుకు సార్ధకమగును. కోరికలు, కోపము, కీర్తికాముకత లేనివాడు సమాజమునకై శ్రద్ధతో పనిచేసి స్వామి దయను పొందగలడు . 
(సంకీర్తనమునకు భావమూలం… డా!!గురు కొండవీటి జ్యోతిర్మయి గారు) 

Watch for audio - https://youtu.be/BDMrizxfLgE

No comments:

Post a Comment