Saturday, March 22, 2025

ఎవ్వ రెరుఁగుదురమ్మా - Evva Reruguduramma

ఎవ్వ రెరుఁగుదురమ్మా యిటువంటి నీ సుద్దు –
లివ్వల నేఁ డప్పటి మా యింటికి వచ్చితివి

కలికితనములనే కరఁగించితివి పతి
సెలవి నవ్వులు నవ్వి చిమ్మిరేఁచితి
మలకల మాఁటలాడి మరిగించుకొంటివి
యెలమి నీతని నింకా నేమి సేతువో

చేతులెత్తి మొక్కి మొక్కి చేతికి లోఁ జేసితివి
యేతులెల్లాఁ జూపి చూపి యెలయించితి
కాతరానఁ గాలు దొక్కి కడుఁ జోకఁ జేసితివి
యీతల నీతని నింకా నెంత సేతువో

సన్నల నీ మోవినే చవులు గొలిపితివి
పన్నుక చెనకులనే భ్రమయించితి
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డీతఁ డిట్టె నన్నుఁ గూడె
యెన్నిక చేఁతల నీవు యెంత సేతువో 

Watch for audio - https://youtu.be/07bRUq0HwJA

No comments:

Post a Comment