Tuesday, July 23, 2024

సర్వం విష్ణుమయం - Sarvam Vishnumayam

"సర్వం విష్ణుమయం" బను భావము సత్యం బిన్నిటను
సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు శరణాగతి యే వుపాయము

తాననియెడిబుద్ధి దైవంబందు నునిచి
తానే తనమతి మరచిన సుఖతత్వానందమిది
మేననియెడిబుద్ది యీ మేదిని ప్రకృతియందు
ఆనింపుచుఁ దా మమతలు విడిచిన నాత్మజ్ఞానంబు

పొరలి జగమనేబుద్ధి మాయపై నునిచి
పరగినయింద్రియముల గెలిచినదే పరమపుయోగంబు
పొరిఁ గర్మపుబుద్ధి పుట్టువుపై నునిచి
వెరపునఁబాపము బుణ్యము విడుచుట వివేకమగుదుదిపదము

వెలిఁ దోఁచినబుద్ధి వేగమే లోనునిచి
చలమున చంచల ముడిగియుండుటే సమాధిలక్షణము
పలుభావపుబుద్ధి భక్తి వొకట నునిచి
యెలమి శ్రీవేంకటపతి గలయుటే యిది తుర్యావస్థ 


Watch for audio - https://youtu.be/Arvaa3_9x5o

ఏమీ నెఱఁగనినన్ను – Emi Nerugani Nannu

ఏమీ నెఱఁగని నన్ను నింత సేసెను
నామగఁడై యిట్లానే నన్ను నేలమనవే

నవ్వులునవ్వి నన్ను నమ్మించెను
పువ్వులు వేసి కొంత బుజ్జగించెను
చివ్వనఁ జెనకి మేను చిమ్మిరేచెను
తవ్వి తవ్వి వలపులు తలఁపించెను

లాసిలాసి మెల్లనే మేలములాడెను
వాసికెక్క నాచే సేవలుగొనెను
ఆసలు వుట్టించి విడెమంది యిచ్చెను
సేసచల్లి నన్ను నిట్టె సిగ్గుల నోలార్చను

వాడాక సేసి నాకు వరుసిచ్చెను
వీడుదోడుగానే మోవివిందు చెప్పెను
కూడె శ్రీ వేంకటగిరి గోవిందరాజు
వేడుకల నన్నుఁ గడు వెలయించెను 


Watch for audio - https://youtu.be/ZCtK2kaCW2Y

చిత్తడి చెమటమేని - Chittadi Chematameni

చిత్తడి చెమటమేని శ్రీనివాసా! కడు -
చిత్తిడి వాఁడవుగ దో శ్రీనివాస

చెల్లు నీకు నీచేఁతలు శ్రీనివాస! నా -
చెల్లెలితో నవ్వితివి శ్రీనివాస
చెల్లఁబో యింతదొరవు శ్రీనివాస! నీ - 
చిల్లర విద్యలు బెట్టు శ్రీనివాస

చేరితిమి నీవద్ద శ్రీనివాస! మేను
జీరలాయ నింతలోనె శ్రీనివాస
చీరఁగారీ మా వయసు శ్రీనివాస! నీకుఁ
జేరువగా మా యిల్లు శ్రీనివాస

చిక్కని మాట లాడేవు శ్రీనివాస! మా
చిక్కెల్లా బాసెను నేఁడు శ్రీనివాస
చెక్కు నొక్కి కూడితివి శ్రీనివాస! వావి
చిక్కె శ్రీ వేంకటగిరి శ్రీనివాసా 


Watch for audio - https://youtu.be/gWnmSienxAs

ఎక్కడనున్నా నీతఁడు - Yekkadanunna Neethadu

ఎక్కడనున్నా నీతఁడు
దిక్కయి మాదెసఁ దిరిగీఁగాక

సరసుఁడు చతురుఁడు  జగదేకగురుఁడు
పరమాత్మ డఖిలబంధువుఁడు
హరి లోకోత్తరుఁ డతఁడే నామతి
సిరితోఁ బాయక చెలఁగీఁగాక

ఉన్నతోన్నతుఁ డుజ్జ్వలుఁ డధికుఁడు
పన్నగశయనుఁడు  భవహరుఁడు
యిన్నిటఁగలిగిన యిందిరా(ర?)రమణుఁడు
మన్ననతో మము మనిపీఁగాక

మమతల నలమేల్మంగకు  సంతత -
రమణుఁడు వేంకటరాయఁడు
జమళిసంపదల  సరసవిభవముల
తమకంబున మముఁదనిపీఁగాక 


Watch for audio - https://youtu.be/Tjipm3o926o

పరము నిహము - Paramu Nihamu

పరము నిహము పంటపండినయట్టు
యిరవుగాఁ దానే యెట్టయెదుట నున్నాఁడు

ముంచిన మహిమలెల్లా మూర్తివంతమైనట్టు
కాంచిన వరములు సాకారమైనట్టు
అంచె శృంగారరసాన కంగములు వచ్చినట్టు
యెంచఁగ శ్రీవేంకటేశు డెదుర నున్నాఁడు

చెలఁగి అకాశానకు చైతన్యము వచ్చినట్టు
అల దయాసింధువు ప్రత్యక్షమైనట్టు
మొలచి సుజ్ఞానము మోసులెత్తి వుండినట్టు
యెలమి శ్రీవేంకటేశుఁ డెదుట నున్నాఁడు

పరగ నానందము ప్రతిబింబించినయట్టు
సురలభాగ్యము పొడచూపినట్టు
వురుటై యలమేల్మంగ నురమున నించుకొని
యిరవై శ్రీవేంకటేశుఁ డెదుట నున్నాఁడు 


Watch for audio - https://youtu.be/4qQbr7Pbjow

ఏనోము నోఁచితినో - Enomu Nochitino

ఏనోము నోఁచితినో యింతకు మున్ను
ఆనుకొని సేవసేయ నంతదాననా

చనవిచ్చి నీవు నాతో సరసమాడేవు గాక
కనుఁగొన నేనంత చక్కని దాననా
పనివడి నామీఁద పాదము చాఁచేవు గాక
తనువు సోఁకుటకు నంతటి దాననా

నాపై మన్ననఁ గూడ నవ్వులు నవ్వేవు గాక
నీపొందు లిటుసేయ నేరుపరినా
తీపనుచు నామోవి తేనెలడిగేవు గాక
ఆపనుల కంతేసి యరుహపు దాననా

దయఁ జూచినవాడవై తగిలి కూడేవు గాక
క్రియతో నీచిత్తమెరిఁగిన దాననా
నియతి శ్రీవేంకటేశ నేఁడిట్టే పెండ్లాడితివి
ప్రియపడి యింతసేయ బిరుదులదాననా 


Watch for audio -  https://youtu.be/iY8KShACjlo

తప్ప దీయర్థమొకటి - Tappadu I Ardhamu

తప్ప దీయర్థమొకటి  దాఁచినధనముసుండీ 
విప్పరాదు చెప్పరాదు వేదమందు నున్నది 

హరిభక్తి గలిగినయతనికి  మోక్షము 
పొరుగుననున్నట్టు  పొసఁగినది 
దరిశనభక్తిచే దనరినవారికి 
యిరవైన మోక్షము యెదిటిది 
 
మక్కువ భాగవతాభిమానముగల వారి_  
కక్కరలేనిమోక్ష మరచేతిది 
నిక్కి యాచార్యాభిమాననిరతులైన వారికి 
తక్కక మోక్ష మింతా ధనలోనిది 

యెంత విచారించుకొన్నా నేమేమి చదివినా_ 
నెంతవారికైనా  మోక్ష మిందులోనిది 
వింతగా శ్రీవేంకటవిభుని సంకీర్తన 
వంతులకు మోక్షము వదనములోనిది 


Watch for audio - https://youtu.be/0ryWNwmRv6A

రామ రామచంద్ర రాఘవా - Rama Ramachandra Raghava

రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా
సౌమిత్రి భరత శత్రుఘల తోడ జయమందు దశరథ రాఘవా

శిరసు కూఁకటుల రాఘవా చిన్నారి పొన్నారి రాఘవా
గరిమ నావయసునఁ దాటకిఁ జంపిన కౌసల్యనందన రాఘవా
అరిది యజ్ఞముగాచు రాఘవా అట్టె హరువిల్లు విఱిచిన రాఘవా
సిరులతో జనకుని యింటను జానకిఁ జెలఁగి పెండ్లాడిన రాఘవా

మలయు నయోధ్యా రాఘవా మాయామృగాంతక రాఘవా
చెలఁగి చుప్పనాతి గర్వ మడఁచి దైత్యసేనలఁ జంపిన రాఘవా
సొలసి వాలిఁజంపి రాఘవా దండి సుగ్రీవునేలిన రాఘవా
జలధి బంధించిన రాఘవా లంక సంహరించిన రాఘవా

దేవతలు చూడ రాఘవా నీవు దేవేంద్రు రథమెక్కి రాఘవా
రావణాదులనుఁ జంపి విభీషణు రాజ్యమేలించిన రాఘవా
వేవేగ మరలి రాఘవా వచ్చి విజయ పట్టమేలి రాఘవా
శ్రీవేంకటగిరిమీఁద నభయము చేరి మాకిచ్చిన రాఘవ 


Watch for audio - https://youtu.be/dUAdeDqgyNo

ఎంతకాలమొకదా - Enta Kalamokada

ఎంతగాలమొకదా యీ దేహధారణము
చింతాపరంపరలఁ జిక్కువడవలసె

వడిగొన్న మోహంబువలలఁ దగులైకదా
కడలేని గర్భనరకము లీఁదవలసె
నడిమిసుఖములచేత ననుపుసేయఁగఁగదా
తొడరి హేయపుదిడ్డిఁ దూరాడవలసె

పాపపుంజములచేఁ బట్టువడఁగాఁగదా
ఆపదల తోడిదేహము మోవవలసె
చూపులకులోనైన సుఖము గానక కదా
దీపనభ్రాంతిచేఁ దిరిగాడవలసె

హితుఁడైన తిరువేంకటేశుఁ గొలువకకదా
ప్రతిలేని నరకకూపమునఁ బడవలసె
అతనికరుణారసంబబ్బ కుండఁగఁగదా
బ్రతిమాలి నలుగడలఁ బారాడవలసె 


Watch for audio - https://youtu.be/Miu4PM18usc

Sunday, July 7, 2024

గోరగీరీ నాచెక్కు గోవిందుఁడు - Goragiri Nacekku Govindudu

గోరగీరీ నాచెక్కు గోవిందుఁడు
కూరిములు గొసరీని గోవిందుఁడు

నలిరేఁగి ననుఁ జూచి నవ్వీఁగదవే నేఁడు
కొలువులోపలనుండి గోవిందుఁడు
తలవంచుకొని నేను తరుణిమాటున నుంటే
కులికికులికి చూచీ గోవిందుఁడు

చిప్పిలుఁదమకమున చేసన్న సేసీఁగదే
కొప్పు ముడుచుకోఁగానే గోవిందుఁడు
వుప్పతిల్లుసిగ్గుతోడ నొడికాన నే నుండితే
గొప్పతామరల వేసీ గోవిందుఁడు

కమ్మటినిఁ దెరవేసి కాఁగిలించి కూడెఁగదే
కుమ్మరింపుమోహముల గోవిందుఁడు
ఇమ్ముల శ్రీవేంకటాద్రి నిరవై తిరుపతిలో
కొమ్మలతో నీడువెట్టీ గోవిందుఁడు 

Watch for audio - https://youtu.be/sC7X7OX7UGE 

అనుచు పొగడజొచ్చేరదె - Anuchu PogadaJocheradhe

అనుచు బొగడ జొచ్చేరదె బ్రహ్మాదులు మింట 
మొనసి యీ బాలునికే మొక్కేమునేము 

వున్నతపులోకములు వుదరాన నున్నవాడు 
అన్నువ నీ దేవకిగర్భమందు వుట్టెను 
మన్నించి యెగీంద్రుల మదిలోనుండెడువాడు 
పన్నిన పొత్తులలోన బాలుడై వున్నాడు 

పాలజలధిలోన పాయనిగోవిందుడు 
పాలువెన్న లారగించె పైడికోరను 
వోలి దన  విష్ణుమాయ నోలలాడినట్టివాఁడు 
చాలి మంత్రసానులచే  జలకమాడీని 

ముగురువేల్పులకు మూలమైనయట్టివాడు 
తగుబలభద్రునికి  తమ్ముడాయను 
నిగిడి వైకుంఠమున నిలిచి రేపల్లె నుండి 
యెగువ శ్రీవేంకటాద్రి  నిరవాయ వీడే 

Watch for audio - https://youtu.be/sC7X7OX7UGE 

కంటి శుక్రవారము - Kanti Sukravaramu

కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని॥

సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి
తుమ్మెద యైచాయతోన నెమ్మది నుండే స్వామిని॥

పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని॥

తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని॥ 

Watch for audio - https://youtu.be/sC7X7OX7UGE 

హరి నీవే సర్వాత్మకుఁడవు - Harinive Sarvatmakudavu

హరి నీవే సర్వాత్మకుఁడవు
యిరవగు భావన యియ్యఁగదే

చూడక మానవు చూచేటి కన్నులు
యేడనేవైనా యితరములు
నీడల నింతా నీరూపములని
యీడువడని తెలి వియ్యఁగదే

పారక మానదు పాపపు మన సిది
యీరసములతో నెందైనా
నీరజాక్షయిది నీమయమేయని
యీరీతుల తలఁ పియ్యఁ గదే

కలుగక మానవు కాయపుసుఖములు
యిలలోపలఁ గల వెన్నైనా
అలరిన శ్రీ వేంకటాధిప నీకే
యిలనర్పితమను యిహ మియ్యఁగదే 

Watch for audio - https://youtu.be/sC7X7OX7UGE 

హరిఁ గొలిచినఁగాని - Hari Golichinagani

హరిఁ గొలిచినఁగాని ఆపద లణఁగవని
యెరఁగక పొరలితి మిందేమి నిజము

పుట్టిన దేహమొకటి పొందినవికారాలఁ
బట్టైన జీవుఁడొకఁడు ప్రాణములేడు
కట్టిడి చిత్తమొకటి కరణములైతేఁ బది
యిట్టిదివో మాజన్మ మిందేమి నిజము

మొదలి ప్రకృతొకటి ముంచినగుణాలు మూఁడు
కదియు మోహ మొకటి కర్మాలు పెక్కు
పొదలుఁగర్మ మొకటి భోగా లనంతములు
యిదివో మా జన్మ మెంచ మిందేది నిజము

అంతరాత్మ శ్రీ వేంకటాద్రీశుఁ డొక్కఁడే
చింతించ జీవులైతే సేనాసేన
అంతలో నీతని శరణని బ్రతికితిఁగాక
యెంతలేదు మాజన్మ మిందేది నిజము 

Watch for audio - https://youtu.be/sC7X7OX7UGE