Saturday, December 30, 2023

నిత్యానంద ధరణీధర - Nityananda Dharanidhara

నిత్యానంద ధరణీధర ధరారమణ
కాత్యాయనీ స్తోత్రకామ కమలాక్ష

అరవిందనాభ జగధాధార భవదూర
పురుషోత్తమ నమో భువనేశా
కరుణాసమగ్ర రాక్షసలోకసంహార-
కరణ కమలాదీశ కరిరాజవరద

భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద
సాగరనిజావాస సకలాధిప
నాగారిగమన నానావర్ణనిజదేహ
భాగీరథీజనక పరమ పరమాత్మ

పావన పరాత్పర శుభప్రద పరాతీత
కైవల్యకాంత శృంగారరమణ
శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో
దేవతారాద్య సుస్థిరకృపాభరణ 


పురుషుల నీ గతి - Purushula Nigati

పురుషుల నీ గతి బోధించి బోధించి
సురతసమాధియందుఁ జొక్కించే రదివో

కొంకక సతుల నేటి గురువు లందరికి
కంకిగా మర్మాలు సోఁకఁగ హర్షించి
లంకెలను బంచాంగుళహస్త మస్తకమున
వుంకువఁ దమ యంగము వుపదేశించేరు

మదనమంత్రములెల్ల మరి చెవిలోనఁ జెప్పి
మొదల నఖాంకురపుముద్రలు వెట్టి
పది మారులుఁ దమ్ములప్రసాదములు వెట్టి
వుదుట సంసారబ్రహ్మ ముపదేశించేరు

బడలించి అనంగ పరవస్తువును జూపి
కడపట విరక్తిఁ గడు బోధించి
తడవి శ్రీవేంకటేశు దాసులఁ దప్పించి
వుడివోని జీవులకు నుపదేశించేరు 


నీవే ఇంత సేయఁగాను - NIVE INTA SEYAGANU

నీవే ఇంత సేయఁగాను నేఁ డిదిగో బాలకృష్ణ
వావులు యెవ్వరికైనా వాడలోన నున్నవా

చలివాసె గొల్లెతలు సారె నిన్ను నెత్తుకోఁగా
వొలుగులువారె మోహ మూఁచి పాడఁగా
పలుకులకొంకు దీరె పక్కున నిన్నుఁ దిట్టఁగా
బలుమొగలకు నాండ్లు పంపుసేతురా

వింత దీరెఁ గొమరెలు వీదుల నిన్నాడించఁగా
సంతలాయ నిండ్లు నీసంగాతాలను
జంతలైరి లోలోనే సారె నిన్ను ముద్దాడఁగా
కొంతయినా నత్తలకు కోటరాలు సేతురా

సిగ్గెడలెఁ గన్నెలు నీచెలుములు సేయఁగాను
నిగ్గులఁ గళలు మించె నీతో నవ్వఁగా
అగ్గమై శ్రీవేంకటాద్రి నందరినిఁ గూడితివి
వొగ్గి చుట్టాలలోనెల్లా వోజలు నేరుతురా 


పిడికిట తలంబ్రాల - Pidikita Talambrala

పిడికిటి తలంబ్రాల పెండ్లికూఁతురు కొంత
పెడమరలి నవ్వీనె పెండ్లి కూఁతురు

పేరుకల జవరాలె పెండ్లికూఁతురు పెద్ద-
పేరులముత్యాలమేడ పెండ్లికూఁతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లికూఁతురు విభుఁ
బేరు కుచ్చ సిగ్గువడీఁ బెండ్లికూఁతురు

బిరుదు పెండెము వెట్టెఁ బెండ్లికూఁతురు నెర-
బిరుదు మగనికంటెఁ బెండ్లికూఁతురు
పిరిదూ రినప్పుడె పెండ్లికూఁతురు పతిఁ
బెరరేఁచీ నిదివో పెండ్లికూఁతురు

పెట్టెనె పెద్దతురుము పెండ్లికూఁతురు నేఁడె
పెట్టెఁడు చీరలుగట్టెఁ బెండ్లికూఁతురు
గట్టిగ వేంకటపతికౌఁగిటను వడి-
వెట్టిన నిధానమైన పెండ్లికూఁతురు 


ఎవ్వరు గలరీతనికిఁక - Evvaru Galaritanikika

ఎవ్వరు గలరీతనికిఁక నేమిటికిని వెరవకు మన-
నెవ్వరుగలరాత్మరక్ష యేప్రొద్దునుఁ జేయను

పసిబాలకు బండివిరిగి పడి మేనెల్ల నొచ్చెను
కసుగందుకు నీరుపాముకాటున మై గందెను
నసికొట్లఁగోడెచేత నరుమాయను శిశువింతయు
వసముగాని చను ద్రావినవలనఁ బాపఁడు వాడెను

పెనుమాఁకుల పైపాటున బెదరి వెరచెఁ బిన్నవాఁడు
ఘనమగు సుడిగాలి దాఁకి కనుమూయనోపఁడు
అనువున వేంకటగిరిపై నన్నిసంకటములుఁ బాసి
మునిజనముల హృదయగేహముననుండెడి దేవుఁడు 


ఎంత మహిమో నీది - Yenta Mahimo Nidi

ఎంత మహిమో నీది యెవ్వరి కలవిగాదు
చింతించితే దాసులకుఁ జేపట్టుఁ గుంచమవు

వూరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు
సారెకుఁ దర్కవాదాల సాధింపరాదు
ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు
భారములేనియట్టి భక్తసాధ్యుఁడవు

మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు
ధిక్కరించి నేర్పులఁ దెలియరాదు
వెక్కసాన భూముల వెదకి తెలియరాదు
మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు

చెలరేఁగి తపములు చేసినా నెఱఁగరాదు
యిల నెన్ని చదివినా నెఱఁగరాదు
నెలవై శ్రీవేంకటేశ నీదాసానుదాసులఁ
గొలిచితేఁ జాలు గక్కునఁ గృపసేతువు


ఆపాటి కాపాటి - Apati Kapati

ఆపాటి కాపాటి అంతే చాలు
యేపొద్దు నీజాడ లెల్ల నెరఁగనా నేను

ప్రేమము లేనిమాట పెదవిపైనె వుండు
కామించని చూపు లెల్లఁగడల నుండు
ఆముకొని తలపోఁత లాతుమలోననె వుండు
యేమిటికి నును ముట్టే వెరఁగనా నేను

తమి లేనిపొందికలు తనువుమీఁదనె వుండు
కొమరాఁక లెల్ల గోరికొనల నుండు
అమరని సరసాలు ఆసాసలై యండు
యిముడకు మమ్ము నంతే నెరఁగనా నేను

అంకెకు రానివేడుక లరమరపుల నుండు
లంకె గానిపెనఁగులు లావుల నుండు
పొంకపు శ్రీవేంకటేశ భోగించితివి నన్ను
యింకా నేల అనుమానా లెరఁగనా నేను 


చదివి బతుకరో - Chadivi Batukaro

చదివి బతుకరో సర్వ జనులు మీరు
కదిసి నారాయణాష్టాక్షర మిదియే

సాదించి మున్ను శుకుఁడు చదివినట్టి చదువు
వేదవ్యాసులు చదివినచదువు
ఆది కాలపు వైష్ణవులందరి నోటి చదువు
గాదిలి నారాయణాష్టాక్షర మిదియే

సతతము మునులెల్ల చదివినట్టి చదువు
వెతదీర బ్రహ్మ చదివినచదువు
జతనమై ప్రహ్లాదుఁడు చదివి నట్టి చదువు
గతిగా నారాయణాష్టాక్షర మిదియే

చలపట్టి దేవతలు చదివినట్టి చదువు
వెలయ విప్రులు చదివేటి చదువు
పలుమారు శ్రీ వేంకటపతినామమై భువిఁ
గలుగు నారాయణాష్టాక్షర మిదియే 


గరుడగమన గరుడధ్వజ - Garudagamana Garuḍadhvaja

గరుడగమన గరుడధ్వజ
నరహరి నమో నమో నమో

కమలాపతి కమలనాభా
కమలజ జన్మకారణక
కమలనయన కమలాప్తకుల
నమో నమో హరి నమో నమో

జలధిబంధన జలధిశయన
జలనిధిమధ్య జంతుకల
జలధిజామాత జలధిగంభీర
హలధర నమో హరి నమో

ఘనదివ్యరూప ఘనమహిమాంక
ఘనఘనాఘనకాయవర్ణ
అనఘ శ్రీవేంకటాధిప తేహం
అనుపమ నమో హరి నమో 


Thursday, December 21, 2023

ఎదుటనే వున్నాఁడు - Edutane Vunnadu

ఎదుటనే వున్నాఁడు యిదె నీ రమణుఁడు
అదనిదె సరసము లాడవే యిపుడూ

కలికితనంబుల కతకారీ
పలుకవే వో చిలుకలకొలికీ
తలిరు మోవిదంతపుబొమ్మా
సెలవుల నవ్వేనే చెలువునితోడా

చక్కఁదనంబుల జవరాలా
నిక్కిచూడవే నీ పతిని
జక్కవ చన్నుల జగ బిరుదా
మొక్కఁగదవే మొగనికి నిపుడు

పొసఁగిన నేర్పుల పూబంతీ
కొసరవే రతుల చిగురుఁబోఁడి
వసమై నిన్నేలె వలపులను
వెసఁ బొగడవే శ్రీవేంకట విభుని 


హరిహరి నీమాయాజగమిది - Hari Hari Ni Mayajagamidhi

హరిహరి నీమాయాజగమిది అండనే చూచుచు నవ్వుచును
అరసి యందులో నిను భావించేటి ఆత్మభావమిది యెన్నఁడొకో

సకలోద్యోగంబులు మాని సకలోపాయంబులు విడిచి
సకలేంద్రయముల జాలటు మాని సకలవిషయముల రహితుఁడై
సకలముఁ దనవలె భావించి సర్వాంతరాత్మవు నినుఁ దెలిసి
అకలంకంబున నుండెడి భావంబది యిఁక నెన్నఁడొకో

ఘనమగు కోర్కులఁ జాలించి ఘనకోపంబు నివారించి
ఘనకాముకత్వముల నటు దనిసి ఘనమగు నాసలఁ దొలఁగించి
ఘనముఁ గొంచముల నినుఁ దలఁచి ఘనాఘనుఁడవు నీవనుచు
అనుమానము లటు సుఖియించే దది యిఁక నెన్న డొకో

పరచింతలలోఁ దడఁబడక పరమార్గంబుల కగపడక
పరహింసలకును యెన్నఁడు జొరక పరదూషణలకు నెడగిలిసి
పరదేవుఁడ శ్రీవేంకటభూధరపతి నీకే శరణనుచు
అరమరపుల నేఁ జొక్కితి తనిసేదది యిఁక నెన్నఁడొకో 


పురుషులకు పురుషుఁడవు - Purushulaku Purushudavu

పురుషులకు పురుషుఁడవు పురుషోత్తమా
పురుఁడు లే దిఁక నీకుఁ బురుషోత్తమా

పొలసులాడకు నీవు పురుషోత్తమా
బులిసి లోఁగఁగనేల పురుషోత్తమా
పొలమురాజవు నీవు పురుషోత్తమా నీ
పొలఁకు వదే కంబమునఁ బురుషోత్తమా

పొడవులకుఁ బొడవైన పురుషోత్తమా బిరుదు
పుడిసిళ్లఁ జల్లితివి పురుషోత్తమా
పుడికి సతిఁ గైకొంటి పురుషోత్తమా
పొడమెఁ జీఁకటితప్పు పురుషోత్తమా

బూటకపుబుద్ధిగల పురుషోత్తమా
పోటి గుఱ్ఱపుఁ బసల పురుషోత్తమా
మేటి శ్రీవేంకటముమీఁద నొసఁగే విదివో
పూటవూఁటవరాలు పురుషోత్తమా 


హరి నీ ప్రతాపమున - Hari Ni Pratapamuna

హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున
సరి వేరీ నీకు మరి సర్వేశ్వరా

నీవు నీళ్ళు నమలితే నిండెను వేదములు
యీవలఁ దలెత్తితేనే యింద్రపదవులు మించె
మోవ మూఁతి గిరిపితే మూడులోకాలు నిలిచె
మోవిఁ బార నవ్వితేనే ముగిసి రసురలు

గోర గీరితే నీరై కొండలెల్లఁ దెగఁబారె
మారుకొంటే బయటనే మడుగులై నిలిచె
చేరి యడుగువెట్టితే శిలకుఁ బ్రాణము వచ్చె
కూరిమిఁ గావలెనంటే కొండ గొడగాయను

కొంగుజారినంతలోనే కూలెను త్రిపురములు
కంగి గమనించితేనే కలిదోషములు మానె
రంగుగ నీశరణంటే రక్షించితి దాసులను
ముంగిట శ్రీవేంకటేశ మూలమవు నీవే 


భారపుటూర్పులతోఁ - Bharaputurpu Turpulatho

భారపుటూర్పులతోఁ బవళించీని వీఁడె
కూరిమిసతులు మేలుకొలుపరమ్మా

వేగినంతకునితఁడు వెలఁదులతోడి రతి
భోగించి వచ్చి నిద్రవోయీని
సోగకనురెప్పలు మూసుక యిప్పుడెంతేసిఁ
జాగరపుఁ బతితొడ చరచరమ్మా

వొప్పైన సతులతో వుదరములోపల
యిప్పుడు నితఁడు సుఖియించీని
దప్పిదేరు తనమోముఁదమ్మితోడనిదె వీఁడె
వుప్పవడముగఁ బాదాలొత్తరమ్మా

సరుగున మేలుకొని సరసపుఁ గౌఁగిట
గరగరికెల నన్నుఁ గలసీని
అరవిరి నురమున అలయుచును వీఁడె
తిరువేంకటపతిఁ దెలుపరమ్మా 


Saturday, December 16, 2023

ఆర్పులు బొబ్బలు - Arpulu Bobbalu

ఆర్పులు బొబ్బలు నవె వినుఁడు
యేర్పడ నసురల నిటువలె గెలిచే

కూలిన తలలును గుఱ్ఱపు డొక్కలు
నేలపైఁ బారిన నెత్తురులు
వోలిఁ జూడుఁ డిదె వుద్ధగళలీ రణ-
కేలిని విష్వక్సేనుఁడు గెలిచె

పడిన రథంబులు బాహుదండములు
కెడసిన గజములు గొడగులును
అడియాలము లివె అక్కడ విక్కడ
చిడుముడి విష్వక్సేనుఁడు గెలిచె

పగుల పగుల వృషభాసురునిఁ జంపె
పగ నీఁగె అతని బలములతో
అగపడి శ్రీవేంకటాధిపు పంపున
జిగిగల విష్వక్సేనుఁడు గెలిచె 


ఆఱడిఁ బెట్టక - Aradi Bettaka

ఆఱడిఁ బెట్టక మాతో నానతీవయ్యా
మీఱరాదు ఇచ్చకపుమీవారమే నేము

చుట్టరికముసేసుక సుద్దులెల్లఁ జెప్పేవు
నెట్టన నీరచనలు నిజమా యిది
చెట్టాపట్టాలు వట్టుక సిగ్గులు విడిపించేవు
నట్టనడుమ నివెల్లా నమ్మవచ్చునా

సారె సారె నియ్యరానిచనవులెల్లా నిచ్చేవు
కోరి యివెల్లా నియ్యకోలవునా
పేరడిగా ననుపులే పెనఁచేవు నాతోను
సారెకు నిటువలెనే సతములయ్యేనా

పరపుపైఁ బవళించి బాసలెల్లాఁ జేసేవు
అరసే నింకొక్కమాఁటు అవునా యిది
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
మురిపెముతోడుతను మొక్కుదునా యిందుకు