Saturday, December 16, 2023

ఆఱడిఁ బెట్టక - Aradi Bettaka

ఆఱడిఁ బెట్టక మాతో నానతీవయ్యా
మీఱరాదు ఇచ్చకపుమీవారమే నేము

చుట్టరికముసేసుక సుద్దులెల్లఁ జెప్పేవు
నెట్టన నీరచనలు నిజమా యిది
చెట్టాపట్టాలు వట్టుక సిగ్గులు విడిపించేవు
నట్టనడుమ నివెల్లా నమ్మవచ్చునా

సారె సారె నియ్యరానిచనవులెల్లా నిచ్చేవు
కోరి యివెల్లా నియ్యకోలవునా
పేరడిగా ననుపులే పెనఁచేవు నాతోను
సారెకు నిటువలెనే సతములయ్యేనా

పరపుపైఁ బవళించి బాసలెల్లాఁ జేసేవు
అరసే నింకొక్కమాఁటు అవునా యిది
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
మురిపెముతోడుతను మొక్కుదునా యిందుకు 


No comments:

Post a Comment