Thursday, December 21, 2023

హరి నీ ప్రతాపమున - Hari Ni Pratapamuna

హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున
సరి వేరీ నీకు మరి సర్వేశ్వరా

నీవు నీళ్ళు నమలితే నిండెను వేదములు
యీవలఁ దలెత్తితేనే యింద్రపదవులు మించె
మోవ మూఁతి గిరిపితే మూడులోకాలు నిలిచె
మోవిఁ బార నవ్వితేనే ముగిసి రసురలు

గోర గీరితే నీరై కొండలెల్లఁ దెగఁబారె
మారుకొంటే బయటనే మడుగులై నిలిచె
చేరి యడుగువెట్టితే శిలకుఁ బ్రాణము వచ్చె
కూరిమిఁ గావలెనంటే కొండ గొడగాయను

కొంగుజారినంతలోనే కూలెను త్రిపురములు
కంగి గమనించితేనే కలిదోషములు మానె
రంగుగ నీశరణంటే రక్షించితి దాసులను
ముంగిట శ్రీవేంకటేశ మూలమవు నీవే 


No comments:

Post a Comment